16 ఏళ్లకే 7.4 అడుగులు

16 ఏళ్లకే 7.4 అడుగులు

పొట్టిగుంటే ఓ బాధ.. మరీ, పొడుగ్గా పెరిగితే ఇంకో బాధ. అలాంటిదే ఈ 16 ఏళ్ల కుర్రాడి వ్యథ. పేరు మోహన్​ సింగ్​. ఉత్తరాఖండ్​లోని పితోడ్​గఢ్​ సొంతూరు. 12వ తరగతి చదువుతున్నాడు. ఆ వయసులో ఉండే పిల్లలు మామూలు ఎత్తే పెరుగుతారు. కానీ, మోహన్​ మాత్రం అసాధారణంగా 7.4 అడుగులు పెరిగిపోయాడు. 113 కిలోల బరువున్నాడు. నిజానికి చిన్న వయసులో హైట్​ మంచిగా పెరుగుతుంటే మంచిదే కదా అని అతడి తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ, మరీ ఎత్తు అయిపోతుండడంతో ఎక్కడో అనుమానం వచ్చి ఆస్పత్రికి తీసుకెళితే మెదడులో గడ్డ (బ్రెయిన్​ ట్యూమర్​) వల్ల ఇంత పొడుగయ్యాడని డాక్టర్లు చెప్పారు. కొద్ది రోజుల క్రితమే ఆలిండియా ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ (ఎయిమ్స్​)లో ఆపరేషన్​ చేసి ఆ గడ్డను తీసేశారు. ‘‘వాడి కోసం 4ఎక్స్​ఎల్​ సైజు బట్టలను తీసుకునేవాళ్లం. బెడ్డు పొడవును కూడా పెంచాం. బాత్రూం సరిపోవట్లేదు. మీరట్​లోని ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వాడి కోసం చెప్పులు తయారు చేయిస్తున్నాం” అని మోహన్​ సింగ్​ తండ్రి మహదేవ్​ సింగ్​ చెప్పాడు. అయితే, ఐదు నెలలుగా తలనొప్పి వస్తోందంటూ బాధపడేవాడని, స్థానిక డాక్టర్​ దగ్గరకు తీసుకెళితే ఎంఆర్​ఐ స్కాన్​ తీయాలన్నాడని చెప్పాడు. ఆ స్కాన్​లో బ్రెయిన్​ ట్యూమర్​ ఉండడంతో ఎయిమ్స్​కు తీసుకెళ్లామని వివరించాడు.

ఎందుకంత హైట్​?…

మెదడులోని చాలా ముఖ్యమైన పిట్యూటరీ గ్రంథిలో డాక్టర్లు పెద్ద ట్యూమర్​ను గుర్తించారు. ఎదుగుదలను నియంత్రించే గ్రోత్​ హార్మోన్​ను ఆ గ్రంథే విడుదల చేస్తుంటుంది. ఆ ట్యూమర్​ వల్లే గ్రంథిలో అసాధారణ రీతిలో గ్రోత్​ హార్మోన్​ విడుదలైందని, దాని వల్లే ఇంత హైట్​ పెరిగాడని డాక్టర్లు చెబుతున్నారు. ముక్కు నుంచి ఎండోస్కోపీ ద్వారా ఆ గడ్డను తీసేసినట్టు ఎయిమ్స్​ న్యూరాలజీ ప్రొఫెసర్​ డాక్టర్​ పీ శరత్​ చంద్ర చెప్పారు. గడ్డను తొలగించాక గ్రోత్​ హార్మోన్​ స్థాయిలు తగ్గాయన్నారు. కొద్ది రోజుల్లో బరువు తగ్గిపోతాడని, హైట్​ అంతే ఉంటాడని చెప్పారు. చాలా కొద్ది మందిలో మాత్రమే ఇలాంటి పరిస్థితి కనిపిస్తుందని వివరించారు. ఇలాంటి వాళ్లకు గుండె ముప్పులు ఎక్కువని చెప్పారు.

రెజ్లర్​ ఖలీ కూడా…

వరల్డ్​ రెజ్లింగ్​ ఎంటర్​టైన్​మెంట్​ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్​ దలీప్​ సింగ్​ తెలుసా? దాని కన్నా ‘ద గ్రేట్​ ఖలీ’ అంటే ఈజీగా గుర్తుపట్టేస్తారేమో. ఖలీకీ ఇలాంటి సమస్యే ఉండేదట. చిన్నప్పుడు ఎత్తు ఎక్కువ పెరుగుతుండడంతో చెక్​ చేస్తే అతడి పిట్యూటరీ గ్లాండ్​లోనూ పెద్ద గడ్డ కనిపించిందట. ఆ తర్వాత దాన్ని తీసేశారు. 8.3 అడుగులతో ప్రపంచంలోనే అతి పొడవైన వ్యక్తి సుల్తాన్​ కోసెన్​ (29)కూ అదే సమస్యని చెబుతూ ఉంటారు.