
బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిని బస్సు, టాటా ఏస్ వాహానాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో 17 మంది మృతిచెందారు. ఢాకా-రాజ్‌షాహి హైవేపై శుక్రవారం మధ్యాహ్నం కాటకాలీ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీకొనడంతో.. భారీ శబ్దంతో మంటలంటుకున్నాయి. దాంతో మిని బస్సులో ప్రయాణిస్తున్న 13 మందిలో 11 మంది సజీవదహనం అయ్యారు. వారిలో నలుగురు పిల్లలు, అయిదుగురు మహిళలు కూడా ఉన్నారు. టాటా ఏస్‌లో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు చనిపోయారు. మొత్తంగా ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సుకు మంటలు అంటుకోవడంతో వారిని రక్షించేందుకు స్థానికులెవరూ ముందుకువెళ్లలేకపోయారు. ప్రమాదం జరిగిన పది నిమిషాల తర్వాత అగ్నిమాపక సిబ్బంది అక్కడికొచ్చి మంటలను ఆర్పింది. అనంతరం వాహనాల నుంచి మృతదేహాలను బయటకు తీసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదం జరగడానికి గల కారణాలను వెతికే పనిలో పడ్డారు.