విష ప్ర‌యోగానికి గురై 15 జంతువులు మృతి

విష ప్ర‌యోగానికి గురై 15 జంతువులు మృతి

విష ప్ర‌భావం చేత ఆరు కుక్కులు, తొమ్మిది పందులు మృతి చెందిన ఘ‌ట‌న మేడ్చ‌ల్ జిల్లాలోని ఘ‌ట్‌కేస‌ర్ సమీపంలో జ‌రిగింది. ఘ‌ట్‌కేస‌ర్ స‌మీపంలోని కొరేముల్ల గ్రామానికి చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు ఈ ఘోరానికి కార‌ణంగా తెలిసింది. స్థానికంగా నివాస‌ముంటున్న బిలిజి భిక్ష‌ప‌తి అనే వ్య‌క్తి.. జంతువుల సంక్షేమ సంస్థ అయిన కంపారియోనేట్ సొసైటీ ఫర్ యానిమల్స్ (CSA) కు ఫిర్యాదు ఇవ్వ‌డంతో ఈ దారుణం గురువారం వెలుగులోకి వ‌చ్చింది. రాబిస్ వ్యాధి సోకిన కుక్క‌ను చంపేందుకు ఇద్ద‌రు వ్య‌క్తులు ఈ విష ప్ర‌యోగానికి పూనుకున్నార‌ని, ఈ దుశ్చ‌ర్య వ‌ల్ల 15 మూగ జంతువులు మృతి చెందిన విషయం స్థానికుల ద్వారా తెలిసిందని సొసైటీ ప్ర‌తినిధులు తెలిపారు.

చ‌నిపోయిన జంతువుల కాళ్ల‌ను క‌ట్టేసి వాటిని ద‌గ్గ‌ర‌లోని నీటి గుంత‌లో ప‌డేశార‌ని, ఇది చాలా అమానుషమైన చ‌ర్య అనీ సొసైటీ ఫౌండ‌ర్ ప్ర‌వ‌ళిక‌ అన్నారు. రాబిస్ వ్యాధి సోకిన జంతువుల‌ను చంపడం వ్యాధికి ప‌రిష్కారం కాద‌ని, వాటికి వైద్యుల చేత యాంటి-రాబిస్ టీకాల‌ను వేయించాల‌ని ఆమె కోరారు. జంతువుల మృతికి కార‌ణ‌మైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా ఆమె ఘ‌ట్‌కేస‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. చ‌నిపోయిన జంతువుల‌ను శ‌వ‌ప‌రీక్ష నిమిత్తం ప‌శు వైద్య‌శాల‌కు త‌ర‌లించారు.