నేషనల్​ సైన్స్​ డే పోటీల్లో అమ్మాయిల సత్తా

నేషనల్​ సైన్స్​ డే పోటీల్లో అమ్మాయిల సత్తా

హైదరాబాద్, వెలుగు: నేషనల్​ సైన్స్​ డేలో భాగంగా వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో అమ్మాయిలు సత్తా చాటారు. నాలుగు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో మొత్తంగా 20 మందిని విజేతలుగా ప్రకటిస్తే.. అందులో 15 మంది అమ్మాయిలే ఉండడం విశేషం. ఆ నాలుగు విభాగాల్లోనూ ఫస్ట్​, సెకండ్​ ప్రైజ్​లను పొందిందీ అమ్మాయిలే. నేషనల్​ సైన్స్​ డేలో భాగంగా డిపార్ట్​మెంట్​ ఆఫ్​ సైన్స్​ అండ్​ టెక్నాలజీ, తెలంగాణ స్టేట్​ కౌన్సిల్​ ఆఫ్​ సైన్స్ ​అండ్​ టెక్నాలజీ (టీఎస్​ కాస్ట్​), ఎన్విరాన్​మెంట్ ​ప్రొటెక్షన్​ ట్రైనింగ్​ అండ్​ రీసెర్చ్​ ఇన్‌స్టిట్యూట్​(ఈపీటీఆర్ఐ)లు కలిసి ఇటీవల స్కూల్​ విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహించారు. శనివారం విజేతలను ప్రకటించారు. 

‘దేశీయ సాంకేతికతతో వికసిత్​ భారత్’ అనే థీమ్​తో నిర్వహిస్తున్న నేషనల్​ సైన్స్​ డేలో.. వ్యర్థాల తగ్గింపు, ఇ–వేస్ట్​ తగ్గింపు, ఆరోగ్యకరమైన అలవాట్లు, ప్లాస్టిక్​ వాడకాన్ని తగ్గించడం, నీరు, కరెంట్​ ఆదా వంటి విషయాలపై నాలుగు విభాగాలుగా కాంపిటీషన్స్ పెట్టారు. ఆయా అంశాలపై పాటలు, కవిత్వం, పెయింటింగ్​, వక్తృత్వ (ప్రసంగం) పోటీలను పెట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 396 మంది పోటీలో పాల్గొనగా.. 20 మందిని విజేతలుగా ప్రకటించారు. ఒక్కో విభాగంలో ఐదుగురిని ఎంపిక చేశారు. వీరందరికీ ఈ నెల 28న వరంగల్​లోని రీజనల్​ సైన్స్​ సెంటర్​లో నిర్వహించే నేషనల్​ సైన్స్​ డే వేడుకల్లో బహుమతులను ప్రదానం చేస్తారు.