హనుమకొండ సిటీ, వెలుగు: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'స్టెమ్ 60' కార్యక్రమంతో జేఈఈ అడ్వాన్స్డ్ కు 15 మంది విద్యార్థినులు అర్హత సాధించినట్లు ఐటీడీఏ అధికారులు తెలిపారు. మంత్రి సీతక్క కృషితో హనుమకొండ బాలసముద్రంలోని ఎస్టీ స్టడీ సర్కిల్ లో స్టెమ్ 60 పేరుతో ఉమ్మడి జిల్లాలోని ఎస్టీ బాలబాలికలకు జేఈఈ, నీట్ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో శిక్షణ పొందిన 15 మందికి జేఈఈ అడ్వాన్స్డ్ కు అర్హత లభించిందని, అందులో ఐదుగురు విద్యార్థులకు ఎన్ఐటీలో అడ్మిషన్ పొందే ఛాన్స్ దక్కిందన్నారు.
స్టెమ్ 60 ప్రారంభించిన మొదటి సంవత్సరమే 53.57 ఉత్తీర్ణత సాధించి అగ్రగామిగా నిలిచిందన్నారు. కాగా, అర్హత సాధించిన వారిలో కె.సంజీవని, బి.అభిలాష్, జి.నిఖిల్, బి.సైదులు, బి.సాయిరాం, కె.నందిని, ఎన్.పూజిత, జి.రాజేశ్, ఆర్.కిరణ్, డి.భానుప్రియ, బి.సంతోషిణి, ఎం.ప్రవీణ్, టి.వరుణ్, పి.పూజిత, బి.కృషిక ఉన్నారన్నారు. మున్ముందు మరింత మంది విద్యార్థుల విద్యా నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తామని వివరించారు.
