అమెరికాలో ఉగ్రదాడికి 20 ఏళ్లు

అమెరికాలో ఉగ్రదాడికి 20 ఏళ్లు

అమెరికాలో ఉగ్రదాడికి 20 ఏళ్లు అవుతోంది. 2001 సెప్టెంబర్ 11న పథకం ప్రకారం నాలుగు విమానాలను హైజాక్ చేసిన ఆల్ ఖైదా ఉగ్రవాదులు ప్రముఖ భవనాలపై ఆత్మాహుతి దాడి చేశారు. నాలుగు విమానాలతో ఉగ్రవాదులు జరిపిన దాడిలో  2 వేల 996 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 వేల మంది గాయపడ్డారు. అమెరికా చరిత్రలోనే దీన్ని అతి పెద్ద ఉగ్రదాడిగా చెప్తారు. 

విమానం నడపడంలో శిక్షణ పొందిన 19 మంది ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారు. ఐదుగురు మూడు గ్రూపులుగా, నలుగురు ఒక గ్రూప్ గా విడిపోయారు. 2001 సెప్టెంబర్ 11న మొత్తం నాలుగు విమానాలను హైజాక్  చేశారు. మొదటి ఫ్లైట్  అమెరికన్ ఎయిర్ లైన్స్  తో మాన్ హట్టన్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్  టవర్ ను ఢీకొట్టింది. రెండో యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం వరల్డ్  ట్రేడ్  సెంటర్ సౌత్ టవర్ ను ఢీకొట్టింది.
కేవలం గంటా 42 నిమిషాల్లో 110 అంతస్తుల ట్విన్  టవర్స్  కుప్పకూలిపోయాయి. మంటలు, దట్టమైన పొగ, ఆర్తనాదాలు, రక్షించమని కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.  ప్రాణభయంతో భవనాల మీద నుంచి కిందకు దూకిన దృశ్యాలు కలిచివేశాయి. రెండు విమానాల దాడులతో  రెండు కిలోమీటర్ల మేర భవనాలు సైతం నాశనం అయ్యాయి. దట్టంగా దుమ్ము అలుముకుని ఆ ప్రాంతం అంతా చీకటి అయింది. 

ఉగ్రవాదుల మూడో టీం డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్  నుంచి బయలుదేరిన విమానాన్ని ఓహియో దగ్గర హైజాక్ చేసింది. వర్జీనియా లోని పెంటగాన్ భవనాన్ని ఢీ కొట్టింది. నాలుగో విమానం పెన్సిల్వేనియాలో  క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఇది వైట్ హౌస్ లేదా అమెరికా పార్లమెంట్ భవనం లక్ష్యంగా చేసుకుందని అంచనా వేశారు. మొత్తానికి భద్రతా దళాలు, రక్షణ దళాలు అప్రమత్తం అయ్యేలోపే ఊహించని ఘోరం జరిగిపోయింది. 

మరోవైపు  నెల రోజుల్లోనే ప్రతీకార దాడులు ప్రారంభించింది అమెరికా. 2001 అక్టోబర్ 7న నాటో దళాల సహాయంతో ఉగ్రవాదులు తలదాచుకున్న అఫ్గాన్ సరిహద్దుల్లో దాడులు చేసింది. తాలిబన్లను గద్దె దించింది. హమిద్ కర్జాయ్ ను దేశాధ్యక్షుడిగా నియమించింది. అఫ్గాన్ దేశ పాలన, రక్షణను తన చేతుల్లోకి తీసుకుంది. 20 ఏళ్ల నుంచి ఉగ్రవాదులను ఏరివేస్తూనే పునర్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.  కోట్ల డాలర్లు ఖర్చు చేసి తాలిబన్లు, అల్
ఖైదాపై దాడులు చేసింది. అయితే 20 ఏళ్లలో తీవ్రవాదులను పూర్తిగా అంతం చేయలేకపోయింది.