
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్ ధోనీ ఆట తీరుపై కోపాన్ని పైశాచికంగా బయటపెట్టిన నెటిజన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఓడిపోవడంతో ధోనీ భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ధోనీ కూతురు జీవా (5)ని రేప్ చేస్తానంటూ సాక్షి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కామెంట్ చేశాడు. పసిపిల్లపై అటువంటి కామెంట్స్ చేయడంపై నెటిజన్లు, క్రికెటర్లు, రాజకీయ నేతలు, పలువురు సెలబ్రెటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పని చేసినవాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ ఇన్‌స్టాగ్రామ్ కామెంట్‌పై కేసు పెట్టి జార్ఖండ్ పోలీసులు ఎంక్వైరీ చేశారు. ధోనీ కూతురిపై తీవ్రమైన బెదిరింపులు చేసిన నెటిజన్ గుజరాత్‌లోని కచ్ జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు రాంచీ పోలీసులు. ఈ విషయాన్ని కచ్ అధికారులకు తెలియజేశారు. ఈ కేసులో నిందితుడిని ఆదివారం నాడు కచ్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నిందితుడు మైనర్ అని, అతడి వివరాలను బయటకు చెప్పడం నిబంధనలకు వ్యతిరేకమని కచ్ పోలీసులు తెలిపారు. అతడు 12వ తరగతి చదువుతున్నాడని, 16 ఏళ్ల వయసు ఉంటుందని చెప్పారు. ధోనీ కుమార్తెపై ఆ బెదిరింపు మెసేజ్ పెట్టింది తానేనని ఒప్పుకున్నాడని సీనియర్ పోలీస్ అధికారి సౌరభ్ సింగ్ తెలిపారు. రాంచీలో ఎఫ్ఐఆర్ నమోదైనందున నిందితుడిని రాంచీ పోలీసులకు అప్పగిస్తున్నట్లు చెప్పారు.