ఆరో తరగతి విద్యార్థి అకౌంట్లో 900 కోట్లు

ఆరో తరగతి విద్యార్థి అకౌంట్లో 900 కోట్లు

పాట్నా: ఆ పిల్లలిద్దరూ స్కూల్ విద్యార్థులు. చదివేది ఆరో తరగతి. ఏ పనిచేయకున్నా.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. ఏకంగా వారి అకౌంట్లలో కోట్లు జమయ్యాయి. దాంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కూడా షాక్‎కు గురయ్యారు. వివరాలలోకి వెళితే.. బీహార్‌లోని కటిహార్‌ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆరో తరగతి చదువుతున్నారు. ప్రభుత్వ పథకం ద్వారా వచ్చే డబ్బుతో స్కూల్ షూస్, యూనిఫాం కొనుక్కోవాలనుకున్నారు. అందుకోసం వారిద్దరూ బీహార్ గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశారు. అయితే బ్యాంకు ఖాతాలో ఏమైనా డబ్బులు జమ అయ్యాయో చూద్దామని పిల్లలు వారి తల్లిదండ్రులతో కలిసి స్థానికంగా ఉన్న ఇంటర్‎నెట్ సెంటర్‎కి వెళ్లారు. అక్కడ బ్యాంకు అకౌంట్ చెక్ చేసిన వారు షాకు కు లోనయ్యారు. విద్యార్థుల ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఆశిష్ అనే 6వ తరగతి విద్యార్థి అకౌంట్లో 6.2 కోట్లు మరియు గురు చరణ్ విశ్వాస్ అనే మరో విద్యార్థి అకౌంట్లో ఏకంగా 900 కోట్లు జమైనట్లు గుర్తించారు. విషయం బయటకు తెలియడంతో గ్రామస్తులంతా బ్యాలన్స్ చెక్ చేసుకోవడానికి ఏటీఎం సెంటర్ల వద్ద బారులుతీరారు. అయితే గ్రామస్తులందరికీ నిరాశే మిగిలింది.

విషయం గ్రామాధికారి దృష్టికి వెళ్లడంతో స్థానిక బ్యాంక్ లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ ఉదయన్ మిశ్రా తెలిపారు. ‘ఇద్దరు అబ్బాయిల బ్యాంక్ అకౌంట్లలోకి భారీ మొత్తం జమైనట్లు నిన్న సాయంత్రం నాకు సమాచారం అందింది. మేం ఆ విషయాన్ని పరిశీలిస్తున్నాం. ఇది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి మేం గురువారం ఉదయం బ్యాంకు బ్రాంచ్‎కు వెళ్లాం. దీని గురించి బ్రాంచ్ మేనేజర్‎ను అడిగితే.. తమ బ్యాంకు కంప్యూటరైజ్డ్ సిస్టమ్‎లో కొంత లోపం ఉన్నట్లు ఆయన తెలిపారు. మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థుల స్టేట్‌మెంట్‌లలో ఆ డబ్బు మొత్తం కనిపిస్తుంది కానీ, అసలు డబ్బు వారి ఖాతాలో లేదు. ఏదేమైనా బ్యాంక్ నుంచి పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని కోరాం’ అని మేజిస్ట్రేట్ ఉదయన్ తెలిపారు.

కాగా.. ఈ మధ్య ఇలా బ్యాంకు ఖాతాలలో పొరపాటుగా డబ్బులు జమకావడం రాష్ట్రంలో ఇది రెండోసారి. రెండు రోజుల క్రితం పాట్నా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అకౌంట్లో 5.5 లక్షల రూపాయలు జమయ్యాయి. తప్పును గుర్తించిన బ్యాంకు సిబ్బంది.. డబ్బులు తిరిగివ్వాలని కోరితే.. ఆ వ్యక్తి తిరస్కరించాడు. పైగా.. ప్రధాని మోడీ తన అకౌంట్లో వేశారేమోననని అనుకున్నానని అన్నారు. అందుకే ఆ డబ్బులన్నీ ఖర్చుచేశానని.. ఇప్పుడు తాను చెల్లించలేనని తెలపడంతో.. పోలీసులు అరెస్ట్ చేశారు.