మహిళా సంఘాలకు 20 వేల కోట్ల లోన్లు : సీతక్క

మహిళా సంఘాలకు 20 వేల కోట్ల లోన్లు : సీతక్క
  •     సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలి: మంత్రి సీతక్క
  •     అన్ని ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తం
  •     మహిళా సంఘాల వార్షిక రుణ ప్రణాళిక రిలీజ్

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలోని 3,56,273 సంఘాలకు రూ. 20,039 కోట్ల లోన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి సీతక్క తెలిపారు.  మహిళా శక్తి పథకం కింద రాబోయే ఐదేండ్లు బ్యాంకుల ద్వారా లక్ష కోట్ల రుణాలు అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మహిళలు బ్యాంకులు ఇచ్చే లోన్లను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. శ‌‌నివారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ లోని ఎంసీహెచ్ఆర్ డీ లో 2024-– 25 ఫైనాన్షియల్ ఇయర్​రుణ ప్రణాళికను మంత్రి సీతక్క విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. 

డిసెంబర్ 2023 నుంచి ఈ ఏడాది మార్చి వరకు వడ్డీలేని రుణాల కింద 2,53,864 మహిళా సంఘాలకు రూ. 264.34  కోట్ల నిధులు అడ్వాన్స్ గావిడుదల చేసినట్టు తెలిపారు. మహిళా సంఘాల సభ్యులకు రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా, రూ.2 లక్షల వరకు అప్పు బీమా కల్పిస్తున్నామని, త్వరలో ఈ రెండు స్కీమ్ లు స్టార్ట్ చేస్తామని సీతక్క వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల స్కూల్ యూనిఫామ్స్ కుట్టే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారని చెప్పారు. 

దీంతో మహిళా సంఘాలకు రూ.50 కోట్లు అదనపు ఆదాయం వచ్చిందని తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, త్వరలో సెక్రటేరియట్, కలెక్టరేట్లు, అన్ని ప్రధాన కార్యాలయాలు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, ఇండస్ట్రియల్​ఏరియాల్లో దశలవారీగా వీటిని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈ రూ.20 వేల కోట్లకు అదనంగా ప్రతి సంఘానికి రూ.2,25,000,  వివిధ జీవనోపాధి కార్యక్రమాలకు రూ. 4,500 కోట్లు బ్యాంకుల నుంచి అందిస్తామని తెలిపారు.  

మహిళలకు మెరుగైన జీవనోపాధి

గ్రామీణ మహిళలకు వ్యవసాయ అనుబంధ పాడి, కోళ్ల పరిశ్రమ, ఇతర వృత్తుల్లో తగిన శిక్షణ కల్పించి మెరుగైన జీవనోపాధి పొందేందుకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ, రూ.500 కే సిలిండర్,  గృహలక్ష్మి స్కీమ్​లో భాగంగా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. త్వరలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లతోపాటు ఇంటి స్థలం అందిస్తామని, మహాలక్ష్మి స్కీమ్ కింద అర్హులైన మహిళలకు రూ.2,500 ఇస్తామని వెల్లడించారు. మహిళా సంఘాల విషయంలో బ్యాంకులు ప్రభుత్వం చెప్పిన లోన్లు ఇవ్వాలని, ఇంకా ఎక్కువ ఇవ్వాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ కమిషనర్ అనితా రాంచంద్రన్, నాబార్డు సీజీఎం సుశీల, ఆర్బీఐ, ఎస్ బీఐ అధికారులతో పాటు వివిధ జిల్లాల నుంచి మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.