
- అగ్రి, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో 15 శాతం రిజర్వేషన్
- కనీసం నాలుగేండ్లు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వారికి అవకాశం
- ఈ నెల 19 నుంచి 23 వరకు ఫస్ట్ ఫేజ్ జాయింట్ కౌన్సెలింగ్
హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ, హార్టికల్చర్ , వెటర్నరీ యూనివర్సిటీల పరిధిలోని వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 19 నుంచి 23 వరకు ఫస్ట్ ఫేజ్ జాయింట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని రిజిస్ట్రార్ డాక్టర్ జీఈసీహెచ్ విద్యా సాగర్ తెలిపారు. రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ వర్సిటీ ఆడిటోరియంలో ఆ తేదీల్లో ఉదయం 9:30 గంటలకు కౌన్సెలింగ్ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా తొలిసారిగా వ్యవసాయ కూలీల పిల్లల కోసం బీఎస్సీ (అగ్రికల్చర్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో 15 శాతం సీట్లను ప్రత్యేక కోటాగా కేటాయించామని రిజిస్ట్రార్ విద్యాసాగర్ వెల్లడించారు.
నాలుగో తరగతి నుంచి 12వ తరగతి వరకు కనీసం నాలుగేళ్లు గవర్నమెంట్ స్కూళ్లు, కాలేజీలు లేదా రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివిన విద్యార్థులు ఈ కోటాకు అర్హులని ఆయన తెలిపారు. అలాగే, విద్యార్థి లేదా వారి తల్లిదండ్రుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గ్రామీణ ఉపాధి హమీ పథకం కార్డు ఉండాలన్నారు. విద్యార్థి, వారి తల్లిదండ్రులు లేదా తాతల పేరిట ఎలాంటి వ్యవసాయ భూమి ఉండకూడదన్నారు.
అయితే, ఒక ఎకరంలోపు భూమి ఉన్నవారు, పైన పేర్కొన్న అర్హతలు కలిగి ఉంటే, ఈ కోటాకు అర్హులని రిజిస్ట్రార్ వివరించారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు అర్హతలకు సంబంధించి అన్ని సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. బీఎస్సీ (అగ్రికల్చర్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల మొదటి సెమిస్టర్ ఫీజు రూ.49,560గా నిర్ణయించామని తెలిపారు. పూర్తి వివరాలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.pjtsau.edu.inలో చూడవచ్చని సూచించారు.