గల్ఫ్​లో ఆగుతున్న వలస గుండెలు..

గల్ఫ్​లో ఆగుతున్న వలస గుండెలు..
  • తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటివరకు 1700 మందికి పైగా మృత్యువాత

జగిత్యాల జిల్లా గోవిందారానికి చెందిన శ్రీనివాస్ ఉన్న ఊరిలో ఉపాధి లేక అప్పులు ఎక్కువై కుటుంబాన్ని పోషించుకోవడం కోసం గల్ఫ్ బాట పట్టాడు. అక్కడ కంపెనీలు సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడం, ఏజెంట్ మోసాలతో మరిన్ని అప్పులయ్యాయి. దీంతో ఊర్లోని పెద్ద కూతురి పెండ్లిని కుటుంబసభ్యులు, గ్రామస్తులు చందాలు వేసుకుని చేయాల్సి వచ్చింది. ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడం, మరొక కూతురు పెండ్లికి ఉండడంతో రంది పెట్టుకున్నాడు. నవంబర్ 15న సౌదీలో గుండెపోటుతో చనిపోయాడు. నిరుపేద కుటుంబం కావడం, ప్రభుత్వం సహకరించకపోవడంతో శ్రీనివాస్ మృతదేహం స్వగ్రామం రావడానికి సుమారు 45 రోజులు పట్టింది.  

మెట్​పల్లిలోని అరపేట కు చెందిన మూడపల్లి గంగాధర్(40) డెయిలీ లేబర్. భార్య లక్ష్మి బీడీలు చేస్తుండేది. వీరికి మౌనిక, మనీష్ పిల్లలు. కూలీ పనితో పిల్లలకు మంచి జీవితం ఇవ్వడం సాధ్యం కాదని భావించిన గంగాధర్​ నాలుగేండ్ల క్రితం ఒమన్ వెళ్లి లేబర్ గా చేరాడు. అనుకున్నంత జీతం రాకపోయినా నాలుగేండ్లు పని చేశాడు. ఈ ఏడాది ఆగస్టు3 న భార్యకు ఫోన్​చేసి నవంబర్ లో ఇంటికి వస్తున్నానని, బిడ్డకు పెండ్లి చేద్దామని చెప్పాడు. తెల్లవారిన తర్వాత అక్కడ పారిశుధ్య పనులు చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. ఇతడి మృతదేహం కూడా స్వగ్రామానికి నెల తర్వాతే వచ్చింది. బీడీలు చేస్తూ వచ్చే డబ్బుతో పిల్లలను సాదడం తన వల్ల కావడం లేదని మృతుడి భార్య లక్ష్మి కంటతడి పెడుతోంది. సర్కారు నుంచి ఎలాంటి సాయం అందలేదని అవేదన వ్యక్తం చేస్తోంది.  

జగిత్యాల, వెలుగు : గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న తెలంగాణ కార్మికుల్లో చాలామంది గుండెపోటుతోనే ప్రాణాలు కోల్పోతున్నారు. పని ఒత్తిడి, కుటుంబసభ్యులకు దూరమై మానసికంగా కుంగిపోవడం, వాతావరణ మార్పులు వంటి అంశాలు చావులకు కారణమవుతున్నాయి. మరో వైపు గల్ఫ్ లో చనిపోతే మృతదేహాన్ని తీసుకురావడానికి నెలలు పడుతోంది. దీంతో కుటుంబసభ్యులు చివరి చూపు కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయి కుదేలవుతుంటే రాష్ట్ర సర్కారు మాత్రం స్పందించడం లేదు. రాష్ట్రం ఏర్పడకముందు గల్ఫ్​కార్మికుల కష్టాల గురించి పలు సభల్లో గొంతెత్తిన నాయకులు ఇప్పుడు సైలెన్స్ అయిపోయారు. ప్రభుత్వం భూములమ్మగా వచ్చిన నిధులు ఇవ్వాలని, కేరళ తరహా విధానం అమలు చేయలని అప్పటి మహాసభలో డిమాండ్ ​చేసిన ఉద్యమ నేత కేసీఆర్​ఇప్పుడు సీఎం అయినా చేస్తున్నదేమీ లేదు. 2014 ఎన్నికల సందర్భంగా గల్ఫ్ ​కార్మికుల కోసం ప్రత్యేక విధానం తెస్తామని టీఆర్​ఎస్ ​తన మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఇప్పటికీ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా ఏమీ చేయలేదు. కేవలం ఎయిర్​పోర్ట్​ నుంచి మృతదేహాన్ని తీసుకురావడానికి అంబులెన్స్​ను మాత్రమే ఏర్పాటు చేసింది.    

గల్ప్​లో కార్మికుల సంఖ్య 15 లక్షలకుపైనే.. 

విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం సుమారు 88 లక్షల మంది భారతీయులు గల్ఫ్​ దేశాల్లో ఉంటున్నారు. ఇందులో తెలంగాణకు చెందిన కార్మికుల సంఖ్య 15 లక్షలకు పైగానే ఉంది. ఇందులో 10 లక్షల మంది ఉత్తర తెలంగాణకు చెందిన వారు కావడం గమనార్హం. హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు చెందిన వారు మిగిలిన 5 లక్షల్లో ఉన్నారు. 

ప్రతి రెండు రోజులకు ఒకరు ..

రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటివరకు సుమారు 1700 మంది చనిపోయినట్టు సమాచారం. శంషాబాద్ విమానాశ్రయంలో మృతదేహాలను తరలించేందుకు తీసుకునే ఎన్​ఓసీ లెక్కల ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు. ఈ లెక్కన ఏడాదికి 200 మంది చనిపోతుండగా, ప్రతి రెండు రోజులకు ఒక్కరు గల్ఫ్ దేశాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.  

పల్లెల్లో విదేశీ జర్నలిస్టుల వివరాల సేకరణ 

గల్ఫ్ వలస కార్మికుల స్థితిగతులను తెలుసుకునేందుకు విదేశీ జర్నలిస్టులు గత నెలలో రాష్ట్రంలో పర్యటించారు. నవంబర్​లో ఫ్రాన్స్-2 టీవీ ప్రతినిధి జర్మెన్ బస్లే జగిత్యాల జిల్లాలో, స్విట్జర్లాండ్​కు చెందిన ఫ్రిలాన్స్ ఫొటో జర్నలిస్ట్ జోసెఫ్ బెంజిమిన్ కకౌరి జగిత్యాలతో పాటు రాజన్న సిరిసిల్లా జిల్లాల్లో, ఫ్రాన్స్ 24 టీవీకి చెందిన ఫ్రెంచ్ ప్రతినిధులు అల్బాన్ అల్వారీచ్, లీయా డెలీఫోలేలు నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించారు. వేల కిలోమీటర్లు వెళ్లిన వారిలో 80 శాతం మంది గుండెపోటుతోనే చనిపోయారని గుర్తించారు. వీరంతా 35 నుంచి 50 ఏండ్ల వయస్సున్న వారేనని తెలుసుకున్నారు. శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, మధ్య వయస్సులో వెళ్లడం కూడా చావులకు కారణమవుతుందని తేల్చారు. జీతాలు అనుకున్నట్టు రాకపోవడం, అప్పుల భారంతో ఇంటికి వెళ్లడానికి మనసు రాక, అక్కడ పని చేయలేక కుంగిపోయి చనిపోతున్నారని నిర్ధారణకు వచ్చారు.  

ఎంతమంది చనిపోయారో చెప్పరట

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన భూక్య దేవిలాల్ అనే సమాచార హక్కు కార్యకర్త 2022 అక్టోబర్  10న 2014 నుండి 2022 వరకు విదేశాల్లో మరణించిన తెలంగాణ వాసుల వివరాలివ్వాలని జగిత్యాల కలెక్టర్​కు దరఖాస్తు చేశారు. సమాచార హక్కు దరఖాస్తు ప్రశ్నల రూపంలో ఉందని సమాధానమిస్తూ ఆయన అడిగిన వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. 

ప్రభుత్వాలు ఆదుకోకపోతే  కష్టమే.. 

గల్ఫ్​లో చనిపోయిన వారిని అక్కడి కంపెనీలతో పాటు  ఇక్కడి ప్రభుత్వం కూడా ఆదుకోవడం లేదు. ప్రవాసి భారతీయ భీమా యోజనకు రూ. 325 ప్రిమియం కడితే రూ.10 లక్షలు వస్తుంది. దీన్ని ఈసీఎన్ఆర్ (ఇమ్మిగ్రేషన్ ​క్లియరెన్స్​ రిక్వయిర్డ్​) నాన్ ఈసీఎన్ఆర్ కు సంబంధం లేకుండా గల్ఫ్ లో కార్మికుల సహజ మరణాలకు కూడా వర్తించేలా చర్యలు తీసుకోవాలని గల్ఫ్​ సంఘాలు కోరుతున్నారు. ప్రిమియం అమౌంట్ పెంచినా కట్టడానికి సిద్ధమంటున్నారు.  

అప్పుడు కేసీఆర్​ ఏమన్నారంటే..  

‘తెలంగాణ భూములు అమ్మగా వచ్చిన వేల కోట్ల నిధుల నుంచి రూ. 500 కోట్లు విడుదల చేయాలి. గల్ఫ్ మృతులకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. గల్ఫ్ లో ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐల పిల్లలను స్థానికులుగా పరిగణించి కేరళ ప్రభుత్వ తరహాలో విద్య,ఉద్యోగావకాశాలు కల్పించాలి. గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు, ఆత్మహత్య చేసుకున్న వారికి, డబ్బులు లేక తిరిగి రాలేని వాళ్లను ఆదుకోవడానికి గల్ఫ్​లో రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్​ సెల్​ ఏర్పాటు చేయాలి.  

(2008 ఏప్రిల్​ 27న సికింద్రాబాద్​లో  నిర్వహించిన టీఆర్​ఎస్​ ఏడో ప్లీనరీలో..)

రూ.5 లక్షలివ్వాలి 

గల్ఫ్​లో మృతి చెందిన వలస కార్మికులకు రూ. 5 లక్షల నష్ట పరిహారం అందజేయాలి. ఉమ్మడి రాష్ట్ర పాలనలో గల్ఫ్ లో చనిపోతే కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ కమిటీ బాధిత కుటుంబసభ్యులకు రూ.లక్ష వరకు అందించేది. గల్ఫ్ కు వెళ్లే వారికి వాతావరణ పరిస్థితులపై, అక్కడి కంపెనీలపై అవగాహన కల్పించాలి. 

–  సింగిరెడ్డి నరేష్​ రెడ్డి, గల్ఫ్ జేఏసీ నాయకులు, జగిత్యాల జిల్లా