భద్రాచలం, వెలుగు: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో సోమవారం మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని కోర్చోలి నదీపారా గ్రామానికి చెందిన రామ్ పోటం(15) సమీపంలోని లేండ్ర-కోర్చోలీ అడవికి గ్రామస్తులతో కలిసి వెళ్లాడు. అటవీ ఉత్పత్తులు సేకరిస్తుండగా భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలింది. దీంతో రామ్ కాలుకు తీవ్రగాయమైంది.
వెంటనే సీఆర్పీఎఫ్ 222 బెటాలియన్‌కు చెందిన జవాన్లు గ్రామస్తులతో కలిసి క్యాంపునకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అంబులెన్స్ లో బీజాపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. అడవుల్లోకి గ్రామస్తులు వెళ్లవద్దని హెచ్చరించి, బాంబు స్క్వాడ్‌తో ఆ ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్నారు. మరిన్ని ఐఈడీలు ఉండే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
