బడ్జెట్​లో విద్యా రంగానికి రూ.1.12 లక్షల కోట్లు కేటాయింపు

బడ్జెట్​లో విద్యా రంగానికి రూ.1.12 లక్షల కోట్లు కేటాయింపు

మూడు ఐఐటీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ఎక్సలెన్స్ సెంట్లరు
బడ్జెట్​లో రూ.1.12 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం
యాప్స్ అభివృద్ధికి వంద 5జీ ఫెసిలిటీ ల్యాబ్స్​
కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలు 

న్యూఢిల్లీ, వెలుగు:  కేంద్ర ప్రభుత్వం చదువులకు గతంలో ఎప్పుడూ ఇవ్వనన్ని నిధులు ఈ సారి బడ్జెట్​లో కేటాయించింది. అలాగే మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాప్స్​డెవలప్​మెంట్, ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మా రీసెర్చ్​లు, ఉపాధి అవకాశాలు కల్పించే కొత్తతరం కోర్సులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. కేంద్రం 2023–24 బడ్జెట్​లో విద్యా రంగానికి రూ. 1,12,898.97 కోట్లు కేటాయించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈసారి ఇది రూ.8,621 కోట్లు ఎక్కువ. ఇందులో స్కూల్ ఎడ్యూకేషన్​కు రూ.68,804.85 కోట్లు, ఉన్నత విద్యకు రూ.44,094.62 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటితోపాటు కేంద్రం సమగ్ర శిక్షకు రూ.37,453.47 కోట్లు, పీఎం పోషణ్‌‌‌‌కు రూ.11,600 కోట్లు అలాట్​చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో విద్యకు రూ.1,04,278 కోట్లు అలాట్ చేయగా.. సవరించిన అంచనాల ప్రకారం ఉన్నత విద్యకు రూ.40828.35 కోట్లు, స్కూల్ ఎడ్యూకేషన్​కు రూ.59052.78 కోట్లు ఖర్చు చేశారు.

వజ్రాల తయారీ టెక్నాలజీపై ఐఐటీతో రీసెర్చ్ 

“మేక్ ఏ-ఐ ఇన్ ఇండియా, మేక్ ఏ-ఐ వర్క్ ఫర్ ఇండియా” అనే విజన్‌‌‌‌ను సాకారం చేయడం కోసం దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కోసం మూడు ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు  నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే యాప్స్ అభివృద్ధి చేసేందుకు ఇంజినీరింగ్ ఇన్​స్టిట్యూట్లలో 5జీ సర్వీస్ ఫెసిలిటీ కలిగిన 100 ల్యాబ్‌‌‌‌లు పెట్టనున్నారు. ఈ ఎక్స్​లెన్స్ సెంటర్లు, 5జీ సర్వీస్ ల్యాబ్‌‌‌‌లు వ్యవసాయం, ఆరోగ్యం, స్మార్ట్​సిటీలు, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ సిస్టమ్స్ తదితర రంగాలలో సమస్యల పరిష్కారంపై పరిశోధనతోపాటు, యాప్స్ డెవలప్ చేస్తాయని పేర్కొన్నారు. ఈ పరిశోధన కార్యకలాపాల్లో దేశంలోని ప్రముఖ ప్రైవేటు ఇండస్ట్రీస్ కు కూడా భాగస్వామ్యం కల్పించనున్నట్లు తెలిపారు. దేశీయంగా వజ్రాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ల్యాబ్ లో వాటిని తయారు చేసే టెక్నాలజీ డెవలప్​చేయడం కోసం పరిశోధనలు జరిపేందుకు ఐఐటీలలో ఒకదానికి ఐదేళ్లపాటు ​గ్రాంట్ అందిస్తామన్నారు.

ఎన్ఈపీతో యువతకు స్కిల్స్​

యువతకు ఎంప్లాయ్​మెంట్ స్కిల్స్​అందించడానికి, ఉద్యోగాల కల్పనలో సాయం చేయడానికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ –2020 రూపొందించినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. వచ్చే మూడేళ్లలో లక్షల మంది యువత స్కిల్స్​సాధించేందుకు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగ శిక్షణ, ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా కోర్సులను డిజైన్​ చేయనున్నట్టు వివరించారు. కోడింగ్, ఏఐ, రోబోటిక్స్, మెకాట్రానిక్స్, ఐవోటీ, 3డీ ప్రింటింగ్, డ్రోన్స్, సాఫ్ట్ స్కిల్స్ వంటి కొత్త-తరం కోర్సులు ఇందులో కవర్ చేయనున్నట్లు తెలిపారు. 

పిల్లల కోసం గ్రామాల్లో డిజిటల్​ లైబ్రరీలు
పిల్లలు, యువత కోసం డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తామని నిర్మల తెలిపారు. జాగ్రఫీ, భాషలు, కళా ప్రక్రియలు తదితర అంశాల్లో నాణ్యమైన పాఠాలు, పుస్తకాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాలు పంచాయతీ, వార్డు స్థాయిలలో లైబ్రరీలు ఏర్పాటు చేసేందుకు, నేషనల్ డిజిటల్ లైబ్రరీ రిసోర్స్ యాక్సెస్ చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. ఇది పిల్లలలో చదువుపై ఇష్టాన్ని పెంచుతుందని.. ఉద్యోగ మార్కెట్‌‌‌‌కు తగిన స్కిల్స్​తో యువత ప్రిపేర్ అయ్యే పరిస్థితులను సృష్టిస్తుందని చెప్పారు. కరోనా మహమ్మారి,  లాక్​డౌన్ టైమ్​లో స్టూడెంట్లు నష్టపోయిన దాన్ని ఇది భర్తీ చేస్తుందని అన్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్, చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్  లైబ్రరీలకు ప్రాతీయ, స్థానిక భాషలతో పాటు ఇంగ్లిష్ లో పుస్తకాలను అందజేయనున్నట్లు తెలిపారు.

740 ఏకలవ్య స్కూల్స్.. 38 వేల టీచర్​పోస్టులు 
కొత్తగా 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వీటి ద్వారా 3లక్షల 50వేల మంది స్టూడెంట్లకు చదువు చెప్పనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 38,800 మంది టీచర్లను నియమించనున్నట్లు చెప్పారు. అలాగే కొత్తకొత్త పద్ధతుల్లో బోధించడం, ఇన్​ఫర్మేషన్​అండ్​ కమ్యూనికేషన్​ టెక్నాలజీ అమలు, పాఠ్యాంశాల నిర్వహణపై టీచర్లకు ట్రైనింగ్​ఇచ్చేందుకు, నిరంతరమైన ప్రొఫెషనల్​డెవలప్​మెంట్ పై డీపీస్టిక్ సర్వేలు చేసేందుకు ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.