యూపీలో ఒకే కుటుంబానికి చెందిన 18 మందితో సహా మరో వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు సంత్‌కబీర్‌నగర్ జిల్లా సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శనివారం తెలిపారు. వారందరిని ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.
యూపీలోని దారుల్ ఉలూమ్ దియోబంద్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి గత నెలలో యూనివర్శిటీ నుంచి సంత్ కబీర్ నగర్ లోని తన సొంత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చిన కొన్ని రోజులకు అతనిలో వైరస్ లక్షణాలు కనిపించడంతో ఈ వారం ప్రారంభంలో కరోనా పరీక్షలు నిర్వహించగా అతనికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ యువకుడిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అనుమానం వచ్చిన అధికారులు అతని కుటుంబసభ్యులతో పాటు బంధువులకు కూడా పరీక్షలు చేయగా 18 మందికి కరోనా సోకిందని జిల్లా కలెక్టర్ రవీశ్ కుమార్‌గుప్తా తెలిపారు. బఖిరా పోలీస్‌స్టేషన్ పరిధిలోని టిలాతి గ్రామంలోనూ ఓ కరోనా కేసు నమోదైందని కలెక్టర్ చెప్పారు. ఇతను కొద్ది రోజుల క్రితం ముంబయి నుంచి వచ్చాడని, పరీక్షలు చేస్తే పాజిటివ్‌గా తేలిందన్నారు. అతని కుటుంబసభ్యులను క్వారెంటైన్ చేశామని, వారి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపామన్నారు. శనివారం నమోదైన 19 కొత్త కేసులతో జిల్లాలో మొత్తం సంఖ్య 21కి చేరిందని స్పష్టంచేశారు. దీంతో ఆ రెండు ప్రాంతాలను రెడ్ జోన్లు గా ప్రకటించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
