భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఆర్టీఐ కమిషనర్‌‌ వద్ద 18 వేల కేసులు పెండింగ్‌‌

 భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఆర్టీఐ కమిషనర్‌‌ వద్ద 18 వేల కేసులు పెండింగ్‌‌

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సమాచార హక్కు చట్టం కమిషనర్‌‌ వద్ద 18 వేల కేసులు పెండింగ్‌‌లో ఉన్నాయని ఆర్టీఐ కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, దేశాల భూపాల్‌‌, పీవీ.శ్రీనివాస్‌‌ చెప్పారు. సమాచార హక్కు చట్టంపై భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ కలెక్టరేట్‌‌లో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గత పదేండ్లలో సమాచార శాఖ కమిషనర్‌‌ అందుబాటులో లేకపోవడం వల్లే వేల సంఖ్యలో కేసులు పెండింగ్‌‌లో పడ్డాయన్నారు. ఆఫీసర్లు.. ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారీతనంగా ఉండాలని సూచించారు.

సమాచార హక్కు చట్టం ప్రజల ప్రాథమిక హక్కు అని, ఈ చట్టంపై జిల్లాల వారీగా సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 29 ప్రభుత్వ శాఖల్లో 15 శాఖల పరిధిలో ఎలాంటి కేసులు లేకపోవడం హర్షణీయం అన్నారు. ఆర్టీఐ అమలులో రాష్ట్రాన్ని ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో నిలిపేలా కృషి చేస్తున్నామన్నారు. ఆర్టీఐ కింద ప్రజలు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లో ఇవ్వాలని, ప్రతి ఆఫీస్‌‌ వద్ద ఆర్టీఐ బోర్డు, సిటిజన్‌‌ చార్టర్‌‌ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్‌‌ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్‌‌ జితేశ్‌‌ వి.పాటిల్‌‌, ఎస్పీ బి.రోహిత్‌‌రాజు, ట్రైనీ కలెక్టర్‌‌ సౌరభ్‌‌ శర్మ, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి పాల్గొన్నారు.