కరోనా లాక్ డౌన్ సడలింపులో భాగంగా రేపటి (జూన్ 1) నుంచి మరిన్ని రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. ఇప్పటికే మే 12 నుంచి దేశవ్యాప్తంగా 15 రూట్లలో 30 స్పెషల్ ట్రైన్లు నడుపుతోంది రైల్వే శాఖ. అయితే ప్రయాణికుల వెసులుబాటు కోసం 200 రైళ్లను జూన్ 1 నుంచి ప్రారంభిస్తామని గతంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి రైళ్లు స్టార్ట్ అవుతున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం ట్వీట్ చేశారు. అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుని..ట్రైన్లను నడిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
తొలి రోజే లక్షా 45 వేల మంది జర్నీ
రేపటి నుంచి స్టార్ట్ అయ్యే ఈ ట్రైన్లకు ఇప్పటికే రిజర్వేషన్ ప్రారంభించగా.. ఆదివారం ఉదయం 9 గంటల సమయానికే 25,82,671 మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారని రైల్వే శాఖ తెలిపింది. తొలి రోజునే లక్షా 45 వేల మందికి పైగా జర్నీ చేయబోతున్నట్లు వెల్లడించింది.
ప్రయాణం ఇలా..
– అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న వారిని మాత్రమే రైల్వే స్టేషన్ లోపలికి అనుమతిస్తారు.
– ప్రయాణానికి గంటన్నర ముందుగానే స్టేషన్ కు చేరుకోవాలి. స్టేషన్ ఎంట్రీలోనే ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ చేసి.. కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే లోపలికి పంపుతారు.
– ప్రతి ప్యాసింజర్ మాస్కు ధరించడం తప్పనిసరి. స్టేషన్ లోపలికి వచ్చేటప్పుడు, ప్రయాణ సమయంలోనూ సోషల్ డిస్టెన్స్ పాటించాలి.
– రైల్వే స్టేషన్ ఎంట్రీ, ఎగ్జిట్ సమయాల్లో ప్రయాణికులకు రైల్వే శాఖ శానిటైజర్లను అందుబాటులో ఉంచుతుంది.
– ట్రైన్లలో ప్యాంటీకార్ ఉండదు. ప్రస్తుతం రెడీ టూ ఈట్, ప్యాక్డ్ ఫుడ్స్ మాత్రమే లభిస్తాయి. అయితే వీలైనంత వరకు ప్రయాణికులు తమ ఆహారాన్ని, వాటర్ బాటిల్స్ ను ఇంటి నుంచి తెచ్చుకోవడం మేలని రైల్వే శాఖ సూచిస్తోంది. అయితే రైల్వే ప్లాట్ ఫామ్స్, స్టేషన్లలో టేక్ అవే సర్వీసులు ఉంటాయని చెప్పింది.
– ఏసీ కోచ్ లలో ప్రయాణించే వాళ్లకు దుప్పట్లు, టవల్స్ లాంటివి ట్రైన్లలో ఇవ్వడం లేదని, వాటిని ఇంటి నుంచే తెచ్చుకోవాలని చెప్పింది.
– ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
