నర్సంపేట అవిశ్వాసంపై హైడ్రామా

నర్సంపేట అవిశ్వాసంపై హైడ్రామా
  • చైర్‌‌పర్సన్‌‌కు వ్యతిరేకంగా నోటీసులిచ్చిన 17 మంది కౌన్సిలర్లు
  • తిరుగుబాటు క్యాంప్‌‌ నుంచి ఇద్దరు జంప్‌‌, అదే దారిలో మరొకరు 
  • మేజిక్‌‌ ఫిగర్‌‌ 16, ప్రస్తుతం ఉన్నది 14
  • అవిశ్వాసానికి దూరంగా ఉంటామన్న కాంగ్రెస్‌‌ సభ్యులు
  • ఈ నెల 30న అవిశ్వాసం పెట్టనున్న ఆఫీసర్లు

వరంగల్‍/నర్సంపేట, వెలుగు : వరంగల్‌‌ జిల్లా నర్సంపేట మున్సిపల్‌‌ అవిశ్వాసంపై హైడ్రామా నెలకొంది. మరో 48 గంటల్లో తీర్మానం పెట్టాల్సి ఉండగా గ్రూప్‌‌ రాజకీయాలు పట్టణంలో వేడి పుట్టిస్తున్నాయి. మున్సిపల్‌‌ చైర్మన్‌‌గా బీఆర్‌‌ఎస్‌‌ లీడరే ఉండగా, అవిశ్వాసం పెట్టేది కూడా ఆ పార్టీ కౌన్సిలర్లే కావడం చర్చనీయాంశంగా మారింది. రెండు వర్గాలుగా విడిపోయిన కౌన్సిలర్లను ఒక్కటి చేసేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌‌రెడ్డి ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

అయితే నిన్నమొన్నటి వరకు అవిశ్వాసం నెగ్గేందుకు పూర్తి మెజార్టీ ఉండగా, ముగ్గురు కౌన్సిలర్లు సడన్‌‌గా చైర్మన్‌‌ క్యాంప్‌‌లో చేరారు. దీంతో మేజిక్‌‌ ఫిగర్‌‌ చేరుకోవడం కష్టంగా మారింది. దీంతో అవిశ్వాసం ఏ మలుపు తిరుగుతుందోనని లీడర్లతో పాటు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

సొంత పార్టీ చైర్‌‌పర్సన్‌‌పైనే అవిశ్వాసం

నర్సంపేట మున్సిపాలిటీలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా బీఆర్‌‌ఎస్‌‌కు 18 మంది, కాంగ్రెస్‌‌కు ఆరుగురు ఉన్నారు. బీఆర్‌‌ఎస్‌‌కు చెందిన గుంటి రజనీ కిషన్‌‌ చైర్‌‌పర్సన్‌‌గా ఎన్నికయ్యారు. పాలకవర్గం ఏర్పడిన ఏడాది నుంచే లుకలుకలు మొదలయ్యాయి. ఒకే పార్టీలో రెండు, మూడు గ్రూప్‌‌లు తయారు కావడంతో, సభ్యులు పలుమార్లు క్యాంప్‌‌ పాలిటిక్స్‌‌ కూడా నడిపారు. అయితే ఈ సారి చైర్‌‌పర్సన్‌‌ను ఎలాగైనా గద్దె దించాలని మెజార్టీ సభ్యులు ఒక్కటయ్యారు. ఈ క్రమంలో ఇదే నెల 2న అవిశ్వాస తీర్మానం కోరుతూ కలెక్టర్‌‌కు నోటీసులు ఇచ్చారు. బీఆర్‌‌ఎస్‌‌కు చెందిన 18 మంది కౌన్సిలర్లలో రజనీకి వ్యతిరేకంగా 17 మంది సంతకాలు చేశారు. ఈ నెల 30న అవిశ్వాసం పెట్టేందుకు ఆఫీసర్లు నిర్ణయించారు.

ఇద్దరు కౌన్సిలర్ల చేతిలోనే ఫలితం

మున్సిపాలిటీలోని 24 మంది సభ్యులకుగానూ 16 మంది కౌన్సిలర్లు ఒకవైపు ఉంటేనే అవిశ్వాసం నెగ్గుతుంది. కాంగ్రెస్‌‌ సభ్యులు అవిశ్వాసానికి దూరంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించారు. దీంతో అవిశ్వాసం నోటీసులు ఇచ్చిన 17 మంది బీఆర్‌‌ఎస్‌‌ కౌన్సిలర్లు ఏకతాటిపై ఉంటేనే తీర్మానం నెగ్గుతారు. కానీ తిరుగుబాటు టీంలో కౌన్సిలర్లు దార్ల రమాదేవి, ఎండీ పాషా ప్రస్తుతం చైర్‌‌పర్సన్‌‌ గుంటి రజని వైపు అడుగులు వేశారు.

దీంతో చైర్‌‌పర్సన్‌‌ భర్త కిషన్‌‌ ఇద్దరు కౌన్సిలర్లతో కలిసి ముంబై వెళ్లిపోయారు. మరో కౌన్సిలర్‌‌ కూడా లోకల్‌‌లోనే ఉన్నప్పటికీ రజనీ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 16 మంది అవసరం ఉండగా, తిరుగుబాటు టీం నుంచి ముగ్గురు కౌన్సిలర్లు తప్పుకోవడంతో 14 మందే మిగిలారు. అవిశ్వాసం నెగ్గాలంటే మరో ఇద్దరు సభ్యుల సహకారం తప్పనిసరిగా మారింది. తప్పుకున్న ముగ్గురిలోంచి గానీ, కాంగ్రెస్‌‌ సభ్యుల్లోంచి గానీ ఇద్దరు మద్దతు తెలిపితేనే అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంది.

న్యూట్రల్‌‌గా మాజీ ఎమ్మెల్యే పెద్ది

కొన్ని రోజుల కిందటి వరకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌‌ రెడ్డి చెప్పినట్లుగానే కౌన్సిలర్లు విన్నారు. రెండు మూడేండ్లుగా చైర్‌‌పర్సన్‌‌ రజనీపై సొంత పార్టీ సభ్యులే గుర్రుగా ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుదర్శన్‌‌రెడ్డి కాంప్రమైజ్‌‌ చేశారు. కానీ ఇటీవలి ఎన్నికల్లో తాను ఓడిపోవడం, మెజార్టీ కౌన్సిలర్లు చైర్‌‌పర్సన్‌‌పై ఆగ్రహంగా ఉండడంతో సుదర్శన్‌‌రెడ్డి న్యూట్రల్‌‌గా ఉంటున్నారు. రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినా ఎవరూ కూడా పట్టువీడకపోవడంతో ఇష్యూను వారికే వదిలేశారు.