2021 మన స్టార్టప్​లకు బాగా కలిసొచ్చింది

2021 మన స్టార్టప్​లకు బాగా కలిసొచ్చింది
  • వెంచర్​క్యాపిటల్​, ప్రైవేట్​ ఈక్విటీల నుంచి ఏకంగా 36 బిలియన్​ డాలర్ల పెట్టుబడులు
  • 2020తో పోలిస్తే ఈ ఏడాది మూడు రెట్లు ఎక్కువ
  • టెక్​ కంపెనీల ఐపీఓలు ఉత్సాహం నింపాయ్​
  • వచ్చే ఏడాదిలోనూ జోరు కంటిన్యూ

2021 మన స్టార్టప్​లకు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది మును పెన్నడూ లేనంతగా పెట్టుబడులు మన దేశంలోని స్టార్టప్​లకు దొరికాయి. అంతేకాదు కొత్త రికార్డులు నెలకొల్పాయి. మన దేశంలోని ప్రైవేటు కంపెనీలు (స్టార్టప్​లు) ఏకంగా 36 బిలియన్​ డాలర్ల పెట్టుబడులు తెచ్చుకున్నాయి. డిజిటైజేషన్​ ఊపందుకోవడంతో పెట్టుబడులు బాగా పెరిగినట్లు యూకే ఇన్వెస్ట్​మెంట్​ డేటా ప్లాట్​ఫామ్​ ప్రెకిన్​ అంచనా వేస్తోంది. గత ఏడాది కాలంగా స్టార్టప్​లలో వెంచర్​ క్యాపిటల్​, ప్రైవేట్​ ఈక్విటీ పెట్టుబడులు మూడు రెట్లు పెరిగినట్లు ఆ కంపెనీ డేటా వెల్లడిస్తోంది. అంతకు ముందు ఏడాది అంటే 2020లో ఇలా వచ్చిన పెట్టుబడులు 11 బిలియన్​ డాలర్లే. 

హైదరాబాద్​, వెలుగు: 2021లో సీడ్​ స్టేజ్​లో ఉన్న స్టార్టప్​లలోనే ఎక్కువ డీల్స్​ జరిగాయి. ఈ సెగ్మెంట్లో ఏకంగా 705.86 మిలియన్​ డాలర్ల విలువైన 396 డీల్స్​ జరిగాయి. ఇక సిరీస్​ ఏ ఫండింగ్​ చూస్తే 166 డీల్స్​లో 1.67 బిలియన్​ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఎక్కువ మొత్తంలో ఫండ్స్​ను మాత్రం ప్రీ ఐపీఓ రౌండ్స్​లోని కంపెనీలే చేజిక్కించుకున్నాయి. జొమాటో, ఓలా, పాలసీబజార్​, పేటీఎం వంటి 10 డీల్స్​లో దేశంలోకి 5.58 బిలియన్​ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రెకిన్​ డేటా చెబుతోంది. గత ఏడాది కాలంగా డీల్స్​ పెరగడమే కాకుండా, మన స్టార్టప్​ కంపెనీలు డబ్బు సేకరణ కోసం ఎక్కువ రౌండ్స్​ కూడా చేయగలిగాయి. రిస్క్​ ఎక్కువగా తీసుకోవాలనే ఆలోచన పెరగడం వల్ల మన స్టార్టప్​లలో విదేశీ వెంచర్​ క్యాపిటల్​ కంపెనీలు, ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలూ ఎక్కువ పెట్టుబడులను పెట్టాయి.   స్టార్టప్స్​ వాల్యుయేషన్స్​ కూడా అలాగే జోరందుకున్నాయి.  గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి వాల్యూ వస్తోందనే అంచనాలు పెరగడం వల్లే ఈ ఏడాది మన స్టార్టప్స్​వాల్యుయేషన్​ పెరిగింది. జొమాటో, నైకా, పాలసీబజార్​ వంటివి ఐపీఓలకి రావడంతో గతంలోని ఇన్వెస్టర్లకు మంచి లాభాలు వచ్చాయి. దీంతో వాల్యుయేషన్స్​ ఊపందుకున్నాయని స్టెలారిస్​ వెంచర్​ పార్ట్​నర్స్​ ఫౌండర్​ అలోక్​ గోయల్​ చెప్పారు. బుల్​, బేర్​ సైకిల్స్​లో సాధారణంగానే మార్కెట్లు కొంత ఎక్కువగా రియాక్ట్​ అవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మనం బుల్​ సైకిల్​ రియాక్షన్​ చూస్తున్నామని, భవిష్యత్​లో బేరిష్​ కరెక్షన్​ వచ్చినా ఆశ్చర్యపోనని అన్నారు. 2021లోని జోరు కొనసాగకపోవచ్చని అలోక్​ గోయల్​ చెప్పారు. 
టైగర్​ గ్లోబల్​, ఫాల్కన్​ ఎడ్జ్​, సెకోవియా క్యాపిటల్​, యాక్సెల్​, బ్లూమ్​ వెంచ్స్​ వంటి పెద్ద ఇన్వెస్టర్లు ఈ ఏడాది మన మార్కెట్లో చురుగ్గా ఉన్నారు. పెద్ద పెట్టుబడులు పెడుతుందనే పేరున్న సాఫ్ట్​ బ్యాంక్​ 2021లో మన స్టార్టప్​లలో 3 బిలియన్​ డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. ఒక ఏడాదిలో ఈ కంపెనీ మన దేశంలో  ఇంత మొత్తంలో పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది మన దేశంలోని యూనికార్న్​ల సంఖ్య కూడా డజన్ల కొద్దీ పెరిగింది. బిలియన్​ డాలర్ల వాల్యుయేషన్​ దాటితే ఆ స్టార్టప్​లను యూనికార్న్​గా చెబుతారు. మన దేశం నుంచి  ఏకంగా 40 కంపెనీలు యూనికార్న్​ క్లబ్​లో చేరాయి. ఏప్రిల్​ నెలలో నాలుగు రోజుల తేడాలో ఆరు కంపెనీలు ఈ క్లబ్​లో చేరడం విశేషం. ఈ యూనికార్న్​లే కాకుండా, హైగ్రోత్​ స్టేజ్​లో ఉన్న చాలా కంపెనీలూ ఈ ఏడాది చాలా రౌండ్లలో డబ్బులు భారీగా సమీకరించాయి. ఫిన్​టెక్​ స్టార్టప్​ క్రెడ్​, ఆఫ్​బిజినెస్​, గ్రో, కార్స్​24, లిషియస్​, స్పిన్నీ, ఇన్​ఫ్రా.మార్కెట్​, గుడ్​ గ్లామ్​ గ్రూప్​, ప్రిస్టిన్​ కేర్​ వంటి స్టార్టప్​ల వాల్యుయేషన్స్​ గత ఏడాది కాలంగా భారీగా పెరిగాయి.
మన మార్కెట్ల డెప్త్​ పెరగడంతో మెరుగైన ఫౌండింగ్​ టీమ్స్​ స్టార్టప్స్​తో ముందుకొస్తున్నాయని, ఐపీఓల ద్వారా ఎగ్జిట్​ కూడా బాగుండటంతో 2021 మన కంపెనీలకు బాగా కలిసొచ్చిందని లైట్​స్పీడ్​ ఇండియా పార్ట్​నర్​ వైభవ్​ అగర్వాల్ వెల్లడించారు. ఈ ఏడాది యూనికార్న్​లుగా మారిన షేర్ చాట్​, అప్నా కో వంటి స్టార్టప్​లలో లైట్​స్పీడ్​ పెట్టుబడులు పెట్టింది. మార్కెట్​ అనుకూలంగా ఉన్నప్పుడు డబ్బు సమీకరించి పెట్టుకుంటే, ఆ తర్వాత  దీనిని వాడుకోవచ్చని యూనికార్న్​ ఫౌండర్లు ఆలోచించారు.
స్ట్రాటజీల అమలులో బిజీ
కావల్సినంత డబ్బు వచ్చి పడటంతో తమ బిజినెస్​ స్ట్రాటజీలు అమలు చేసి, మార్కెట్లో దూసుకెళ్లే బిజీలో ఉన్నాయి స్టార్టప్​ కంపెనీలు.  విదేశాలకు సైతం విస్తరించే ప్రయత్నాలలో మునిగిపోయాయి. క్రిప్టో, సాస్​, డైరెక్ట్​ టూ కన్జూమర్​, ఫిన్​టెక్​, బిజినెస్​ టూ బిజినెస్​, ఎడ్​టెక్​, హెల్త్​కేర్​ వంటి సెక్టార్లు 2021లో  ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాదిలో కూడా ఈ సెక్టార్ల జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. బ్యాలెన్స్​ షీట్లను పటిష్టం చేసుకుని, మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు వచ్చినా తట్టుకోవడానికి ముందుగానే ఫండ్స్​ సేకరించి మన స్టార్టప్ ల ఫౌండర్లు రెడీ అవుతున్నారని 3వన్​4 కాపిటల్​ కో ఫౌండర్​ ప్రణవ్​ పాయ్​ చెప్పారు. కొన్నేళ్ల కిందట స్టార్టప్​ ఎంట్రప్రెనూర్లు ఐపీఓల గురించి మాట్లాడితే, పెద్దగా ఇన్వెస్టర్లకు ఎక్కేది కాదు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.   చాలా టెక్నాలజీ కంపెనీలు ఐపీఓలను సక్సెస్​ఫుల్​గా కంప్లీట్​ చేశాయి. నజారా వంటి చిన్న గేమింగ్​ స్టార్టప్​ కూడా ఈ ఏడాది ఐపీఓ పూర్తి చేయగలగడంతోపాటు, జొమాటో ఐపీఓకి ఆదరణ దొరకడంతో కనీసం ఆరు టాప్​ లీగ్​ స్టార్టప్​లు ఐపీఓలకి రావడానికి స్టేజ్​ సెట్​ అయ్యింది. దీంతో చాలా స్టార్టప్​ల ఫౌండర్లు 2022 లేదా 2023లో ఐపీఓలకి రావాలని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. పాలసీబజార్​, నైకా, పేటీఎం వంటి కంపెనీలు పబ్లిక్​ ఇష్యూల ద్వారా 2.5 బిలియన్​ డాలర్లను సమీకరించాయి. వచ్చే ఏడాదిలోనూ స్టార్టప్​ల ఐపీఓ జోరు కొనసాగుతుందనే ఆశాభావాన్ని లైట్​ స్పీడ్​పార్ట్​నర్​ అగర్వాల్​ వ్యక్తం చేస్తున్నారు.