
న్యూఢిల్లీ: అమెరికాతో బైలేటరల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (బీఎఫ్‌టీఏ) కుదిరితే ఇండియాకే ఎక్కువ లాభమని గ్లోబల్ ఇన్వెస్టర్ మార్క్ మొబియస్ అభిప్రాయపడ్డారు. మొబియస్ ఈఎం ఆపర్చునిటీస్ ఫండ్‌ను నిర్వహిస్తున్న ఈ బిలియనీర్, నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహపూర్వక సంబంధం ఉందని అన్నారు. ట్రంప్ త్వరలో పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారని, ఇది మార్కెట్లను శాంతపరుస్తుందని, ఆర్థిక మందగమనాన్ని నివారిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్‌లో నాన్-టారిఫ్ అడ్డంకులు (ఉదా., క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్షన్) ఉన్నాయని, వీటిని తొలగించి యూఎస్‌తో ఉచిత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం ఉత్తమమని ఇండయాకు సలహా ఇచ్చారు. కాగా, ఈ నెల 9 లోపు తాత్కాలిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై న్యూఢిల్లీ, వాషింగ్టన్ పనిచేస్తున్నాయి. దీనికి సంబంధించిన నిబంధనలు ఖరారయినట్టు తెలుస్తోంది. మొబియస్ ప్రకారం, పూర్తి ఉచిత వాణిజ్య వాతావరణాన్ని కలిపించడం బెటర్. కానీ చైనా వంటి దేశాలు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) నిబంధనలను, రెసిప్రాసిటీ (ఇరు దేశాలు లాభపడేలా ఎక్స్చేంజ్ చేసుకోవడం) వంటి రూల్స్‌ను పాటించడం లేదు.