దంపతుల్ని ఢీకొట్టిన ట్రక్కు..భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం

దంపతుల్ని ఢీకొట్టిన ట్రక్కు..భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం
  • అబ్దుల్లాపూర్​మెట్​లో ఘటన

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: రోడ్డు దాటుతున్న భార్యాభర్తలను ట్రక్కు ఢీకొట్టడంతో భర్త స్పాట్‌‌‌‌లోనే చనిపోగా.. భార్య తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట్ కు చెందిన కుంచపు శ్రీనివాస్ (48) లక్ష్మీ(39) దంపతులు అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఇనాంగూడా గ్రామం యశోద నగర్ లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు  కుమార్తె రాజేశ్వరి (19) , కుమారుడు రాంబాబు(17) ఉన్నారు. వ్యక్తిగత పని నిమిత్తం ఆదివారం ఉదయం కీసరకు వెళ్లారు. సాయంత్రం ఇనాంగూడాకు వచ్చే క్రమంలో ఇనాంగూడా హెచ్‌‌‌‌పీ పెట్రోల్​బంక్​ వద్ద  హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారి దాటుతుండగా కంటైనర్​లారీ దంపతులను ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో శ్రీనివాస్​స్పాట్‌‌‌‌లోనే మృతి చెందగా..  భార్య కుంచపు లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. లక్ష్మిని చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని మనోజ్ఞ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్​డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్​మెట్ ఇన్​స్పెక్టర్ వి. అశోక్​రెడ్డి తెలిపారు.