
హైదరాబాద్, వెలుగు: గృహలక్ష్మి స్కీమ్‌కు బుధవారం వరకు 15 లక్షల అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ నెల 7 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 10వ తేదీ చివరి రోజని జిల్లాల్లో ప్రచారం జరగటంతో 3 రోజుల్లో కలెక్టరేట్లు, తహశీల్దార్ ఆఫీసులకు జనం క్యూ కట్టారు. ప్రభుత్వం అలర్ట్ అయి అప్లికేషన్లకు లాస్ట్ డేట్ అనేది లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని ప్రకటించింది. మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి 3వేల ఇండ్లకు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఒక మహిళకు100 శాతం సబ్సిడీతో 3 దశల్లో రూ. 3 లక్షలు ఇవ్వనుంది.
3 లక్షల అప్లికేషన్లలో 14 వేల మంది అర్హులు
అప్లికేషన్లను గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు, మున్సిపాలిటీల్లో అక్కడి అధికారులు వెరిఫై చేస్తున్నారు. అప్లికేషన్లో స్పష్టం చేసిన వివరాలను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 లక్షల అప్లికేషన్లను వెరిఫై చేయగా.. ఇందులో 14 వేల మందిని అర్హులుగా తేల్చారు. గృహలక్ష్మి స్కీమ్ కు వచ్చిన అప్లికేషన్లు, వెరిఫికేషన్, అర్హుల ఎంపిక అన్ని వివరాలను ఆన్ లైన్ లో ఎంట్రీ చేస్తున్నారు.
అయితే మండల కేంద్రాల్లో కేవలం ఒకరే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉండగా అప్ లోడ్ కు చాలా లేట్ అవుతోందని అధికారులు అంటున్నారు. కాగా, ఈ నెల 25 నుంచి 31 వరకు స్కీమ్ మంజూరు పత్రాలు అందజేయాలని ఇటీవల జిల్లా కలెక్టర్లను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. స్కీమ్ పై ఈ నెల 26న జిల్లా కలెక్టర్లతో ప్రోగ్రెస్ పై ఆరా తీయనున్నారు.