ఖమ్మం పార్లమెంట్ పరిధిలో  1,896 పోలింగ్ స్టేషన్లు

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో  1,896 పోలింగ్ స్టేషన్లు
  • ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,23,814 మంది ఓటర్లు
  • ఎన్నికల నిబంధనలు పక్కాగా  పాటించాలి :రిటర్నింగ్​ అధికారి గౌతమ్​ 
  • అక్రమంగా డబ్బు తరలించకుండా పకడ్బందీ చర్యలు : సీపీ 

ఖమ్మం, వెలుగు : లోక్​సభ ఎన్నికలకు ఖమ్మం జిల్లా ఆఫీసర్లు సిద్ధమయ్యారు. కేంద్ర ఎన్నికల కమిషన్​ షెడ్యూల్​ ప్రకటనతో ఇప్పటికే ఎన్నికల కోడ్​ అమల్లోకి వచ్చింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు పాటించాల్సిన నియమాలపై ఆదివారం ఖమ్మం కలెక్టర్​ వీపీ గౌతమ్, సీపీ సునీల్ దత్ ఇతర అధికారులతో కలిసి ప్రెస్​ మీట్ నిర్వహించారు. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలకు కలెక్టర్​ గౌతమ్​ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికలకు ఓటింగ్ మే 13న జరుగుతుందని, ఫలితాలు జూన్​ 4 న వెల్లడిస్తారని చెప్పారు. ఏప్రిల్ 18న గెజిట్​ నోటిఫికేషన్​ రానుందని, ఏప్రిల్ 25న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లకు ఆఖరు అని చెప్పారు. ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటినీ, ఏప్రిల్ 29న నామినేషన్ల విత్​ డ్రాకు చివరి తేదీ అని​గౌతమ్​ వెల్లడించారు. 

ఓటర్లలో మహిళలే ఎక్కువ.. 

ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 16,23,814 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. పురుషులు 7,84,043 కాగా, మహిళలు 8,39,640 మంది, థర్డ్ జెండర్​ 131 మంది ఉన్నారు. కొత్త ఓటర్లు ఇప్పుడు కూడా ఓటు నమోదు చేసుకునే అవకాశముంది. ఏప్రిల్​ 15 వరకు అర్హత కలిగిన వారందరూ ఓటు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్​ చెప్పారు. మొత్తం 1083 లొకేషన్లలో 1896 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు వృద్ధులు, వికలాంగుల కోసం పోలింగ్ స్టేషన్లలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, వీల్​ చైర్లు సిద్ధం చేస్తున్నామన్నారు.

అయితే గతంలో 80 ఏళ్లు దాటిన దారిని వృద్ధులుగా గుర్తించి ఇంటి నుంచి ఓటేసేందుకు అనుమతినివ్వగా, ఈసారి 85 ఏళ్లకు మించిన వారు మాత్రమే ఇంటి నుంచి ఓటేసేందుకు అర్హత ఉందని తెలిపారు. మరోవైపు ఎలక్షన్​ కోడ్​ అమల్లో ఉన్నందున వ్యక్తులెవరూ రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లొద్దని చెప్పారు. అంతకు మించి నగదు తరలించాలంటే అందుకు తగిన రశీదులు తప్పకుండా చూపించాల్సి ఉంటుంది. లేదంటే పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. రూ.10 లక్షల లోపు అయితే జిల్లా ట్రెజరీకి, అంతకు మించిన మొత్తం అయితే ఐటీ అధికారులకు అందజేస్తారు. ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించిన డబ్బులు కాదు అని ఆధారాలు చూపించి నగదు తీసుకునే అవకాశం ఉంటుంది. 

ఎన్​ఫోర్స్​మెంట్ టీమ్స్ ఏర్పాటు 

ఎన్నికలకు సంబంధించి ఎన్​ ఫోర్స్​ మెంట్ టీమ్​ లను ఏర్పాటు చేశారు. మొత్తం 141 మంది సెక్టార్​ అధికారులు, 27 ఎంసీసీ టీమ్​ లు, 15 ఎస్​ఎస్​టీ టీములు, 12 ఎఫ్​ఎస్​టీ టీములు ఏర్పాటు చేసినట్టు రిటర్నింగ్ అధికారి గౌతమ్​ చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 9 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. వారి దగ్గర్నుంచే ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు తీసుకోవచ్చు.

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్​ గా మున్సిపల్​ కమిషనర్​ ఆదర్శ్ సురభి, పాలేరుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్​ రాజేశ్వరి, మధిరకు ఖమ్మం ఆర్డీవో గణేశ్, వైరాకు ఖమ్మం లోకల్​ బాడీస్​ అడిషనల్​ కలెక్టర్ సత్యప్రసాద్, సత్తుపల్లికి కల్లూరు ఆర్డీవో శ్రీనివాస్, కొత్తగూడెంకు కొత్తగూడెం ఆర్డీవో మధు, అశ్వారావుపేటకు భద్రాద్రి కొత్తగూడెం రెవెన్యూ అడిషనల్ కలెక్టర్​ వేణుగోపాల్, అడిషనల్​ ఏర్వోలుగా ఖమ్మం జడ్పీ సీఈఓ, ఖమ్మం డీఆర్డీవో సన్యాసయ్యకు బాధ్యతలు అప్పగించారు. ​ఎన్నికలకు మొత్తం 1,459 పోలింగ్ స్టేషన్లకు గాను 3,481 బ్యాలెట్​ యూనిట్లు, 1,964 కంట్రోల్​ యూనిట్లు, 2,255 వీవీ ప్యాట్లు సిద్ధం చేశారు. మీడియా సమావేశంలో అడిషనల్ కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్, ట్రైనీ కలెక్టర్​ మయాంక్ సింగ్​, ట్రైనీ ఐపీఎస్ మౌనిక, జడ్పీ సీఈఓ వినోద్ పాల్గొన్నారు. 

రూల్స్ తప్పనిసరి 

ఎలక్షన్​ కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలి. రాజకీయ పార్టీల లీడర్ల ప్రచారం, మీటింగ్ లకు అనుమతి తప్పనిసరి. ఆన్​ లైన్​ ద్వారా అనుమతులు పొందొచ్చు. పబ్లిక్​ గ్రౌండ్స్​ కానీ, హెలిప్యాడ్​ కోసం గానీ ఎవరు ముందుగా దరఖాస్తు చేసుకుంటే వారికే అనుమతిస్తాం. మతపరమైన కార్యక్రమాల్లో లీడర్లు పాల్గొన్నా కూడా అనుమతి తీసుకోవాలి. సీ విజిల్ యాప్​ ద్వారా సామాన్యులెవరైనా ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేయవచ్చు.

  ‌‌‌‌‌‌‌‌‌వీపీ గౌతమ్, రిటర్నింగ్ అధికారి

నిరంతర తనిఖీలు  

ఎన్నికల నిబంధనల మేరకు డబ్బు తరలింపు జరగకుండా చెక్​ పోస్టులను ఏర్పాటు చేశాం. రెండు ఇంటిగ్రేటెడ్ బార్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. 

మొత్తం పోలింగ్ స్టేషన్లలో 205 

క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. రౌడీ షీటర్లను బైండోవర్​ చేస్తున్నాం. 16 మంది వెపన్​ పర్మిషన్​ పొందినవారు ఉన్నారు. వాళ్లంతా వెపన్​ ను 
డిపాజిట్ చేయాలి.

సునీల్ దత్, సీపీ