ఇథనాల్ ప్రొడక్షన్‌‌కు రూ.20 వేల కోట్ల లోన్లు

ఇథనాల్ ప్రొడక్షన్‌‌కు రూ.20 వేల కోట్ల లోన్లు
  • ఈ ఏడాది చివరినాటికి చేరుకుంటామన్న ప్రభుత్వం
  • ఇథనాల్ ప్రొడక్షన్‌‌కు రూ.20 వేల కోట్ల లోన్లు

న్యూఢిల్లీ: దేశంలో ఇథనాల్ ప్రొడక్షన్ పెరుగుతోంది. ప్రస్తుతం  1,000 కోట్ల లీటర్ల ఇథనాల్‌‌ ఉత్పత్తి అవుతుండగా,  ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఈ నెంబర్ 1,250 కోట్ల లీటర్లకు అంటే  25 శాతం పెరుగుతుందని ఫుడ్ మినిస్ట్రీ డైరెక్టర్‌‌ (షుగర్‌‌‌‌ అండ్ వెజిటేబుల్స్‌‌) సంగీత్‌‌ సింగ్లా పేర్కొన్నారు. ‌‌ పెట్రోల్‌‌లో ఇథనాల్ బ్లెండింగ్ పర్సంటేజ్‌‌ను ప్రభుత్వం 10 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరి నాటికి ఈ నెంబర్‌‌‌‌ను 12 శాతానికి, 2025 నాటికి 25 శాతానికి పెంచాలని చూస్తోంది. వెహికల్స్‌‌ తయారీ కంపెనీలు కూడా ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్‌‌తో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్‌‌ బండ్లను తీసుకొస్తున్నాయి. ‘ఇప్పటి వరకు రూ. 20 వేల కోట్ల విలువైన లోన్లను ఇథనాల్ ప్రాజెక్ట్‌‌ల కోసం బ్యాంకులు మంజూరు చేశాయి. ఇందులో రూ. 10 వేల కోట్లను ఇప్పటికే ఇచ్చాయి. వడ్డీ రాయితీ స్కీమ్‌‌ కింద ఈ లోన్లను మంజూరు చేశాయి’ అని సంగీత్‌‌ సింగ్లా పేర్కొన్నారు. ఇప్పటి వరకు 225 ఇథనాల్ ప్రాజెక్ట్‌‌లు ఈ స్కీమ్‌‌ కింద ప్రయోజనం పొందాయని అన్నారు.  

ధాన్యాల నుంచీ ఇథనాల్‌‌..

ప్రస్తుతం  దేశంలో ప్రొడ్యూస్ అవుతున్న  1,000 కోట్ల ఇథనాల్‌‌లో 70 శాతం చెరుకు నుంచి, 30 శాతం  ధాన్యాల నుంచి ఉత్పత్తవుతోందని  సింగ్లా అన్నారు. పెట్రోల్‌‌లో బ్లెండింగ్ చేయడానికే  కాకుండా ఆల్కాహాల్ ఇండస్ట్రీ కూడా వాడుకునేంత ఇథనాల్ ప్రస్తుతం ఉత్పత్తి అవుతోందని చెప్పారు. దీంతో రైతులు కూడా ప్రయోజనం పొందుతున్నారని వివరించారు. నూకల నుంచి ఇథనాల్‌‌ తీయడానికి ప్రభుత్వం అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. కానీ, అందుబాటులోని నూకలు తక్కువగా ఉన్నాయి. ఇథనాల్‌‌ను వివిధ మార్గాల్లో ప్రొడ్యూస్ చేయాలని ప్రభుత్వం  చూస్తోంది. ఇందులో  మొక్కల నుంచి తీసే 2జీ ఇథనాల్ ఒకటి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పానిపట్‌‌లో 2జీ ఇథనాల్‌‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌‌ను ఏర్పాటు చేసింది.   మొక్క జొన్న నుంచి కూడా ఇథనాల్‌‌ను తీయడానికి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ‘ప్రస్తుతం మొక్క జొన్నను పశువులకు దాణాగా వాడుతున్నారు. విస్తీర్ణాన్ని పెంచేందుకు  మొక్కజొన్న  పంటలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్రాలను కోరాం.  మిగులు ఉంటే వీటి నుంచి ఇథనాల్ తీయొచ్చు’ అని సింగ్లా పేర్కొన్నారు. క్లీన్​ ఫ్యూయల్స్ వైపు మారాల్సిన అవసరం ఉందన్న ఆయన,  హైడ్రోజన్‌‌, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇథనాల్ వంటి ఆల్టర్నేటివ్‌‌లు ఉన్నాయని గుర్తు చేశారు. మరోవైపు ఇథనాల్ ప్రొడక్షన్‌‌లో ఇండియాతో కలిసి పని చేసేందుకు రెడీగా ఉన్నామని బ్రెజిల్ కౌన్సిలర్ ఆఫ్ పబ్లిక్ డిప్లమసీ పాలో చైరెల్లీ పేర్కొన్నారు. చెరుకును ఎక్కువగా పండించే  దేశాలు కావడంతో గ్లోబల్‌‌ ఇథనాల్‌‌ ట్రేడ్‌‌లో కీలకంగా మారగలుగుతామని అంచనావేశారు.