తాలిబాన్ల  సంబురాలకు కాబూల్‌లో 17 మంది బలి

తాలిబాన్ల  సంబురాలకు కాబూల్‌లో 17 మంది బలి

న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌లో తాలిబాన్ల అరాచకాలకు సాధారణ ప్రజలు బలవుతున్నారు. పంజ్‌‌‌‌‌‌‌‌షీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలిచేశామని సంబురాలు చేసుకుంటూ.. ఇష్టానుసారం కాల్పులకు దిగి 17 మందిని చంపేశారు. అఫ్గాన్ రాజధాని కాబూల్‌‌‌‌‌‌‌‌లో జరిగిందీ ఘటన. ‘‘అల్లా దయ వల్ల మేం మొత్తం ఆఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ను కంట్రోల్​లోకి తెచ్చుకున్నం. ఇబ్బందులు సృష్టించే వాళ్లను ఓడించాం. పంజ్‌‌‌‌‌‌‌‌షీర్ ఇప్పుడు మా నియంత్రణలో ఉంది’’ అని ఓ తాలిబాన్ కమాండర్ అన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో తాలిబాన్లు సంబురాల్లో మునిగిపోయారు. గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో 17 మందికిపైగా చనిపోగా, 41 మంది దాకా గాయపడ్డారు. ఈ విషయాన్ని షమ్షాద్ న్యూస్ ఏజెన్సీ, టోలో న్యూస్ ఏజెన్సీ కన్ఫామ్ చేశాయి. మరోవైపు నంగర్హార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లో ఇలానే కాల్పులు జరిగాయి. కనీసం 14 మంది దాకా గాయపడ్డట్లు జలాలాబాద్ ఏరియా ఆస్పత్రి అధికార ప్రతినిధి గుల్జాదా సంగార్  చెప్పారు. కాల్పుల ఘటనపై స్పందించిన తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్.. ‘‘కాల్పులు జరపడం ఆపండి. అందుకు బదులుగా దేవుడికి థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌ చెప్పండి. పౌరులను బుల్లెట్లు గాయపరుస్తాయి. అనవసరంగా కాల్పులకు దిగకండి’’ అని తాలిబాన్లకు సూచించారు.

పంజ్‌‌‌‌‌‌‌‌షీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలిచేశామంటూ ప్రకటన

అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ను అత్యంత వేగంగా స్వాధీనం చేసుకున్న తాలిబాన్లకు.. పంజ్‌‌‌‌‌‌‌‌షీర్ కొరకరాని కొయ్యలా మారింది. అమ్రుల్లా సాలెహ్, అహ్మద్ మసూద్ ఆధ్వర్యంలోని రెసిస్టెన్స్ ఫోర్స్ వారికి లొంగడం లేదు. ఈ క్రమంలో శుక్రవారం పంజ్‌‌‌‌‌‌‌‌షీర్ లోయను తాము నియంత్రణలోకి తెచ్చుకున్నామంటూ తాలిబాన్ వర్గాలు ప్రకటించాయి. తర్వాత కాబూల్ అంతటా వినిపించేలా తాలిబాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు.

మేం ఓడిపోలేదు: అమ్రుల్లా సాలెహ్​

తాలిబాన్ల ప్రకటనపై మాజీ వైస్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్ అమ్రుల్లా సాలేహ్ స్పందించారు. తాము ఓడిపోలేదని ప్రకటించారు. ‘‘మేం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాం. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు. తాలిబాన్లు మాపై దాడి చేస్తున్నారు. మేం పోరాడుతున్నాం. తాలిబాన్లను అడ్డుకుంటున్నాం” అని అన్నారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు. మరికొందరు రెసిస్టెన్స్ ఫోర్స్ లీడర్లు కూడా తాలిబాన్ల ప్రకటనలను కొట్టిపారేశారు. స్థానిక మిలీషియాలకు చెందిన వేలాది మంది యోధులు, గత ప్రభుత్వంలోని దళాలు ఇక్కడ పోరాడుతున్నాయని ప్రకటించారు. ‘‘పంజ్‌‌‌‌‌‌‌‌షీర్ ఓడిపోయిందంటూ పాకిస్తానీ మీడియా వార్తలు సర్క్యులేట్ చేస్తోంది. ఇదంతా అబద్ధం’’ అని రెసిస్టెన్స్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ను లీడ్ చేస్తున్న అహ్మద్ మసూద్ చెప్పారు.

కాబూల్‌‌‌‌‌‌‌‌లో ఐఎస్ఐ చీఫ్

అఫ్గాన్‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న క్రమంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయీజ్ హమీద్.. కాబూల్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యక్షమయ్యారు. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ అధికారుల బృందంతో శనివారం అక్కడికి వెళ్లారు. రెండు దేశాల మధ్య సంబంధాలపై చర్చించేందుకు తాలిబాన్ల ఆహ్వానం మేరకు హమీద్ అఫ్గాన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లినట్లు పాక్ జర్నలిస్టు ఒకరు చెప్పారు.

కాబూల్ చేరుకున్న టాప్ లీడర్లు

కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వాన్ని ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ లీడ్ చేస్తారని మొన్న తాలిబాన్లు ప్రకటించారు. ‘‘టాప్ లీడర్లు కాబూల్‌‌‌‌‌‌‌‌కు వచ్చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన పనులు తుది దశలో ఉన్నా యి” అని తాలిబాన్ ప్రతినిధులు చెప్పారు. సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంద్‌‌‌‌‌‌‌‌జాదా.. మతపరమైన విషయాలు, పాలనపై దృష్టి పెడతారని తెలిపారు. కేవలం తాలిబాన్ సభ్యులతోనే సర్కారు ఏర్పడబోతోందని తెలుస్తోంది. మొత్తం 25 మినిస్ట్రీలు ఉంటా యని, 6 నుంచి 8 నెలల్లో అసెంబ్లీని ఏర్పాటు చేస్తామని తాలిబాన్ వర్గాలు చెప్పాయి.

మహిళలపై టియర్ గ్యాస్

అన్ని రంగాల్లోనూ తమకు సమాన హక్కులు కల్పించాలని అఫ్గానిస్తాన్ లో మహిళలు ర్యాలీ నిర్వహించారు. శనివారం కాబూల్ లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ వద్దకు ర్యాలీగా వెళ్లగా తాలిబాన్లు అడ్డుకున్నారు. మహిళా యాక్టివిస్టులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఒకామెను మిలిటెంట్లు కొట్టారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రభుత్వంలో తమకు సమాన అవకాశాలు కల్పించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, బురఖా వేసుకునే మహిళలను మాత్రమే చదువుకునేందుకు, జాబ్ చేసుకునేందుకు అనుమతిస్తామని తాలిబాన్లు ప్రకటించారు.