ఢిల్లీలో 150 కాలుష్య హాట్ స్పాట్లు

ఢిల్లీలో 150 కాలుష్య హాట్ స్పాట్లు
  • పర్యవారణ శాఖ మంత్రి గోపాల్ రాయ్

న్యూఢిల్లీ: కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ప్రమాదకర పరిస్థితులను కట్టడి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కాలుష్య హాట్ స్పాట్ కేంద్రాలను గుర్తించి అక్కడ నియంత్రించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ‘గ్రీన్ వార్ రూమ్’ను ఏర్పాటు చేసింది. కాలుష్యంపై వస్తున్న ఫిర్యాదుల (గ్రీన్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు)ను విశ్లేషించగా రాజధాని నగరంలో 150 చోట్ల కాలుష్య హాట్ స్పాట్లు ఉన్నట్లు గుర్తించామని ప్రకటించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి బోర్డు, ఢిల్లీ కాలుష్య నియంత్రణ అథారిటీ సంయుక్తంగా ఢిల్లీలో మొత్తం 13 కాలుష్య హాట్ స్పాట్లు ఉన్నట్లు గుర్తించామని ప్రకటించగా.. ఢిల్లీ పర్యవారణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మాత్రం 150 కాలుష్య హాట్ స్పాట్లు గుర్తించామని ప్రకటించడం గమనార్హం. 
కాలుష్య కట్టడి కోసం ‘గ్రీన్ ఢిల్లీ యాప్ ఐఓఎస్ వెర్షన్’ ప్రారంభం
నగరంలో 150 కాలుష్య హాట్ స్పాట్ లను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య కట్టడి కోసం  ‘గ్రీన్ ఢిల్లీ యాప్ ఐఓఎస్ వెర్షన్’ ను మంగళవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఢిల్లీ రాష్ట్ర పర్యవారణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ గ్రీన్ యాప్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి 27 వేల ఫిర్యాదులు 23వేల ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్, మున్సిపాలిటీలు, ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీల పరిధిలోనే ఉన్నాయని ఆయన వివరించారు. ఢిల్లీలో కాలుష్య కట్టడి కోసం ముఖ్యమంత్రి కేజ్రివాల్ దశసూత్ర ప్రణాళికను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే కాలుష్య హాట్ స్పాట్ల సంఖ్యను పదింతలు పెరిగినట్లు రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకటించారు.