పాక్ డ్రోన్లను నేలకూల్చి 250 మందిని కాపాడారు..ఆపరేషన్ సిందూర్ సీఐఎస్ ఎఫ్ సిబ్బందికి సత్కారం

పాక్ డ్రోన్లను నేలకూల్చి 250 మందిని కాపాడారు..ఆపరేషన్ సిందూర్ సీఐఎస్ ఎఫ్ సిబ్బందికి సత్కారం
  • ఆపరేషన్​ సిందూర్​ వేళ జమ్మూలోని ఉరిలో సీఐఎస్​ఎఫ్​వీరోచిత పోరాటం
  • 19 మంది సిబ్బందికి డైరెక్టర్​ జనరల్స్​​డిస్క్ లతో సత్కారం

న్యూఢిల్లీ: ఆపరేషన్​ సిందూర్​ టైమ్​లో పాకిస్తాన్​ దుశ్చర్యను దీటుగా ఎదుర్కొని.. 250 మంది ప్రాణాలను కాపాడారు మన సీఐఎస్​ఎఫ్​ సిబ్బంది. ఒకవైపు నింగిలోంచి దూసుకొస్తున్న పాక్​ డ్రోన్లను ఎక్కడికక్కడ నేలకూలుస్తూనే.. ఆ పరిసరాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శత్రువుకు ఎదురొడ్డి.. అక్కడి ఆస్తులనూ రక్షించారు. వీరోచితంగా పోరాడిన 19 మంది సీఐఎస్​ఎఫ్​ వీరులు ప్రతిష్టాత్మకమైన ‘డైరెక్టర్​ జనరల్స్​ డిస్క్​’లను అందుకున్నారు. ఆ పురస్కారాల ప్రదానంతో నాటి పోరాటం వెలుగులోకి వచ్చింది.

ఆ రోజు ఏం జరిగింది?

మే 7న భారత ఆర్మీ ఆపరేషన్​ సిందూర్​ చేపట్టి పాక్​​లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ప్రతిగా పాకిస్తాన్ మన భూభాగంపైకి డ్రోన్లతో అటాక్​ చేసింది. ఎల్​వోసీకి 10 కిలోమీటర్ల దూరంలోని ఉరి ప్రాంతంపై భారీగా డ్రోన్లను ప్రయోగించింది. ఈ ఏరియాలో ఎన్​హెచ్​పీసీ పవర్​ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో పనిచేసే సిబ్బంది తమ కుటుంబాలతో స్థానికంగా నివసిస్తుంటారు. 

పాక్​ డ్రోన్లతో దాడిని మొదలుపెట్టగానే.. ప్లాంట్ల పరిసరాల్లో డ్యూటీలో ఉన్న కమాండెంట్​ రవి యాదవ్​ ఆధ్వర్యంలోని 19 మందితో కూడిన సెంట్రల్​ ఇండస్ట్రియల్​ సెక్యూరిటీ ఫోర్స్​(సీఐఎస్​ఎఫ్)​ టీమ్​ అలర్ట్​ అయింది. డ్రోన్లను కూల్చేస్తూనే ఎన్​హెచ్​పీసీ స్టాఫ్​తోపాటు స్థానికులను 250 మందిని బంకర్లలోకి తరలించింది. ఇట్ల 250మంది ప్రాణాలను కాపాడటంతోపాటు పవర్​ ప్లాంట్లకు ఎలాంటి డ్యామేజీ కాకుండా సీఐఎస్​ఎఫ్​ సిబ్బంది ఎదురొడ్డి పోరాడారు. 

వీరిని ‘డైరెక్టర్​ జనరల్స్​ డిస్క్’లతో సీఐఎస్​ఎఫ్​ డైరెక్టర్​ జనరల్ ప్రవీర్​ రంజన్​​సత్కరించారు. డిస్క్​లు అందుకున్నవారిలో కమాండెంట్​రవి యాదవ్​, డిప్యూటీ కమాండెంట్​ మనోహర్​సింగ్, అసిస్టెంట్​ కమాండెంట్​ సుభాష్​కుమార్​, ఇన్స్​పెక్టర్​ డీపక్​ కుమార్​ ఝా, సబ్​ ఇన్​స్పెక్టర్లు అనిల్​కుమార్​, దీపక్​ కుమార్​, అసిస్టెంట్​ సబ్​ ఇన్​స్పెక్టర్లు రాజీవ్​ కుమార్​, సుఖ్​దేవ్​సింగ్​, హెడ్​ కానిస్టేబుళ్లు మనోజ్​ కుమార్​ శర్మ, రామ్​ లాల్​, గుర్జిత్​ సింగ్​, కానిస్టేబుల్​ సుశీల్​ వి కాంబ్లే, రజాక్​ రఫీక్​, రవీంద్ర వాంకడే, త్రిదేవ్​ చక్మా, సోహాన్​ లాల్​, ముఫీద్​ అహ్మద్​, మహేశ్​కుమార్​, సందెనబోయిన రాజు ఉన్నారు.