ప్రముఖుల ఇలాకాల్లో ఎలక్షన్ వార్.. ఎవరెవరు తలపడుతున్నారంటే..?

ప్రముఖుల ఇలాకాల్లో ఎలక్షన్ వార్.. ఎవరెవరు తలపడుతున్నారంటే..?

ఈసారి తెలంగాణ ఎలక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్​ మారాయి. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మూడోసారి హ్యాట్రిక్ పై కన్నేసిన అధికార పార్టీ బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇటు బీఆర్ఎస్ ను గద్దె దించేందుకు కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందుకోసం బలమైన అభ్యర్థులను రంగంలోకి దించుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులను ఎదుర్కొనేందుకు గట్టి ప్రత్యర్థులను బరిలో నిలుపుతున్నాయి. 

తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ విడుదల చేసింది. మొత్తం 55 మందితో ఈ జాబితాను ప్రకటించింది. వామపక్షాలతో పొత్తుపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఎలక్షన్‌ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు మధ్య గట్టి పోటీ నెలకొంది. అసలు ఎవరెవరు ఏయే స్థానాల్లో పోటీ చేస్తున్నారో ఒకసారి చూద్దాం.  

మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు దక్కాయి. సిట్టింగ్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ హుజూర్‌ నగర్‌ నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన సతీమణి పద్మావతి రెడ్డికి కోదాడ టికెట్‌ కేటాయించారు. కొడంగల్‌ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేయనున్నారు. పొత్తుల్లో భాగంగా వామపక్షాలు భద్రాచలం టికెట్‌ను డిమాండ్‌ చేసినప్పటికీ.. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకే మళ్లీ ఆ స్థానం కేటాయించారు. 

ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉన్నారంటే..? 

* కొడంగల్‌ నుంచి కాంగ్రెస్ తరపున తెలంగాణ పీసీసీ చీఫ్​ రేవంత్‌ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ స్థానం నుంచి ఈసారి అత్యధిక మెజార్టీతో గెలవాలని రేవంత్​ పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో మంత్రి పట్నం మహేందర్​ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్​ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈసారి కూడా ఈ ఇద్దరు పోటీ పడుతున్నారు. ఈ స్థానంలో గెలిచేందుకు బీజేపీ చాలా సీరియస్ గా కసరత్తు చేస్తోంది. 

* మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరపున మైనంపల్లి హన్మంతరావు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ తరపున మాత్రం ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. అయితే.. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ స్థానం మైనంపల్లికి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. అంతేకాదు.. పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి ఎలాగైనా ఓడించాలని బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది.

* మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్​ రావు బరిలో ఉన్నారు. ఈయన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే హనుమంతరావు కుమారుడు. మెదక్ నుంచి బీఆర్ఎస్​ తరపున ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ నియోజకర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ తమ కుమారుడికి ఇవ్వకపోడంతో ఎమ్మెల్యే హనుమంతరావు పార్టీని వీడి.. కాంగ్రెస్​ లో చేరారు. కాంగ్రెస్ నుంచి కుమారుడికి టికెట్ దక్కించుకున్నారు. 

* గజ్వేల్‌ నుంచి కాంగ్రెస్​ తరపున తూముకుంట నర్సారెడ్డి బరిలో ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్నారు. ఈసారి కేసీఆర్ రెండు స్థానాల నుంచి బరిలో దిగుతున్నారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ పడుతున్నారు. అయితే... గజ్వేల్ లో కేసీఆర్ పై నర్సారెడ్డి గెలుస్తారా..? లేదా అనేది చూడాలి. 

* కోదాడ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీ ఉత్తమ్​ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ తరపున బొల్లం మల్లయ్య యాదవ్ ఉన్నారు. రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా గెలవాలని బొల్లం ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో పద్మావతిపై ఎమ్మెల్యేగా గెలిచారు మల్లయ్య యాదవ్. ఈ స్థానం ఉత్తమ్ ఫ్యామిలీకి చాలా కీలకంగా మారింది. అధిష్టానాన్ని ఒప్పించి మరి ఒకే కుటుంబంలో రెండు టికెట్లు తెచ్చుకున్నారు ఉత్తమ్. 

* నల్గొండ నుంచి కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున కంచర్ల భూపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 

* నకిరేకల్‌ (ఎస్సీ) నుంచి కాంగ్రెస్ తరపున వేముల వీరేశం బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన వేములపై ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో ప్రాధాన్యత తగ్గడంతో వేముల ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. టికెట్ తెచ్చుకుని నకిరేకల్ నుంచి బరిలోకి దిగారు.

* ములుగు (ఎస్టీ) నుంచి కాంగ్రెస్ తరపున సీతక్క ఉన్నారు. బీఆర్ఎస్ తరపున మాత్రం బడే నాగజ్యోతి ఉన్నారు. ఈమె ప్రస్తుతం జిల్లా పరిషత్​ చైర్ పర్సన్​ గానూ కొనసాగుతున్నారు. మావోయిస్టు పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకర్ కుమార్తెనే బడే నాగజ్యోతి. ఈసారి సీతక్కను ఓడించేందుకు బీఆర్ఎస్ పార్టీ పట్టుదలతో ఉంది. ఈ స్థానాన్ని చాలా కీలకంగా తీసుకుంది. నాగజ్యోతిని గెలిపించేందుకు మంత్రులు కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. 

* మధిర (ఎస్సీ) నుంచి కాంగ్రెస్ తరపున మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. బీఆర్ఎస్​ నుంచి లింగాల కమల్​ రాజు ఉన్నారు. 

* హుజుర్ నగర్​ నుంచి కాంగ్రెస్ తరపున ఉత్తమ్​ కుమార్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఈయన ఎంపీగా ఉన్నారు. బీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో వీరిద్దరూ తలపడ్డారు. ఉత్తమ్ పై సైదిరెడ్డి గెలిచారు. 


*  నిర్మల్​ నుంచి కాంగ్రెస్​ తరపున శ్రీహరిరావు ఉన్నారు. ఇదే స్థానం బీఆర్ఎస్ తరపున మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి ఉన్నారు. వీరిద్దరి మధ్య ఈసారి టఫ్​ ఫైట్​ నెలకొంది.

* జగిత్యాల నుంచి కాంగ్రెస్ తరపున ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్​ తరపున ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నారు. రెండోసారి అదృష్ట్యాన్ని పరీక్షించుకుంటున్నారు ఎమ్మెల్యే సంజయ్. ఈ స్థానం బీఆర్ఎస్ కు చాలా కీలకం.

* బాల్కొండ నుంచి కాంగ్రెస్ తరపున సునీల్​ కుమార్ ముత్యాల ఉన్నారు. బీఆర్ఎస్ తరపున మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ వేములకు గట్టి పట్టు ఉంది. ప్రస్తుతం మంత్రిగానూ కొనసాగుతున్నారు. అంతేకాదు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు వేముల చాలా కీలక నేత. 

* ధర్మపురి (ఎస్సీ) నుంచి కాంగ్రెస్ తరపున లక్ష్మణ్​ కుమార్ ఉన్నారు. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున కొప్పుల ఈశ్వర్ పోటీ పడుతున్నారు. గతంలోనూ వీరిద్దరూ ఎన్నికల్లో తలపడ్డారు. 

* మేడ్చల్‌ నుంచి కాంగ్రెస్ తరపున తోటకూర వజ్రేశ్‌ యాదవ్‌ ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. మరోసారి ఎమ్మెల్యే అయ్యి.. మంత్రి పదవి పొందాలని మల్లారెడ్డి ఆశపడుతున్నారు. కానీ, మల్లారెడ్డికి ఈసారి కొంచెం గడ్డు పరిస్థితులే కనిపిస్తున్నాయి. చాలా గ్రామాల్లో నిరసనలు వ్యక్తం కావడమే ఇందుకు నిదర్శనం. 

* మంథని నుంచి కాంగ్రెస్ తరపున దుద్దిళ్ల శ్రీధర్​ బాబు పోటీ పడుతున్నారు. గతంలో ఈయన మంత్రిగానూ పని చేశారు. బీఆర్ఎస్ నుంచి పుట్ట మధ బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఈయన మంథని జెడ్పీ చైర్మన్ గా ఉన్నారు. అందరి దృష్టి మంథనిపైనే ఉంది.

* అందోల్‌ (ఎస్సీ) నుంచి కాంగ్రెస్ తరపున దామోదర రాజనర్సింహ బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ తరపున చంటి క్రాంతికిరణ్​ ఉన్నారు. ఈయన గతంలో జర్నలిస్టుగా పని చేశారు. రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోవైపు.. దామోదర రాజననర్సింహ డిప్యూటీ సీఎంగా పని చేసిన అనుభవం ఉంది. మరోవైపు.. బీజేపీ తరపున మాజీ మంత్రి బాబు మోహన్​ బరిలో ఉండే అవకాశం ఉంది.

* సంగారెడ్డి నుంచి కాంగ్రెస్​ తరపున మాజీ మంత్రి జగ్గారెడ్డి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి చింతా ప్రభాకర్ ఉన్నారు. గత ఎన్నికల్లో జగ్గారెడ్డిపై ప్రభాకర్ ఓడిపోయారు. అంతకుముందు ప్రభాకర్ పై జగ్గారెడ్డి ఓడిపోయారు. ఈ స్థానం కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

* నాంపల్లి నుంచి కాంగ్రెస్​ ఫైర్​ బ్రాండ్ ఫిరోజ్‌ ఖాన్‌ బరిలో ఉన్నారు. ఈయన గతంలోనూ ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ మాత్రం ఈ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరును ఇంకా ప్రకటించలేదు. 

* గోషామహల్​ నుంచి కాంగ్రెస్ తరపున మొగిలి సునీత బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇక బీజేపీ మాత్రం రాజాసింగ్ కు అవకాశం ఇస్తుందా...? లేక మాజీ మంత్రి ముఖేష్​ గౌడ్ కుమారుడు విక్రమ్​ కు టికెట్​ కేటాయిస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది. 

* సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెస్​ తరపున ఆదం సంతోష్‌ కుమార్‌ బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే పద్మారావు ఉన్నారు. 

* గద్వాల నుంచి కాంగ్రెస్ తరపున సరితా తిరుపతయ్య బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మాత్రం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. ఇటు బీజేపీ నుంచి డీకే అరుణ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. 

* కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ తరపున కసిరెడ్డి నారాయణ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ మధ్యే ఈయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి టికెట్ సాధించుకున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఉన్నారు.

* స్టేషన్‌ ఘన్‌పూర్‌ (ఎస్సీ) నుంచి కాంగ్రెస్ తరపున సింగాపురం ఇందిర బరిలో ఉన్నారు. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. 

* సనత్ నగర్ నుంచి కాంగ్రెస్ తరపున డాక్టర్ కోట నీలిమ బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ ఉన్నారు.

* అలంపూర్ (ఎస్సీ) నుంచి కాంగ్రెస్ తరపున సంపత్ కుమార్ ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి అబ్రహం ఉన్నారు.

* భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ తరపున గండ్ర సత్యనారాయణ, బీఆర్ఎస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు.