కొండచరియలు విరిగి పడి.. 2 నెలల చిన్నారి, తల్లితో సహా నలుగురు మృతి

కొండచరియలు విరిగి పడి.. 2 నెలల చిన్నారి, తల్లితో సహా నలుగురు మృతి

కొండ చరియలు విరిగిపడి 2 నెలల చిన్నారి, తల్లితో సహా నలుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన జమ్మూకశ్మీర్ లోని రియాసీ జిల్లా మహోర్ సబ్ డివిజన్ లోని చస్సానా గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వింటర్ సీజన్  ప్రారంభమైన జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో భారీగా మంచు కురుస్తోంది.  రెండురోజులుగా మహోర్ సబ్ డివిజన్ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో చస్సానాలోని ఓ ఇంటిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇల్లు కుప్పకూలిపోయింది. 

ప్రమాద సమయంలో ఇంట్లో గాఢ నిద్రలో ఉన్న వారిపై శిథిలాలు పడడంతో నలుగురు చనిపోయారు. సమాచారం అందుకున్న  పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికి తీశారు. మృతుల్లో 2 నెలల చిన్నారి, తల్లి, మరో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు రియాసీ డిప్యూటీ కమిషనర్ విశేష్ పాల్ మహాజన్ తెలిపారు.

జమ్మూ సమీపంలోని రాంబన్ ఏరియాలో కొండప్రాంతాల నుంచి భారీగా బురద నీటి చేరికతో జమ్మూ, శ్రీనగర్ హైవేను రెండోరోజు క్లోజో చేశారు. లోయ ప్రాంతాల వాసులు అలర్ట్ గా ఉండాలన్నారు అధికారులు. పూంచ్ జిల్లాలో చిక్కుకపోయిన ట్రెక్కర్స్ ను స్థానికులు కాపాడారు. 

సిమ్లా, మనాలిలోనూ భారీగా కురుస్తున్న మంచు, వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నాలుగు జాతీయ రహదారులతో సహా 350 రోడ్లను క్లోజ్ చేశారు అధికారులు. కులుతో పెద్దఎత్తున మంచుకురిసే చాన్స్ తో అన్ని విద్యాసంస్థలను మూసివేశారు.  హెవీ  స్నో ఫాల్ తో కులు జిల్లాలో ట్రాఫిక్  ఎక్కడిక్కడ నిలిచిపోయింది. పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోవటంతో టూరిస్టులు ఇబ్బందిపడుతున్నారు. అటల్ టన్నెల్  సైతం  క్లోజ్ చేశారు. భారీ మంచుతో సోలాంగ్ నాలాలోని రోడ్లపై పెద్దఎత్తున మంచు పేరుకపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్  వ్యవస్థ స్తంభించింది.  రోడ్లను క్లీన్ చేసేందుకు BRO అధికారులు చర్యలు చేపట్టారు.