
- ఎకరాల్లో కొని.. గుంటలు, గజాల లెక్క చేసి అమ్ముతున్న వ్యాపారులు
- సిటీ శివార్లతో పాటు పల్లెల్లోనూ జోరుగా రియల్ దందా
- ఇట్లయితే కష్టమేనంటున్న రైతు సంఘాల నేతలు
హైదరాబాద్, వెలుగు: పచ్చని పొలాలతో కళకళలాడాల్సిన భూములు రియల్ ఎస్టేట్ దందాకు అడ్డాలుగా మారుతున్నాయి. ఎక్కడికక్కడ వెంచర్లు వెలుస్తున్నాయి. గుంటలు, గజాలు లెక్క వాటిని వ్యాపారులు అమ్మేస్తున్నారు. దీంతో నానాటికీ వ్యవసాయ భూములు తగ్గిపోతున్నాయి. గడిచిన ఐదేండ్లలోనే దాదాపు 15 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు.. రియల్ వెంచర్లుగా మారిపోయాయి. ఒకప్పుడు హైవేలకు పరిమితమైన వెంచర్లు.. ఇప్పుడు మారుమూల గ్రామాల్లో రోడ్డుకు అనుకుని ఉన్న భూములకూ విస్తరించాయి. ప్రభుత్వం నుంచి ఏదైనా ఇండస్ట్రియల్ పార్క్ ప్రకటిస్తే ఆయా ఏరియా పరిధిలోని వ్యవసాయ భూముల్లో కొనుగోళ్లు, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక, ధరణి అమల్లోకి వచ్చిన గత రెండేండ్లలోనే దాదాపు 28 లక్షల ఎకరాల సాగు భూములు చేతులు మారాయి. దీంతో ప్రభుత్వానికి దాదాపు రూ. 3 వేల కోట్ల ఆదాయం సమకూరింది. భూముల్లో పంట వేయకపోయినా, ప్లాట్లుగా హద్దులు పాతుకున్నప్పటికీ రైతు బంధు, రైతుబీమా కోసం వాటిని వ్యవసాయ భూములుగానే చూపెడుతున్నారు. 2018లో 49.50 లక్షల మంది చేతిలో వ్యవసాయ భూములు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 65 లక్షలకు చేరుకున్నది. ధరణిలో గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తూ.. ఫీల్డ్‌కు వచ్చేసరికి వాటిని గజాల్లో కొలిచి హద్దులు ఇస్తున్నారు.
నాలా కన్వర్షన్లో చూపెట్టది..!
నాలా కన్వర్షన్లో చూపెడుతున్న విస్తీర్ణం తక్కువే ఉన్నది. ఈ రెండేండ్ల కాలంలో దాదాపు 70 వేల ఎకరాలు నాన్ అగ్రికల్చర్‌కు మారినట్లు లెక్కల్లో ప్రభుత్వం చూపెడుతున్నది. అయితే.. నాలాకు మార్చుకోకుండా, వ్యవసాయం చేయకుండా ప్లాట్లుగా గుంటల్లో క్రయ, విక్రయాలు జరుగుతున్న భూములు లక్షల ఎకరాల్లో ఉంటున్నాయి. చిన్న కమతాల సంఖ్యనే ఇందుకు ఉదాహరణ. నాలుగేండ్లలో దాదాపు 16 లక్షల మంది కొత్తగా వ్యవసాయ భూముల పట్టాలు పొందారు.
రైతుబంధు, రైతుబీమా అంటూ ఆశలు
వ్యవసాయ భూములకు ప్రభుత్వం నుంచి రైతుబంధు, రైతుబీమా వంటివి అందుతుండటంతో వాటిని ప్లాట్లుగా చేసుకుంటున్నప్పటికీ నాలాకు మార్చుకోవడం లేదు. 10 గుంటల భూమి ఉంటే ఏడాదికి రూ. 2,500 రైతుబంధు అందుతున్నది. దీంతో పాటు రూ. 5 లక్షల రైతుబీమా కవరేజీ వస్తున్నది. పైగా నాలా కన్వర్షన్ ఫీజులు కూడా తప్పించుకుంటున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆయా వ్యవసాయ భూముల్లో శ్రీగంధం, రెడ్ స్యాండిల్ మొక్కలు పెడుతాం.. వాటితోనూ కొంతకాలానికి ఆదాయం వస్తుదంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిజినెస్ చేస్తున్నారు. పట్టణాల్లో ప్లాట్లకు ఎక్కువ ధరలు ఉండటం, కబ్జాలు ఉంటాయనే భయంతో చాలా మంది రోడ్లకు అనుకుని వ్యవసాయ భూములను గుంటల్లో కొనుకుంటున్నారు.
భూములు కొంటున్నది వాళ్లే..
భూమి సారవంతమైందా.? కాదా అనేది కాదు.. సద రు భూమికి ఎలాంటి ఆటంకం లేని రోడ్డు, క్లియర్ టైటిల్ ఉన్న సాగు భూమి బంగారంలా అమ్ముడవుతున్నది. లీడర్లు, వ్యాపారవేత్తలు, డాక్టర్లు, ఉన్న తోద్యోగులు, టీచర్లు, ఎన్‌ఆర్‌ఐలు వ్యవసాయ భూముల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నా రు. పక్క భూము లతో సంబంధం లేకుండా నేరుగా ప్లాటులోకి వెళ్లే భూములకు ఎక్కువ రేటు పెడుతున్నారు.
అంతటా ఆ భూములపైనే గురి
రాష్ట్రంలో ఇప్పుడు ఏ ప్రాంతానికి వెళ్లినా వ్యవసాయ భూమి ఎకరాకు కనీసం రూ. 20 లక్షలు ధర పలుకుతున్నది. రోడ్లకు అనుకుని ఉన్న భూములు ఏరియాను బట్టి ఎకరం కోటి, రూ. 2 కోట్లు ఆ పైన ధరలు కూడా ఉంటున్నాయి. ఎకరాల్లో కొనుగోలు చేస్తున్న రియల్ వ్యాపారులు వాటిని విక్రయించేప్పుడు మాత్రం గుంటలుగా మార్చి అమ్ముతున్నారు. ఒక ఎకరం భూమినే పది నుంచి 15 మందికి విక్రయిస్తున్నారు. కొంటున్నవాళ్లు కూడా వాళ్ల అవసరాల మేర తీసుకుంటున్నారు.
30శాతం గ్రామాల్లో..!
రియల్ ఎస్టేట్ వ్యాపారంతో భూములకు అధిక ధరలు పలుకుతుండటంతో రైతులు కూడా వాటిని అమ్ముకునేందుకు మొగ్గుచూపుతున్నారు. మొత్తం కోటి 47 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు సర్కార్ లెక్కలు చెప్తున్నాయి. అయితే రాష్ట్రంలో 12,761 గ్రామాలు ఉంటే 30 శాతం గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నట్లు అంచనా.
భూ వినియోగంపై పాలసీ ఏది?
భూమి వినియోగంపై ఒక స్పష్టమైన విధానం ప్రభుత్వానికి లేకపోతే.. పంటలు పండే భూములన్నీ భవిష్యత్‌లో రియల్ వ్యాపారానికి మారుతాయని రైతుసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి, పత్తి, కంది వంటి పంటలు పండే భూములు.. రియల్‌కు మళ్లడం మంచి పరిణామం కాదంటున్నారు. పట్టణాలకు దగ్గరగా ఉండే గ్రామాల్లో కూరగాయలు పండించే భూముల్లో ఎక్కువగా వెంచర్లు వెలుస్తున్నాయని చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఎంత భూమి ఉన్నది ? ఇందులో ఫారెస్ట్, కొండలు, ఇండస్ట్రీలు, ఇతరత్రా నాన్ అగ్రికల్చర్ యూజ్‌లో ఉన్నదేంత అనేది పక్కాగా లెక్కతీయాలని కోరుతున్నారు. ఒక గ్రామంలో ఎంత భూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడాలనే దానిపై పాలసీ తేవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
లెక్కలు తీయాలి
రాష్ట్రంలో సాగు, ఇతర భూముల వినియోగంపై ఒక స్పష్టమైన విధానం ఉండాలి. లేదంటే వ్యవసాయ భూమి పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు పోయే ప్రమాదం ఉంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించకుండా ఎంతసేపటికీ ఆదాయం ఎట్ల వస్తుందనేదనేది చూస్తున్నది. రికార్డుల్లో సాగు భూమి అనే ఉంటున్నది. అయితే అక్కడ ఇండ్లు కట్టరు.. సాగు చేయరు. ఎంతకాలం అలా ఎవుసం భూమిగా చూపిస్తరు. సాగు చేయకున్నా ఎకరాకు రూ. 5వేల రైతు బంధు అందుతున్న వాటి లెక్కలు తీయాలి. 1.47 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నదంటున్నరు. ఇందులో 1.30 కోట్ల ఎకరాలు సాగు అయితుందని చెప్తున్నదాంట్లో స్పష్టత లేదు. అన్ని తప్పుడు లెక్కలే చూపిస్తున్రు.
- కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక