- మూడు లక్షల టన్నుల ధాన్యానికి అందుబాటులో 85 వేల టన్నుల స్థలమే
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆఫీసర్ల ప్లాన్
యాదాద్రి, వెలుగు: కొనుగోలు చేసిన వడ్లను, మరాడించిన బియ్యాన్ని నిల్వ చేయడం సమస్యగా మారింది. ప్రతీ సీజన్లో వడ్ల కొనుగోలు చేసి నిల్వ చేయడం ఒకెత్తయితే... మిల్లర్ల నుంచి సీఎంఆర్ రాబట్టడం, ఆ తర్వాత వ్యాగన్లు సరిగా రాకపోవడంతో ఇతర రాష్ట్రాలకు బియ్యం రవాణా సమస్యగా మారి స్థల సమస్య తలెత్తుతోంది. యాదాద్రి జిల్లాలో ప్రతి సీజన్లో 6 లక్షల నుంచి 7 లక్షల టన్నుల వడ్ల దిగుబడి వస్తోంది. ఇందులో రైతుల అవసరాలు, మిల్లర్లు, దళారులు కొనుగోలు చేయగా ప్రతి సీజన్లో 2.50 లక్షల టన్నుల నుంచి 3.50 లక్షల టన్నులకు మించి వడ్లను సివిల్ సప్లయ్ కొనుగోలు చేస్తోంది. ఈ లెక్కన ప్రతి సీజన్లో 3 లక్షల టన్నుల వడ్లు నిల్వ చేయడానికి స్థలం అవసరం పడుతోంది.
అయితే జిల్లాలోని మిల్లుల్లో 2.50 లక్షల టన్నులకు సరిపడా స్పేస్ ఉన్నా.. మిల్లింగ్ చేసే విషయంలో కొందరు మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రెండు నుంచి మూడు సీజన్లకు సంబంధించిన వడ్లు మిల్లుల్లో నిల్వ ఉంటున్నాయి. ఈ విధంగా మిల్లుల పరిమితికి మించి వడ్లు స్లాక్ ఉంటోంది.
మిల్లుల్లోనే పాత స్టాక్..
జిల్లాలోని మిల్లుల్లో 2022-23 యాసంగి సీజన్ నుంచి 2024-25 యాసంగి సీజన్ వరకూ మూడు సీజన్లకు సంబంధించిన 2.20 లక్షల టన్నుల వడ్లు నిల్వ ఉన్నాయి. పైగా ఈ సీజన్లో రైతుల నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసిన వడ్లను దింపుకుంటున్నారు. అయితే ఈ వానాకాలం సీజన్లో 3 లక్షల టన్నుల వడ్లను సివిల్ సప్లయ్ కొనుగోలు చేయడానికి తగిన ఏర్పాట్లను చేసింది. అయితే మిల్లులోనే వాటి పరిమితికి మించి వడ్ల స్టాక్ ఉంది.
3 లక్షల టన్నుల నిల్వ స్పేస్ అవసరం
మిల్లుల్లోనే పాత స్టాక్ ఉండడంతో ఇప్పుడు కొనుగోలు చేసిన వడ్ల నిల్వ విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. ఈ వానాకాలం సీజన్లో కొనుగోలు చేయాల్సిన 3 లక్షల టన్నుల వడ్లను నిల్వ చేయడానికి స్పేస్ అవసరం పడనుంది. జిల్లాలోని ఎఫ్సీఐ గోడౌన్లలో 50 వేల టన్నులు, రఘునాథపల్లిలోని గోడౌన్లో 10 వేలు, వంగపల్లి గౌడోన్లలో మరో 5 వేల టన్నుల వడ్లను నిల్వ చేయడానికి అవసరమైన స్పేస్ ఉంది. మొత్తంగా 85 వేల టన్నులు స్పేస్ అందుబాటులో ఉండగా మరో 2.15 లక్షల టన్నుల వడ్లను నిల్వ చేయడానికి స్పేస్ అవసరం పడనుంది
ఇతర జిల్లాలకు లక్ష టన్నుల ప్రపోజల్
నిల్వ సమస్యను అధిగమించడానికి సివిల్సప్లయ్ డిపార్ట్మెంట్ ప్రయత్నాలు ప్రారంభించింది. స్థానిక మిల్లర్లకు ఎక్కువ స్టాక్ ఇచ్చి.. ఇబ్బందులు పడడం కంటే.. ఇతర జిల్లాలకు స్టాక్ పంపించాలన్న ఆలోచనకు సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ వచ్చింది. ఇందులో భాగంగానే కొనుగోలు చేసే వడ్లలో లక్ష టన్నులు ఇతర జిల్లాలకు పంపించేందుకు అనుమతి కోరుతూ హయ్యర్ ఆఫీసర్లకు ప్రపోజల్ పెట్టి, నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది.
హయ్యర్ ఆఫీసర్ల నుంచిఅనుమతి రావడమే ఆలస్యం.. కొనుగోలు చేసిన వడ్లను ముందుగా ఇతర జిల్లాలకు పంపించడానికి రెడీగా ఉంది. కాగా వానలు తగ్గిపోవడతో వడ్ల కొనుగోలు స్పీడ్ అందుకుంది. ఏర్పాటు చేసిన 330 సెంటర్లలో 266 సెంటర్లలో కొనుగోలు జరుగుతోంది. ఇప్పటివరకూ 5300 మంది రై తులకు చెందిన 45 వేల టన్నుల వడ్లను సివిల్ సప్లయ్ కొనుగోలు చేసింది.
