రెజ్లర్ల నిరసనకు మద్దతు పలికిన 1983 వరల్డ్ కప్ హీరోస్

రెజ్లర్ల నిరసనకు మద్దతు పలికిన 1983 వరల్డ్ కప్ హీరోస్

డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్‌ శరన్‌ సింగ్‌‌ను అరెస్ట్ చేయాలంటూ రెజ్లర్ల చేస్తోన్న ఆందోళనకు క్రమక్రమంగా అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ప్రపంచ రెజ్లింగ్‌ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ) రెజ్లర్లకు అండగా నిలవగా, తాజాగా 1983 వరల్డ్ కప్ హీరోస్ టీం కూడా వారికి మద్దతు తెలిపింది. రెజ్లర్లు కష్టపడి సంపాదించిన పతకాలను గంగా నదిలో పడేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల వారు ఆందోళన చెందుతున్నట్లు వెల్లడించింది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ప్రకటన విడుదల చేసింది.

'దేశం గర్వించేలా చేసినా రెజ్లర్ల పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించబడుతున్న దృశ్యాలను చూసి మేము చాలా బాధపడుతున్నాం.. కష్టపడి సంపాదించిన పతకాలను గంగా నదిలో పడేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల ఆందోళన చెందుతున్నాం. ఆ పతకాల వెనుక సంవత్సరాల తరబడి కృషి, త్యాగం, పట్టుదల దాగుంది. అవి వారి సొంతం మాత్రమే కాదు.. దేశం ప్రతిష్టతలు దాగున్నాయి. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని కోరుతున్నాము. ఈ సమస్య వీలైనంత త్వరగా పరిష్కరించబడాలని ఆశిస్తున్నాము..' అంటూ 1983 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టు ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన వెలువరించిన వారిలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కూడా ఉండటం గమనార్హం. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్,  కృష్ణమచారి శ్రీకాంత్, యశ్‌పాల్ శర్మ, బిఎస్ సాధు, మోహిందర్ అమర్‌నాథ్, సందీప్ పాటిల్, కృతి ఆజాద్, రోజర్ బిన్ని, రవిశాస్త్రిలు 1983 ప్రపంచకప్ విన్నింగ్ టీం సభ్యులుగా ఉన్నారు. 

https://twitter.com/ANI/status/1664572065205358592

ఇదిలావుంటే, మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్, తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. ఈ నెల 5న అయోధ్యలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చూడగా, అధికారులు అందుకు అనుమతి నిరాకరించారు.అతనిపై వచ్చిన లైంగిక ఆరోపణలపై దర్యాప్తు జరుగుతున్నందున సుప్రీంకోర్టు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.