- పార్టీ లెజిస్లేటర్ల మీటింగ్‌కు ఎందుకు రాలే?
- 27లోగా వివరణ ఇవ్వండి: డిప్యూటీ స్పీకర్
- మా వర్గాన్ని ‘శివసేన బాలాసాహెబ్’గా గుర్తించాలి: రెబెల్స్
- వడోదరలో ఫడ్నవీస్ తో షిండే భేటీ.. అమిత్ షా కూడా సిటీలోనే
ముంబై/గౌహతి: మహారాష్ట్ర శివసేన పార్టీలో సంక్షోభం మరింత ముదురుతోంది. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గం చర్యలు చేపట్టగా.. తమ వర్గాన్ని ‘శివసేన బాలాసాహెబ్’ పేరుతో పిలవాలని రెబెల్ లీడర్ ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. గొడవ సద్దుమణిగే పరిస్థితి లేకపోవడంతో షిండే వర్గం ఎమ్మెల్యేలు ఇంకా గౌహతిలోని హోటల్ లోనే క్యాంపును కొనసాగిస్తున్నారు. సంక్షోభంపై ఒక క్లారిటీ వస్తే తప్ప వారు ముంబైకి తిరిగి వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. మరోవైపు శివసేన తమదంటే తమదే అంటున్న రెండు వర్గాలు న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నాయి. శనివారం మధ్యాహ్నం ముంబైలోని శివసేన భవన్లో శివసేన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ కాగా.. అటు గౌహతిలోని ర్యాడిసన్ బ్లూ హోటల్లో రెబెల్ ఎమ్మెల్యేలు కూడా భవిష్యత్ కార్యాచరణపై సమావేశం అయ్యారు. ఇక మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం అర్ధరాత్రి గుజరాత్ లోని వడోదరలో బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో షిండే భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వడోదరలోనే ఉండటంతో ఆయనతోనూ షిండే భేటీ అయి ఉండొచ్చని చెప్తున్నారు.
రెబెల్స్ కు నోటీసులు
రెబెల్స్ పై చర్యలు తీసుకునే అధికారాన్ని థాక్రేకు అప్పగిస్తూ శనివారం శివసేన ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది. శివసేన, బాల్ థాక్రే ఒకే నాణేనికి రెండు వైపులు అని, బాలా సాహెబ్ పేరును ఇతరులు ఎవరూ వాడుకోరాదంటూ కమిటీ మరో తీర్మానం కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఏక్ నాథ్ షిండేతో సహా తిరుగుబాటు చేసిన 16 మంది శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి సీతారం జీర్వాల్ శనివారం అనర్హత నోటీసులు పంపారు. పార్టీ లెజిస్లేటర్ల మీటింగ్ కు హాజరు కానందున ఎందుకు డిస్ క్వాలిఫై చేయకూడదో సోమవారం లోపు వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.
సెక్యూరిటీపై థాక్రేకు షిండే లేఖ
మహారాష్ట్రలో ఉన్న తమ వర్గం ఎమ్మెల్యేల కుటుంబాలకు పోలీసులు సెక్యూరిటీ తొలగించడంపై షిండే ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అందరు పోలీస్ కమిషనర్లు దురుద్దేశపూర్వకంగానే సెక్యూరిటీని తొలగించారని ఆరోపిస్తూ ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాశారు. రెబెల్ ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులపై దాడులు చేసేలా ఎంవీఏ కూటమి నేతలు తమ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. ఇటీవల పంజాబ్ లో ప్రముఖులకు సెక్యూరిటీని తొలగించిన వెంటనే వారిపై గూండాలు, గ్యాంగ్ స్టర్లు దాడులు చేశారని, మహారాష్ట్రలోనూ ఇలాంటివి జరిగే ప్రమాదం ఉందన్నారు. దీనిపై సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రభుత్వం సెక్యూరిటీ కల్పిస్తుందని, వారి కుటుంబాలకు కాదన్నారు.
షిండేను సీఎంగా చూడాలె: సొంత గ్రామస్తులు
మహారాష్ట్రలోని సతారా జిల్లా దరే గ్రామానికి చెందిన ఏక్ నాథ్ షిండేకు ఆయన సొంత గ్రామస్తులు పూర్తి స్థాయి మద్దతు ప్రకటించారు. షిండే ఎల్లప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటారని, ఆయనను సీఎంగా చూడాలని కోరుకుంటున్నామని వెల్లడించారు.
మాకు 48 మంది మద్దతు: రెబల్స్
ప్రస్తుతం తమ వర్గానికి 38 మంది సేన ఎమ్మెల్యేలు, మరో 10 మంది ఇండిపెండెంట్ల మద్దతు ఉందని ఏక్ నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యే దీపక్ కెసార్కర్ శనివారం గౌహతిలో వెల్లడించారు. దీంతో అసెంబ్లీలో శివసేనకు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు షిండే వెంట ఉన్నందున అనర్హత వేటు నుంచి తప్పించుకుని, అసెంబ్లీలో పార్టీకి ఆయన లీడర్షిప్ వహించేందుకు మార్గం సుగమం అయింది. మరోవైపు పార్టీని చీల్చి, కొత్త పార్టీ పెట్టుకునేందుకూ అవకాశం ఏర్పడింది. అయితే, అసెంబ్లీ స్పీకర్ ఆమోదం తెలిపేంతవరకూ షిండే వర్గానికి శాసనసభా పక్షంగా గుర్తింపు ఉండదని ఆ రాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ అన్నారు.
