తౌక్టే దెబ్బకు 16 వేల ఇండ్లు కూలిపోయినయ్

తౌక్టే దెబ్బకు 16 వేల ఇండ్లు కూలిపోయినయ్
  • పెను గాలులకు 16 వేల ఇండ్లు కూలిపోయినయ్
  • చెట్లు, కరెంటు స్తంభాలు కూడా.. గుజరాత్​లో తౌక్టే బీభత్సం
  • సౌరాష్ట్రలో భారీ వానలు
  • తెగిపడిన వైర్లతో నిలిచిన పవర్​ సప్లై
  • చీకట్లోనే మహారాష్ట్రలో 18 లక్షల ఇండ్లు

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, గుజరాత్‌‌ రాష్ట్రాల తీర ప్రాంతాల్లో తౌక్టే బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షాలు, గంటకు 100 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీయడంతో జనజీవనం స్తంభించిపోయింది. తుఫాను వల్ల సోమవారం గుజరాత్‌‌లో ఏడుగురు, మహారాష్ట్రలో ఇద్దరు మరణించారు. గుజరాత్‌‌లో16 వేల ఇండ్లు కూలిపోయాయని, 40 వేల చెట్లు నేలమట్టమయ్యాయని, వెయ్యి విద్యుత్‌‌ పోల్స్ పడిపోయాయని ఆ రాష్ట్ర సీఎం విజయ్‌‌ రూపానీ వెల్లడించారు. 2,437 ఊర్లకు పవర్‌‌ సప్లైపై నిలిచిపోయిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,400 హాస్పిటళ్లలో కరోనా ట్రీట్‌‌మెంట్‌‌కు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. తుఫాను వల్ల భావ్‌‌నగర్‌‌లో ఆక్సిజన్‌‌ ప్రొడక్షన్‌‌ ప్లాంట్‌‌లో ఇబ్బంది కలిగిందన్నారు.

శాంతాక్రజ్​లో 19 సెంటీమీటర్ల వాన
మహారాష్ట్రలోని రత్నగిరి, సింధుదుర్గ్‌‌ జిల్లాల్లో సుమారు 18.43 లక్షల మంది కన్జూమర్ల ఇండ్లకు పవర్‌‌ సప్లైకి ఇబ్బంది ఏర్పడిందని అధికారులు చెప్పారు. 3,665 ఊర్లల్లో సుమారు 52% పవర్‌‌ సప్లై పునరుద్ధరించామని, మిగతా ఊర్లల్లో పని వేగవంతం చేశామని తెలిపారు. ఇందుకోసం 13 వేల మంది సిబ్బంది 24 గంటలు పని చేస్తున్నారని విద్యుత్‌‌ మంత్రి నితిన్‌‌ రౌత్‌‌ చెప్పారు. రత్నగిరి, సింధుదుర్గ్‌‌, రాయ్‌‌గఢ్‌‌ జిల్లాల నుంచి సుమారు 13 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.  తౌక్టే ప్రభావంతో ముంబైలోని కోలాబాలో 18.9 సెంటీమీటర్లు, శాంతాక్రజ్‌‌లో 19.4 సెంటీమీటర్ల వాన పడిందని బీఎంసీ వెల్లడించింది.  గంటకు 114 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయంది.

177 మంది సేఫ్.. కొనసాగుతున్న రెస్క్యూ
ముంబై తీరంలో కొట్టుకుపోయిన రెండు నౌకల్లోని సిబ్బందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అత్యంత కష్టమైన వాతావరణ పరిస్థితు ల్లో ఇప్పటివరకు 177 మందిని కాపాడినట్లు నేవీ ఆఫీసర్​ ఒకరు చెప్పారు. రెండు నౌకల్లోని మిగతా 96 మంది కోసం రెస్క్యూ కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఐఎన్ఎస్ కోల్‌‌కతా, ఐఎన్ఎస్ కొచి, గ్రేట్ షిప్ అహల్య సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. ఓఎన్జీసీకి చెందిన బార్జ్ పీ305 అనే నౌక, గాల్ కన్​స్ట్రక్టర్ నౌకలు సోమవారం తౌక్టే బీభత్సానికి కొట్టుకుపోయా యి. రెండు నౌకల్లో కలిపి 410 మంది సిబ్బంది ఉన్నారు. వీళ్లను కాపాడేందుకు ఇండియన్‌‌ నేవీ వెంటనే రంగంలోకి దిగింది. గాల్‌‌ కన్‌‌స్ట్రక్టర్‌‌లోని సిబ్బందిని కాపా డేందుకు వాటర్‌‌ లిల్లీ నౌక, 2 సపోర్ట్ నౌకలు, సీజీఎస్‌‌ సామ్రాట్‌‌ బయల్దేరాయి.

తీరం దాటిన తౌక్టే
ఐదు రోజులు అరేబియా సముద్రంలో కల్లోలం సృష్టించిన తౌక్టే తుఫాను తీరం దాటింది. సోమవారం రాత్రి 9 గంటలకు గుజరాత్‌‌లోని డయ్యూ, ఉనా దగ్గర తీరాన్ని తాకి అర్ధరాత్రికి తీరం దాటిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం పొద్దున తీరం దాటుతుందనుకున్నా తుఫాను వేగంగా వచ్చిందని చెప్పింది. తౌక్టే తీరందాటే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల నుంచి 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, డయ్యూలో 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయని తెలిపింది. తీరాన్ని దాటిన తౌక్టే తర్వాత బలహీన పడిందని చెప్పింది. గాలి వేగం గంటకు 125 కిలోమీటర్ల నుంచి 105 కిలోమీటర్లకు తగ్గిందని తెలిపింది.