ఇక మీరు మారరా..? LOC వెంబడి పాక్ ఆర్మీ కాల్పులు..15 మంది మృతి

ఇక మీరు మారరా..? LOC వెంబడి పాక్ ఆర్మీ కాల్పులు..15 మంది మృతి

శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‎తో భారత భద్రతా దళాలు ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో కడుపు మంటతో రగిలిపోతున్న పాక్ ఆర్మీ సరిహద్దుల్లో తమ అక్కసును వెళ్లగక్కుతుంది. ఎల్ఓసీ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి విచక్షణరహితంగా కాల్పులకు తెగబడింది. మంగళవారం (మే 6) రాత్రి నుంచి నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ సైనికులు ఏకపక్ష కాల్పులు,  భారీ షెల్లింగ్ దాడులకు పాల్పడ్డారు. 

ఈ దాడుల్లో పూంచ్, తంగ్ధర్ ప్రాంతాలలో 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోగా.. 43 మంది గాయపడ్డారని భారత సైన్యం తెలిపింది. పూంచ్ జిల్లాలోని సెంట్రల్ గురుద్వారా శ్రీ గురు సింగ్ సభా సాహిబ్‌పై పాకిస్తాన్ దళాలు చేసిన దాడిలో 10 మంది మరణించారని అధికారులు తెలిపారు. పాక్ సైనికుల దాడిలో ఎల్‌ఓసీ, ఐబీ వెంబడి పలువురి ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఉగ్రవాదుల ఏరివేత కోసం భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన వెంటనే దానికి ప్రతిస్పందనగా పాక్ ఆర్మీ బార్డర్లో కాల్పులకు జరిపిందని వెల్లడించింది.

పాక్ సైనికులకు భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. పాక్ ఆర్మీ కాల్పులను సమర్ధవంతంగా తిప్పికొట్టింది. కుప్వారా, రాజౌరి-పూంచ్ సెక్టార్లలోని పాకిస్తాన్ ఆర్మీ పోస్టులపై భారత సైన్యం విరుచుకుపడింది. భారత ఆర్మీ కాల్పుల్లో పాక్‎కు భారీ సైనిక ప్రాణనష్టం జరిగిందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఎల్ఓసీ వెంబడి పాక్ ఆర్మీ విచక్షణరహితంగా కాల్పులకు తెగబడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 

►ALSO READ | Operation Sindoor: అమాయకులను చంపిన వారినే మట్టుబెట్టాం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

ఆ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో ఫోన్‌లో మాట్లాడారు. ఎల్‌ఓసీ, ఐబీ సమీపంలోని పౌరులను ఖాళీ చేయించి.. సురక్షి ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పౌరుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని అధికారులకు స్పష్టం చేశారు. అమిత్ షా ఆదేశాల మేరకు ఎల్ఓసీ వెంబడి ఉన్న గ్రామాల్లోని ప్రజలను భద్రతా దళాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.