20 ఏళ్లు పూర్తి చేసుకున్న 'ఖడ్గం' మూవీ

20 ఏళ్లు పూర్తి చేసుకున్న 'ఖడ్గం' మూవీ

తెలుగులో చాలామంది గొప్ప దర్శకులు ఉన్నారు. ఇక ముందు కూడా చాలామంది వస్తారు. కానీ.. కొద్దిమంది దర్శకులు మాత్రమే హీరోలకు, కలెక్షన్లకు సంబంధం లేకుండా జీవితాన్ని రిస్క్ లో పెట్టి మరి సినిమాలు తీస్తారు. ఇలాంటి వాళ్ళకి సినిమా అంటే వ్యాపారం కాదు.. సినిమానే జీవితం. వాళ్లలో క్రియేటివ్‌ డైరక్టర్ కృష్ణవంశీ ఒకరు. చేసే ప్రతి సినిమాకు సంబంధం లేకుండా.. జయాపజయాలతో నిమిత్తం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేక స్థాయిని సృష్టించుకున్నారు. కృష్ణవంశీ తరువాత చాలా మంది దర్శకులు వచ్చినప్పటికీ క్రియేటివ్ డైరెక్టర్ అనే గుర్తింపు మాత్రం ఆయనకే దక్కింది. మురారి లాంటి ఫ్యామిలీ మూవీ తరువాత కృష్ణవంశీ డైరక్షన్ లో వచ్చిన మూవీ ఖడ్గం. ఎన్నో వివాదాలు, సెన్సార్ కట్స్ తో వార్తల్లో నిలిచి దేశభక్తిని చాటిన ఈ చిత్రానికి నేటితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. 

కృష్ణవంశీ అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్నప్పుడు 1993లో జరిగిన ముంబై పేలుళ్లు ఆయనను చాలా కదిలించాయి. ఇందులో కొన్ని ఇన్సిడెంట్స్ కు ఇన్ స్పైర్ అయిన కృష్ణవంశీ ఖడ్గం స్టోరీని రాసుకున్నారు. గులాబీ, నిన్నేపెళ్ళాడుతా, సింధూరం, అంతఃపురం చిత్రాలతో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాక కృష్ణవంశీకి స్టార్ హీరోల నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ, స్టార్ లతో సినిమాలు చేస్తే కమర్షియల్ గా ఆలోచించాల్సి వస్తుంది. క్రియేటివిటీ దెబ్బ తింటుంది. అంచనాలు చాలా ఉంటాయి. అందుకే మహేష్ బాబును లాంచ్ చేసే ఛాన్స్ ను కూడా కృష్ణవంశీ వదులుకున్నారు. అప్పటికే హీరోలైన శ్రీకాంత్, రవితేజతో ఖడ్గం సినిమాను చేయాలని ఫిక్స్ అయ్యారు. సుంకర మధు మురళి సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారు. స్టోరీలో సత్యానంద్ హెల్ప్ చేయగా, ఉత్తేజ్ డైలాగ్ వెర్షన్ రాశారు. దేవిశ్రీప్రసాద్ ను మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఖడ్గం మూవీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుని విజయం సాధించింది. 

సినిమాలో ప్రతి సీన్ దేశభక్తిగానో, ఎమోషనల్ గానో కదిలిస్తుంది. హిందుత్వం, దేశభక్తి, టెర్రరిస్టుల కార్యకలపాలు మధ్యమధ్యలో సినిమా రంగానికి సంబంధించిన విషయాలను తెరపై చాలా చక్కగా కృష్ణవంశీ తెరకెక్కించారు. మేమే ఇండియన్స్ సాంగ్, బ్రహ్మజీ చనిపోయాక శివాజిరాజా చెప్పే డైలాగ్స్.. ఆ తరువాత ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్, మూడు రంగుల జెండాను కొందరు తగలబెడుతుంటే ముగ్గురు హీరోలు చేసే ఫైట్, క్లైమాక్స్ సీన్ సగటు ప్రేక్షకుడి గుండెల్లో దేశభక్తిని దించేస్తాయి. మేరా భారత్ మహాన్ అని గట్టిగా అరిచేలా చేస్తాయి. ఇప్పటికే ఈ సినిమాను టీవీలో వస్తే వదలకుండా చుస్తారు. అయితే ఈ సినిమా రిలీజ్ టైమ్ లో దర్శకుడు కృష్ణవంశీకి కొన్ని బెదిరింపు కాల్స్ ఎదురుకున్నారని, కొన్ని రోజులు బయటకు రాకుండా దాక్కున్నారని సీతారామశాస్త్రీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.