
బాలీవుడ్ ఆగ్ర నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కు మధ్య ప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. సుమారు రూ. 15,000 కోట్ల విలువైన తన పూర్వీకుల ఆస్తుల కేసులో ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఆస్తులను 'శత్రు ఆస్తి'గా ప్రకటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సైఫ్ అలీఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
ఈ కోర్టు నిర్ణయంతో పటౌడీ కుంటుంబాకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాదు, 2000 సంవత్సరంలో ట్రయల్ కోర్టు సైఫ్ అలీ ఖాన్, ఆయన తల్లి షర్మిలా ఠాగూర్, సోదరీమణులు సోహా, సబా లను వారసులుగా గుర్తించిన ఉత్తర్వులను కూడా న్యాయస్థానం రద్దు చేసింది. అంతే కాకుండాఈ ఆస్తి వారసత్వ వివాదాన్ని కొత్తగా, ఏడాది లోపల విచారించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.
పటౌడీ కుంటుంబ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి?
పటౌడీ కుటుంబానికి భోపాల్, రైసేన్‌లలో విస్తారంగా భూములు ఉన్నాయి. వీటిలో అహ్మదాబాద్ ప్యాలెస్, కోహెఫిజా ఫ్లాగ్ హౌస్, కోఠి, రైసేన్‌లోని చిక్ లోడ్‌లో ఉన్న అటవీ ప్రాంతం వంటివి ఉన్నాయి. దార్ఉస్ సలాం, నూర్-ఎ-సబా, ఫోర్ క్వార్టర్స్, అహ్మదాబాద్ ప్యాలెస్, న్యూ క్వార్టర్స్, ఫార్స్ ఖానా వంటి అనేక ఆస్తులు కూడా తమవేనని వారు కోర్టులో పేర్కొన్నారు.
'శత్రు ఆస్తి' వివాదం ఎలా మొదలైంది?
అసలు ఈ వివాదానికి మూలం 1947లో ఉంది. అప్పట్లో భోపాల్ ఒక సంస్థానంగా ఉండేది. దాని చివరి నవాబు హమీదుల్లా ఖాన్. ఆయన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీకి మేనమామ. హమీదుల్లా ఖాన్‌కు ముగ్గురు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె అబిదా సుల్తాన్ 1950లో పాకిస్తాన్‌కు వలస వెళ్ళారు. రెండవ కుమార్తె సాజిదా సుల్తాన్ భారతదేశంలోనే ఉండి, సైఫ్ అలీ ఖాన్ తాత నవాబ్ ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీని వివాహం చేసుకున్నారు. సాజిదా సుల్తాన్ ఆస్తులకు చట్టబద్ధమైన వారసురాలిగా మారారు.
అయితే, అబిదా సుల్తాన్ పాకిస్తాన్‌కు వెళ్ళడంతో కేంద్ర ప్రభుత్వం ఆమె వాటాను 'శత్రు ఆస్తి'గా పేర్కొంది. 2015లో ముంబైకి చెందిన ఎనిమీ ప్రాపర్టీ కస్టోడియన్ కార్యాలయం భోపాల్ నవాబు భూమిని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించింది. దీంతో పటౌడీ కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
న్యాయస్థానంలో వాదనలు
నవాబ్ హమీదుల్లా ఖాన్ 1960 ఫిబ్రవరి 4న మరణించారు. భోపాల్ సంస్థానం 1949 ఏప్రిల్ 30న భారత యూనియన్‌లో విలీనమైంది. విలీన ఒప్పందం ప్రకారం, నవాబు యొక్క ప్రత్యేక హక్కులు కొనసాగుతాయని, అలాగే వ్యక్తిగత ఆస్తి యాజమాన్యం, వారసత్వం భోపాల్ సింహాసన వారసత్వ చట్టం, 1947 కింద ఉంటుందని అప్పీల్‌లో పేర్కొన్నారు. హమీదుల్లా ఖాన్ మరణానంతరం సాజిదా సుల్తాన్ నవాబుగా ప్రకటించబడ్డారు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 (22) ప్రకారం పూర్వీకుల ఆస్తిని పేర్కొంటూ ప్రభుత్వం 1962 జనవరి 10న లేఖ జారీ చేసింది.
నవాబ్ హమీదుల్లా ఖాన్ మరణానంతరం అతని వ్యక్తిగత ఆస్తిని ముస్లిం పర్సనల్ లా ప్రకారం పిటిషనర్లు, ప్రతివాదుల మధ్య పంచాల్సి ఉంది. కానీ ఆస్తి వారసత్వాన్ని కోరుతూ భోపాల్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా జిల్లా కోర్టు వారి దరఖాస్తును తిరస్కరించింది..
అయితే, అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ట్రయల్ కోర్టు కేసును కొట్టివేయడం సరైనది కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. విలీనంపై సింహాసన వారసత్వ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో మన్సూర్ అలీఖాన్ పటౌడీ, ఆయన భార్య షర్మిలా ఠాగూర్, కుమారుడు సైఫ్ అలీఖాన్, కుమార్తెలు సబా, సోహాలను ప్రతివాదులుగా చేర్చారు. 2019లో, కోర్టు సాజిదా సుల్తాన్‌ను చట్టబద్ధమైన వారసురాలిగా గుర్తించింది, ఆమె మనవడు సైఫ్ అలీ ఖాన్ ఆస్తులలో వాటాను వారసత్వంగా పొందారు. కానీ ఇప్పుడు, ఈ వివాదం మళ్ళీ మొదటికొచ్చింది. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి మరి..