రైతు నిరసనలతో 160 రైళ్ల రాకపోకలకు అంతరాయం

రైతు నిరసనలతో 160 రైళ్ల రాకపోకలకు అంతరాయం

లఖీంపూర్‌‌ ఘటనకు బాధ్యతగా కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్ మిశ్రాను తొలగించాలంటూ దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పలు రైతు సంఘాలు రైల్ రోకో నిర్వహించాయి.  ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ నిరసనలు చేపట్టాయి. ఎక్కడికక్కర రైలు పట్టాలపై రైతు నేతలు కూర్చుని ఆందోళనలు చేపట్టడంతో దేశ వ్యాప్తంగా 160 రైళ్లు నిలిచిపోయాయి. ఈ నిరసనలు ముగిశాక వాటి సర్వీసులను అధికారులు పునరుద్దరిస్తున్నారు. 

ఈ ఆందోళనల్లో ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదు. శాంతి యుతంగా నిరసన తెలపాలని ఉదయం నుంచి రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. రైల్వే ఆస్తులకు ఎలాంటి నష్టం చేయొద్దని పిలుపునిచ్చారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా పదవిలో ఉంటే లఖీంపూర్ ఘటన విచారణ సజావుగా సాగదని రైతు నేతలు అంటున్నారు. ఆయనను పదవి నుంచి తొలగిస్తేనే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందన్నారు.

అక్టోబర్ 3న లఖింపూర్ లో అగ్రిచట్టాలు రద్దు చేయాలంటూ నిరసన తెలుపుతున్న రైతుల పైకి కేంద్రమంత్రి అజయ్ మిశ్రాకు చెందిన కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐతే ఆ టైంలో కారులో అజయ్ మిశ్రా కొడుకు ఆశిశ్ మిశ్రా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తల కోసం..

స్నాక్స్ తిన్నాక ముగ్గురు చిన్నారుల అనుమానాస్పద మృతి

T20 వరల్డ్‌ కప్‌లో సంచలనం: స్కాట్లాండ్ చేతిలో బంగ్లా చిత్తు

యాదాద్రి పునః ప్రారంభ తేదీ రేపు ప్రకటన