జాబ్​మేళాలో 1,758 మంది ఎంపిక

జాబ్​మేళాలో 1,758 మంది ఎంపిక

దుబ్బాక, వెలుగు: సింధు భారతి ఫౌండేషన్​ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే మాదవనేని రఘునందన్​రావు సహకారంతో దుబ్బాక కేఆర్​ఆర్​ గార్డెన్​లో శనివారం నిర్వహించిన మేగా జాబ్​మేళాకు విశేష స్పందన లభించింది.  వివిధ బ్యాంకులు, ఫైనాన్స్​, సెక్యూరిటీ, ఐటీ సంస్థలు ప్రతినిధులు ముందుగానే రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 5,825 మంది నిరుద్యోగులను ఇంటర్వ్యూ చేసి 1758 మందిని ఎంపిక చేశారు. అనంతరం వీరికి ఎమ్మెల్యే రఘునందన్‌ రావుతో కలిసి అపాయింట్‌మెంట్ లెటర్స్​ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జాబ్‌ మేళా ఏర్పాటు చేశామని చెప్పారు. తాను సిద్దిపేటలో రూ. 500 జీతానికి ప్రైవేట్​టీచర్‌‌గా పనిచేశానని గుర్తు చేసుకున్నారు.

ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నానంటే కష్టపడే తత్వమే కారణమని, యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. ఆయా సంస్థలు ఎక్కడ అవకాశం ఇచ్చినా వెళ్లాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో 116 సంస్థల ప్రతినిధులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేశ్​​ గౌడ్​, కౌన్సిలర్​ మట్ట మల్లారెడ్డి, ఎంపీటీసీ పరికి రవి, నాయకులు సుభాష్​ రెడ్డి, ఎస్‌ఎన్‌ చారి, చింత సంతోశ్​, దూలం వెంకట్​, సుంకోజి ప్రవీణ్​ తదితరులు పాల్గొన్నారు.