ఇందిరమ్మ ఇండ్లు జోరుగా.. వేగంగా నిర్మాణాలు పూర్తి చేయిస్తున్న సర్కార్

ఇందిరమ్మ ఇండ్లు జోరుగా.. వేగంగా నిర్మాణాలు పూర్తి చేయిస్తున్న సర్కార్
  • స్కీమ్ అమలుపై స్పెషల్ ఫోకస్
  • గ్రీన్‌చానల్ ద్వారా నిధులు విడుదల
  • ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ
  • పనుల ప్రారంభానికి నిధుల్లేకపోతే లబ్ధిదారులకు మహిళా సంఘాల నుంచి లోన్లు   
  • గ్రూప్‌ 1 ఆఫీసర్లకు స్కీమ్ అమలు బాధ్యతలు 
  • పర్యవేక్షిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు 
  • అన్ని జిల్లాల్లో స్పీడ్ అందుకున్న నిర్మాణాలు

యాదాద్రి జిల్లా సైదాపురం గ్రామానికి చెందిన ఎగ్గిడి స్వప్న, బాలమల్లేశ్ ప్రభుత్వం ఇచ్చిన రూ.5 లక్షలతో ఇటీవల ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ​బీర్ల అయిలయ్య, జిల్లా ఇన్‌ చార్జ్‌ మంత్రి అడ్లూరి లక్ష్మణ్​బుధవారం గృహప్రవేశం చేయించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గృహప్రవేశం రోజు  గొర్రె పొట్టేలు, పట్టుబట్టలు అందిస్తానని గతంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారుడికి గొర్రె పొట్టేలు, పట్టుబట్టలను అందించారు.  

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​ జోరందుకుంది. ఇప్పటి వరకు రెండు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇండ్లను మంజూరు చేయగా.. వీటిలో సగానికి పైగా ఇండ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. 1,300కు పైగా ఇండ్లు దాదాపు ​పూర్తయ్యే దశలో ఉండగా.. పలువురు లబ్ధిదారులు గృహప్రవేశం కూడా చేస్తున్నారు. మొత్తం 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్.. నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నది. ఈ స్కీమ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేస్తున్నది. 

సీఎం రేవంత్ రెడ్డి​ సహా హౌసింగ్ మినిస్టర్​ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, జిల్లాల్లో ఇన్‌చార్జ్‌ మంత్రులు ఇందిరమ్మ ఇండ్లపై నిరంతరం రివ్యూలు నిర్వహిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇండ్ల నిర్మాణం ప్రారంభించేందుకు డబ్బుల్లేని లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా సర్కారే లోన్లు ఇప్పిస్తున్నది. 

ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేకొద్దీ దశల వారీగా ఆర్థిక సాయం అందిస్తున్నది. ఇందుకోసం గ్రీన్​చానల్ ద్వారా నిధులు విడుదల చేస్తూ.. ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నది. 

పకడ్బందీగా అమలు.. 

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన డబుల్​బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్ ఇండ్ల పథకం లోపాలను దృష్టిలో ఉంచుకొని ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పకడ్బందీగా అమలు చేస్తున్నది. తొలి దశలో సొంతంగా ఇంటి జాగా ఉండి, పక్కా ఇల్లు లేని పేదలను మాత్రమే ఎంపిక చేసింది. 

కేవలం 400 నుంచి 600 చదరపు అడుగుల్లో మాత్రమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలనే నిబంధన పెట్టడం ద్వారా కేవలం పేదలకు మాత్రమే ఇండ్లు దక్కేలా చూస్తున్నది. ఎక్కడైనా అనర్హులను ఎంపిక చేసినట్లు తేలితే రీవెరిఫికేషన్​ చేయించి మరీ పక్కనపెట్టిస్తున్నది. మొదటి, రెండు విడతల్లో నియోజకవర్గానికి  3,500 చొప్పున మొత్తం 3 లక్షల ఇండ్లను మంజూరు చేయగా.. వాటిని స్పీడప్​ చేయడంపై సర్కార్ ఫోకస్​ పెట్టింది. 

స్వయంగా మంత్రుల పర్యవేక్షణ..   

హౌసింగ్ ​మినిస్టర్​ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డితో పాటు జిల్లాల్లో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్ మంత్రులు, కలెక్టర్లు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలైతే తమ జిల్లా పర్యటనల్లో ఇందిరమ్మ ఇండ్ల సందర్శన ఉండేలా చూసుకుంటున్నారు. 

ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్ మంత్రుల రివ్యూ మీటింగుల్లో ఇందిరమ్మ ఇండ్ల అంశం ప్రధానంగా ఉంటోంది. ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయి? ఆయా ఇండ్లు ఏయే దశల్లో ఉన్నాయి? ఇంకా ఎన్ని ఫండ్స్​ కావాలి? అనే వివరాలు అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ నిధులు విడుదలయ్యేలా చూస్తున్నారు. త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తిచేసేలా లబ్ధిదారులను అటు ప్రజాప్రతినిధులతో పాటు ఇటు అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ర్టవ్యాప్తంగా సుమారు 1,350 ఇండ్లు స్లాబ్ వరకు పూర్తయి ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యాయి. కొన్ని ఇండ్లు ఇప్పటికే పూర్తవ్వగా, లబ్ధిదారులు గృహప్రవేశం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుండగా, ఈ నెలాఖరు నుంచి (శ్రావణ మాసం) మంచి రోజులు మొదలుకానున్నాయి. 

ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులో ఒకే గ్రామంలో 20 నుంచి 25 ఇండ్లను సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు హౌసింగ్ మినిస్టర్​పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా అన్ని జిల్లాల్లో నియోజకవర్గానికి కనీసం ఒక గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను ఆయా జిల్లాల మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. వచ్చే రెండు నెలలు వర్షాలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు ఈ నెలాఖరు వరకు స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

నిధులకు కొరత లేకుండా.. 

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నిధుల కొరత రాకుం డా ప్రభుత్వం పకడ్బందీగా ముందుకుపోతున్నది. ఇందులో భాగంగా గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చానల్ ద్వారా కేటాయింపులు చేస్తున్నది. బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, గోడలు, స్లాబ్, ఇంటి నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులకు ఆయా దశలను బట్టి ప్రతి సోమవారం వారి బ్యాంక్ ఖాతాల్లో నిధులను జమ చేస్తున్నది. ఇప్పటి వరకు 16,563 మంది  లబ్ధిదారులకు రూ.173.98 కోట్లు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. 

అదే సమయంలో ఇండ్ల నిర్మాణం ప్రారంభించేందుకు చేతిలో పైసలు లేని వారికి మహిళా సంఘాల నుంచి రూ.లక్ష లోన్ ఇప్పిస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో కలెక్టర్లు, ఎంపీడీవోలు మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహించి వారిని ఒప్పిస్తున్నారు. బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పూర్తి చేసిన తరువాత ప్రభుత్వం ఇచ్చే రూ.లక్షను మహిళా సంఘాలకు లబ్ధిదారులు తిరిగి చెల్లిస్తున్నారు. 

గ్రూప్ 1 ఆఫీసర్లకు బాధ్యతలు.. 

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా.. దీని అమలు బాధ్యతను గ్రూప్ 1 ఆఫీసర్లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీళ్లు కలెక్టర్లకు సమన్వయ కర్తలుగా పనిచేస్తారు. గ్రూప్ 1 ఆఫీసర్లను డిప్యూటేషన్ ప్రాతిపదికన కేటాయించాలని హౌసింగ్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనలకు రెవెన్యూ శాఖ ఇప్పటికే అంగీకారం తెలిపింది.  ఇందులో భాగంగా ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లను రెవెన్యూ శాఖ నుంచి రిలీవ్ చేసి చేస్తూ ఆ శాఖ సెక్రటరీ లోకేశ్ కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 

వీరిని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లుగా నియమించనున్నారు. ప్రస్తుతం జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ ( పీడీ)గా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( డీఈఈ) పని చేస్తున్నారు. సాధారణంగా పీడీ పోస్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) క్యాడర్ పోస్టు కాగా, హౌసింగ్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేవలం ఆరుగురు మాత్రమే ఎస్ఈలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో 33 జిల్లాలకు గ్రూప్ 1 ఆఫీసర్లు అంటే డిప్యూటీ కలెక్టర్లు లేదా ఆర్డీవోలను ప్రభుత్వం నియమిస్తున్నది. 

మరోవైపు ఇందిరమ్మ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్పీడప్​చేసేందుకు పంచాయతీ రాజ్ శాఖ నుంచి 79 మంది సీనియర్ అసిస్టెంట్లను, 17 మంది జూనియర్ అసిస్టెంట్లను కేటాయించాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ ఇటీవల లేఖ రాశారు. ఈ ప్రపోజల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అంగీకరించిన పంచాయతీ రాజ్ డైరెక్టర్ శ్రీజన.. సిబ్బందిని కేటాయించాలని జిల్లా పరిషత్ సీఈవోలను ఆదేశించారు. హౌసింగ్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 110 సీనియర్, జూనియర్ అసిస్టెంట్ సాంక్షన్ పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 14 మంది మాత్రమే పనిచేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే తాజా డిప్యూటేషన్లు చేసినట్లు తెలుస్తోంది.