హైదరాబాద్ లో 20శాతం నిద్రలేమి బాధితులు

హైదరాబాద్ లో 20శాతం నిద్రలేమి బాధితులు

‘‘నేను పనిచేస్తోంది యూఎస్ బేస్డ్ కంపెనీలో. క్లైంట్స్​టైమింగ్స్ కి అనుగుణంగా ఇక్కడి నుంచి పనిచేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రం అవడం వల్ల వర్కింగ్​ అవర్స్​ పెరిగాయి. అర్ధరాత్రి వరకు చేయాల్సి ఉంటోంది. కొన్నిసార్లు నైట్ షిఫ్ట్ పడుతోంది. దీనివల్ల నిద్ర చాలా డిస్ట్రబ్ అవుతోంది. ఆ ఎఫెక్ట్​ రోజు వారి యాక్టివిటీస్ పడుతోంది. మిగిలిన విషయాల మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. చాలా నీరసంగా ఉంటోంది.’’ అని ఐటీ ఎంప్లాయ్ సనా చెప్పారు.

హైదరాబాద్, వెలుగు: సిటీలో నిద్రలేమి సమస్య బాధితులు పెరుగుతున్నారు. వర్క్ ఫ్రం హోం, పనిచేసే టైం పెరగడం, వివిధ పనుల కారణంగా నిద్రను వాయిదా వేయడమే ఇందుకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు. గతంతో పోలిస్తే నిద్రలేమితో బాధపడుతున్నవారు15 నుంచి 20 శాతం పెరిగారని అంటున్నారు. వీరిలో ఎక్కువ శాతం 20 నుంచి 40 ఏండ్ల లోపువారు ఉన్నారు. ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్​లో అధిక శాతం మంది నిద్రను వాయిదా వేస్తున్నారని తేలింది. ఐటీ ఎంప్లాయ్స్​కు వర్క్ ఫ్రం హోం స్టార్ట్​అయినప్పటి నుంచి వర్కింగ్​అవర్స్​పెరిగాయి. షిఫ్ట్ తో సంబంధం లేకుండా లేట్ నైట్ వరకు ల్యాప్ టాప్ ముందేసుకుని పనిచేయాల్సి వస్తోంది. ప్రజెంటేషన్లు, మీటింగులు ఇలా ఎక్కువ సేపు ల్యాప్‌టాప్, సిస్టం స్క్రీన్స్ చూస్తూ నిద్రను ఆపుకుంటున్నారు. దీంతో చాలా మంది బెడ్ టైం ప్రొక్రాస్టియేషన్ (నిద్రను వాయిదా వేయడం) అనే సమస్య బారినపడుతున్నారు. ఐటీ ఎంప్లాయ్సే కాదు మిగిలిన సెక్టార్లలో నైట్​షిఫ్ట్​లు చేసేవాళ్లు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. వర్క్​అయిపోయిన వెంటనే నిద్ర పట్టక ఫోన్లు చూస్తూ ఉండడం కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. మునుపటితో పోలిస్తే నిద్ర వాయిదా వేసేవారు పెరిగారని అంటున్నారు. 

షిఫ్ట్​కు మించి పనిచేయడం..

ఫస్ట్​లాక్​డౌన్ తర్వాత కంపెనీలన్నీ వర్క్​ఫ్రం హోం ప్రకటించాయి. కరోనా ప్రభావం తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినా చాలా ఐటీ కంపెనీలు వర్క్​ఫ్రం హోంను కంటిన్యూ చేస్తున్నాయి. ఆఫీసులో చేసే పని కంటే రెండింతలు ఎక్కువ ఇస్తుండడంతో ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఉదయం లాగిన్​అయితే అర్ధరాత్రి దాకా మీటింగ్స్, క్లైంట్ కాల్స్ తోనే సరిపోతోందని చెప్తున్నారు. ఒక్కోసారి షిఫ్ట్​టైంకు మించి పనిచేయాల్సి వస్తోందంటున్నారు. ముఖ్యంగా యూఎస్‌, యూకే బేస్డ్ కంపెనీలతో కలిసి పనిచేసే ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంను మరింత ప్రెజర్​గా ఫీలవుతున్నారు. ఈ షిఫ్టులు చేసేవారు అర్ధరాత్రి 2 గంటల వరకు, తెల్లవారుజాము వరకు మేల్కొని పనిచేస్తున్నారు. దీంతో నిద్రను ఆపుకోవడం తప్పనిసరి అవుతోంది.

తీరిక ఉండట్లేదని, ప్రెజర్​ పెరుగుతోందని

ఆఫీసులకు వెళ్లి పని చేసినప్పటితో పోలిస్తే వర్క్ ఫ్రం హోమ్ ద్వారా 50 నుంచి 80 శాతం వర్క్​ప్రెజర్ పెరిగిందని ఎంప్లాయ్స్ చెప్తున్నారు. ప్రాజెక్ట్​డెడ్ లైన్స్, మీటింగ్స్, క్లైంట్​కాల్స్ తో తీరిక ఉండట్లేదని, ఇన్ని టెన్షన్స్ లో నిద్రను మరుస్తున్నామని అంటున్నారు. డైలీ కనీసం 6 గంటలు కూడా నిద్ర పోవట్లేదని చెప్తున్నారు. 2020 ఆగస్టులో అంతర్జాతీయంగా బెడ్ టైం ప్రొక్రాస్టియేషన్​పై స్విట్జర్లాండ్ కి చెందిన ఈఎన్​టీజే ఎన్విరాన్ రెస్ పబ్లిక్ హెల్త్ చేసిన స్టడీలో కూడా దాదాపు 70 శాతం మంది స్లీప్ లెస్ ప్రాబ్లమ్​తో ఇబ్బంది పడుతున్నారని తేలింది. ఇటీవల గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డ్ 2022 సర్వే రిపోర్టులో కూడా హైదరాబాద్ లో అధికశాతం మంది నిద్రను మరుస్తున్నరని తెలిసింది. పని వేళల్లో నిద్రమత్తుతో బాధపడుతున్న వారి సంఖ్య గతేడాది 20 శాతం ఉంటే ప్రస్తుతం అది 49 శాతానికి పెరిగింది.  ఇందులో 53 శాతం ఐటీ సెక్టార్ కి చెందినవారే ఉన్నారు. 

బాధితులు 20 నుంచి 40 ఏండ్ల వాళ్లే

గతంతో పోలిస్తే నిద్రను వాయిదా వేస్తూ ఇబ్బంది పడుతున్నవారు 15 నుంచి 20 శాతం పెరిగారు. వీరిలో 20 ఏండ్ల నుంచి 40 ఏళ్లలోపు వారు అధికంగా ఉంటున్నారు. వర్క్ ఫ్రం హోం వల్ల ఎంప్లాయ్స్ ​ఎక్కువ గంటలు చేస్తున్నారు. విదేశీ కంపెనీల్లో పనిచేస్తున్న వారందరికి మెడికేషన్ కంటే పర్సనల్ కేర్ ఎక్కువగా తీసుకోవాలని చెప్తున్నాం. షిఫ్ట్ లు మార్చుకోవడం కుదరకపోతే నెల రోజులు నైట్ షిఫ్ట్, నెలరోజులు డే షిఫ్ట్ చేయాలని సూచిస్తున్నాం. ‌‌- డా.మేజర్ అలీ, సైకియాట్రిస్ట్, కేర్ హాస్పిటల్స్

వర్క్​ అయిపోన వెంటనే నిద్ర రాదు

నేను  చేసే ప్రాజెక్టు మీద డైలీ క్లైంట్ మీటింగ్స్ ఉంటాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటరాక్షన్ ఉంటుంది. వాళ్ల డౌట్లు క్లియర్ ​చేసి మా ఆలోచనలు చెప్పాల్సి ఉంటుంది. వర్క్, మీటింగ్స్ ​అయిపోయి పడుకునేసరికి అర్ధరాత్రి ఒకటి, రెండు అవుతుంది. 
-  అరుణ, ఐటీ ఎంప్లాయ్, యూసఫ్ గూడ