15.5 లక్షల మంది.. వ్యాక్సిన్ తీస్కోలే

15.5 లక్షల మంది..  వ్యాక్సిన్ తీస్కోలే
  • 201 కేసులు.. ఒకరు మృతి
  • రాష్ట్రంలో 15.5 లక్షల మంది ఒక్క డోసూ తీస్కోలే 


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో 201 మంది కరోనా బారిన పడ్డారని హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్ ప్రకటించింది. గురువారం 36,900 మందికి టెస్టులు చేస్తే.. గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌లో 76 మందికి, జిల్లాల్లో 125 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిందని పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,77,747కి పెరిగిందని అధికారులు తెలిపారు. వీరిలో 6,69,857 మంది కోలుకున్నారని, రాష్ట్రంలో మరో 3,887 యాక్టివ్‌‌‌‌ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. హాస్పిటళ్లలో 1,256 మంది చికిత్స పొందుతుండగా, మిగిలిన వాళ్లు హోమ్ ఐసోలేషన్‌‌‌‌లో ఉన్నారన్నారు. కరోనాతో గురువారం ఒకరు చనిపోయారని, మృతుల సంఖ్య 4,003కు పెరిగిందని బులెటిన్‌‌‌‌లో పేర్కొన్నారు. ఎట్ రిస్క్ జాబితాలోని దేశాల నుంచి గురువారం రాష్ట్రానికి వచ్చిన 312 మందిలో ఎవరికీ పాజిటివ్‌‌‌‌ రాలేదని అధికారులు తెలిపారు.

సింగిల్‌‌‌‌ డోసు కోటి 21 లక్షల మందే..
రాష్ట్రంలో సుమారు 15.5 లక్షల మంది కరోనా టీకా ఒక్క డోసు కూడా తీసుకోలేదని అధికారులు చెప్పారు. ఇక, కోటి 21 లక్షల మంది సింగిల్‌‌‌‌ డోసు మాత్రమే వేసుకున్నారని బులెటిన్‌‌‌‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 2 కోట్ల 77 లక్షల 67 వేల మంది వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. ఒక్కొక్కరికీ రెండు డోసుల చొప్పున 5 కోట్ల 5 లక్షల 34 వేల డోసులు వేయాలి. అయితే గురువారం నాటికి 4 కోట్ల 2 లక్షల 98 వేల 242 డోసులు వేశారు. దీనిప్రకారం చూస్తే కోటి 41 లక్షల మంది మాత్రమే వ్యాక్సిన్‌‌‌‌ రెండు డోసులు తీసుకున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది. మొదటి కోటి డోసులు వేయడానికి 165 రోజులు, రెండు కోట్ల డోసులకు 78 రోజులు, మూడు కోట్ల డోసులకు 27 రోజులు పట్టగా..4 కోట్ల డోసులను 38 రోజుల్లో వేశారు.