అదంతా ఒక కుట్ర.. ధోని కావాలనే రనౌటయ్యాడు: యువరాజ్ తండ్రి

అదంతా ఒక కుట్ర.. ధోని కావాలనే రనౌటయ్యాడు: యువరాజ్ తండ్రి

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ విరుచుకుపడ్డారు. ధోని ఓ స్వార్థపరుడని.. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో టీమిండియా ఓటమికి ధోనీనే కారణమని ఆరోపించారు. అంతేకాదు కోహ్లీ కెప్టెన్సీ‌లో టీమిండియా వరల్డ్ కప్ గెలవకూడదన్న ఉద్దేశ్యంతో కావాలనే కుట్ర చేశాడని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. 

'ఆ సంఘటనను తలుచుకుంటే నా రక్తం  ఇప్పటికీ మరుగుతోంది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ధోనీ కావాలనే సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. భారత్ తరఫున మరో కెప్టెన్ ప్రపంచకప్ గెలవడం అతనికి ఇష్టం లేదు. అందువల్లే ఓవైపు రవీంద్ర జడేజా గెలవాలని ఆడుతున్నా.. అతనికి సహకరించలేదు. జిడ్డు బ్యాటింగ్‌తో అతనిపై ఒత్తిడిపెంచి ఔటయ్యేలా చేశాడు. చివరలో కావాలనే రనౌటయ్యాడు. అతనిలో గెలవాలన్నా కసివుండుంటే.. భారత జట్టు 48వ ఓవర్‌లోనే విజయం సాధించేది..' అని యువరాజ్ తండ్రి చెప్పుకొచ్చారు. విరాట్ కోసం.. ఈ వీడియోను ప్రతి ఒక్క అభిమాని చూడాలని ఆయన అభ్యర్థించారు.

ఆరోజు ఏం జరిగింది..?

2019 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టుకు విరాట్ కోహ్లీ సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా లీగ్ దశలో తొమ్మిది మ్యాచుల్లో ఏడింట గెలిచి టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. ఇంకేముంది మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్రపంచకప్‌ సొంతమైనట్లే అని అందరూ అనుకున్నారు. అలాంటి సమయంలో భారత జట్టుకు న్యూజిలాండ్ రూపంలో అనుకోని శత్రువు ఎదురయ్యాడు.

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. అనంతరం 240 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి భారత జట్టు పరిస్థితి.. మ్యాచ్‌ ప్రారంభమైన 10 నిమిషాల్లోనే తలకిందులైంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ తలా ఒక పరుగు చేసి పెవిలియన్‌ చేరిపోయారు. దీంతో భారత్‌ 5/3తో కష్టాల్లో పడింది. ఆపై వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ (6), రిషబ్‌ పంత్‌ (32), హార్దిక్‌ పాండ్యా (32) కూడా విఫలమవడంతో టీమిండియా 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది.

అక్కడి నుంచి రవీంద్ర జడేజా (59 బంతుల్లో 77), మహేంద్రసింగ్‌ ధోనీ (72 బంతుల్లో 50) జోడి విజయం కోసం వీరోచితంగా పోరాడారు. ధోనీ నెమ్మదిగా ఆడినా.. జడ్డూ ధనాధన్ బ్యాటింగ్ తో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడు. చివరలో విజయానికి 3 ఓవర్లలో 37 పరుగులు కావాల్సి ఉన్నప్పుడు భారీ షాట్‌కు యత్నించి జడేజా పెవిలియన్‌ చేరతాడు.  అనంతరం విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు కావాల్సిన సమయంలో ధోనీ రనౌట్ అవుతాడు. మార్టిన్ గప్టిల్ విసిరిన త్రో నేరుగా వికెట్లకు తాకడంతో మ్యాచ్ ఫలితం ఒక్కసారిగా మారిపోయింది. 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.