
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని వరుసగా ఏడవ రోజు పొగమంచు దట్టంగా కమ్మేసింది. బుధవారం ఉదయం టెంపరేచర్స్ 3.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో ప్రజలు విపరీతమైన చలితో వణికిపోయారు. పొగమంచు కారణంగా ఉదయం 5 గంటలకు విజిబిలిటీ 200 మీటర్లకు పడిపోయింది.
గాలిలో తేమ 91 శాతంగా నమోదైంది. దాంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణ ప్రతికూల ప్రభావంతో ఢిల్లీకి వెళ్లే దాదాపు 20 రైళ్లు ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మంగళవారం మొత్తం 371 వద్ద ఉన్న ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)..బుధవారం 373 రీడింగ్‌తో " వెరీ పూర్" కేటగిరీలో కొనసాగింది.
రాజస్థాన్‌లో పెరిగిన టెంపరేచర్
కొద్ది రోజులుగా చలితో వణికిపోతున్న రాజస్థాన్‌లో బుధవారం మినిమం టెంపరేచర్స్ స్వల్పంగా పెరిగాయి. దాంతో రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన చలి నుంచి కొంత రిలీఫ్ దొరికింది. అల్వార్ ఏరియాలో రాష్ట్రంలోనే అత్యంత తక్కువ టెంపరేచర్ 4.5 డిగ్రీల సెల్సియస్ నమోదైందని జైపూర్ వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో అక్కడి ప్రజలు మాత్రమే ఇంకా చలితో వణికిపోతున్నారని తెలిపింది. గడిచిన 24 గంటల వ్యవధిలో గంగానగర్‌లో 5.5 డిగ్రీలు, పిలానీలో 5.6 డిగ్రీలు, సంగరియాలో 5.8 డిగ్రీలు, సిరోహిలో 6.2 డిగ్రీల టెపరేచర్ రికార్డ్ అయినట్లు వివరించింది. జైపూర్‌లో మినిమం టెపరేచర్ 6.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ప్రస్తుతం రాజస్థాన్‌లో వాతావరణం పొడిగా ఉంది. కొన్ని చోట్ల దట్టమైన పొగమంచు కురుస్తుండగా..మరి కొన్ని చోట్ల చలిగాలులు వీస్తున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో పలు చోట్ల 4 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.