
- ఇప్పటివరకు నాటిన మొక్కలు 1.7 కోట్లు
హైదరాబాద్, వెలుగు: వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 22 వేల ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండు శాఖలు ఏటా ‘స్వచ్ఛదనం- పచ్చదనం’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్నాయి. గతేడాది 6.90 కోట్ల మొక్కలు నాటగా.. ఈ ఏడాది 7 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యంలో పీఆర్, ఆర్డీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నాటికి 1.7 కోట్ల మొక్కలను నాటారు.
ఇది నిర్దేశించుకున్న లక్ష్యంలో 39 శాతమని అధికారులు తెలిపారు. ఈ సారి వనమహోత్సవంలో పూలు, పండ్ల మొక్కలు నాటేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటివరకు 4,521 ఎకరాల్లో పండ్ల మొక్కలను నాటారు. ఇది మొత్తం లక్ష్యంలో 21 శాతంగా ఉంది. కాగా, పల్లెల్లో వనమహోత్సవం కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళా సంఘాలు, యువత, రైతులు, స్వచ్ఛంద సంస్థలు, బడి పిల్లలు పెద్దఎత్తున పాల్గొంటున్నారు.
మహోత్సవంలో వేగం పెంచాలి: మంత్రి సీతక్క
పల్లెల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 85 శాతం గుంతలు తవ్వి మొక్కలు నాటేందుకు సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లాలో వన మహోత్సవం కాస్త మందకొడిగా సాగుతోంది. ఇప్పటి వరకు ఆ జిల్లాలో 42 వేల మొక్కలను మాత్రమే నాటారు. ఆ జిల్లాల్లో వన మహోత్సవంలో వేగం పెంచాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ములుగు, ఇల్లెందు, కామారెడ్డి, పెద్దపల్లి, భూపాలపల్లి వంటి నియోజకవర్గాల్లో మంత్రి సీతక్క పర్యటించి మొక్కలు నాటాలని ప్రజలకు సూచించారు. పచ్చదనంపై చైతన్యం కల్పించారు. మంత్రి సీతక్క, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్, డైరెక్టర్ జి. సృజన ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నారు.