జమ్ము కశ్మీర్‌‌లో ఎన్‌కౌంటర్‌‌.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్ము కశ్మీర్‌‌లో ఎన్‌కౌంటర్‌‌.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

రాజౌరీ: జమ్ము కశ్మీర్‌‌లోని రాజౌరీ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో ఇద్దరు టెర్రిరిస్టులు హతమయ్యారు. జిల్లాలోని థన్నమండీ అటవీ ప్రాంతంలో ముగ్గురు, నలుగురు వరకూ టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ, జమ్ము పోలీసులు కలిసి ఆపరేషన్ షురూ చేశారు. వాళ్లు ఉన్న ప్రాంతానికి చేరుకోగానే హోరాహోరీ గన్‌ ఫైట్ మొదలైంది. ఈ ఆపరేషన్‌లో పై చేయి సాధించిన మన బలగాలు శుక్రవారం మధ్యాహ్నం వరకే ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారని, ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని జమ్ము జోన్ అడిషనల్ డీజీపీ ముకేశ్ సింగ్ తెలిపారు. ఆ అటవీ ప్రాంతంలో నక్కి ఉన్నారని భావిస్తున్న నలుగురు టెర్రరిస్టుల్లో ఇద్దరు పాకిస్థాన్‌కు చెందిన వాళ్లని ఆయన చెప్పారు. కశ్మీర్‌‌ జోన్‌లో టెర్రరిస్టుల ఏరివేత భారీగా సాగుతుండడంతో తప్పించుకునేందుకు ఈ అడవుల్లోకి వచ్చి ఉండొచ్చని అన్నారు. అయితే గడిచిన నెల రోజులుగా థన్నమండీ ఫారెస్ట్ బెల్డ్ ఏరియాలో టెర్రిరిస్టుల జాడ గుర్తించేందుకు టెక్నాలజీని ఉపయోగించి సర్వైలెన్స్ పెట్టామని ముకేశ్ సింగ్ పేర్కొన్నారు. ఇవాళ పక్కా సమాచారం రావడంతో రంగంలోకి దిగి ఈ బలగాలు ఎన్‌కౌంటర్ చేసినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌ను రౌజౌరీ ఎస్పీ నబీ ఖాస్బా ఆధ్వర్యంలో జరుగుతోందని చెప్పారు.