ఆస్పత్రిలో కవలలు మృతి

ఆస్పత్రిలో కవలలు మృతి
  • డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయారని బాధితుల ఆందోళన 

నల్గొండ అర్బన్​, వెలుగు :  నల్గొండ ప్రభుత్వ జనరల్​ హాస్పిటల్​(మాతా శిశు ఆరోగ్య కేంద్రం)లో  కవలలు చనిపోయారు. ఎంసీహెచ్​ డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే శిశువులు చనిపోయారని ఆరోపిస్తూ బాధితులు గురువారం మాతాశిశు ఆరోగ్య కేంద్రం ముందు ధర్నా చేశారు. శిశువుల తండ్రి సతీశ్​మాట్లాడుతూ.. ఈనెల 20న తన భార్య నవ్యను కాన్పుకోసం ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ చేశానని తెలిపారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు నార్మల్​ డెలివరీ అవుతుందని చెప్పారు కానీ, గురువారం ఆమెకు ఆపరేషన్​ చేసి కవలలను బయటకు తీశారన్నారు.

అప్పటికే శిశువులు చనిపోయారని, డాక్టర్లు సకాలంలో ఆపరేషన్​ చేసి ఉంటే పిల్లలు బతికేవారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ పిల్లలు చనిపోయారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ ఘటనపై సూపరింటెండెంట్​ లచ్చూ మాట్లాడుతూ.. గర్భంలోనే చిన్నారులు చనిపోయి ఉన్నారని, దీంతో ఆపరేషన్ చేసి బయటకు తీయాల్సి వచ్చిందని తెలిపారు. ఇందులో డాక్టర్ల నిర్లక్ష్యం ఏమీ లేదని స్పష్టం చేశారు.