ఎన్నికల క్యాంపెయిన్‌‌లో ఏఐ .. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి రీచ్

ఎన్నికల క్యాంపెయిన్‌‌లో ఏఐ .. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి రీచ్
  • పోయినసారి సోషల్​ మీడియా.. ఇప్పుడు ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ హవా
  • ఏ భాషలో మాట్లాడినా లోకల్ భాషలోకి వాయిస్ మార్పు
  • డీప్ ఫేక్​లతో ప్రత్యర్థులపై అసత్య ప్రచారం
  • వాయిస్ క్లోనింగ్​లతో ఆడియో మెసేజ్​లు
  • టెక్నాలజీతో ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్న పార్టీలు 
  • పోలీసులు, సైబర్ నిపుణులకు సవాల్​గా మారిన వైనం

సెంట్రల్​డెస్క్​/ హైదరాబాద్, వెలుగు : 2014 , 2019 లోక్ సభ ఎన్నికల క్యాంపెయిన్​లో  సోషల్ మీడియా కీలక పాత్ర పోషించగా..ఇప్పుడు దానికి మరో టెక్నాలజీ జతైంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). ప్రస్తుతం దేశవ్యాప్తంగా  ఏఐ జోరు కొనసాగుతున్నది. ఈ టెక్నాలజీతో వివిధ పథకాలను, ప్రకటనలను పార్టీలు ఈజీగా ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి. పార్టీ ఉద్దేశాలను తక్కువ ఖర్చుతో, తక్కువ టైంలో  ఎక్కువ మంది ఓటర్లకు రీచ్ అయ్యేలా ప్రచారం  చేస్తున్నాయి. పక్క పార్టీపై విమర్శలు గుప్పించాలన్నా.. తమ పార్టీ గురించి పాజిటివ్‌‌గా ప్రచారం చేయాలన్నా ఏఐకి పనిచెప్తున్నాయి.

లోకల్ భాషలోకి వాయిస్ చేంజ్

వారణాసిలో ఇటీవల నిర్వహించిన ‘కాశీ తమిళ సంగమం’ కార్యక్రమంలో ప్రధాని  నరేంద్ర మోదీ హిందీలో ప్రసంగించారు. దాన్ని ఏఐ సాయంతో  తమిళంలోకి వాయిస్ చేంజ్ చేశారు.

ప్రధాని మోదీ ఇప్పటిదాకా చేసిన ప్రసంగాలను బంగ్లా, కన్నడ, తమిళం, తెలుగు, పంజాబీ, మరాఠీ, ఒడియా, మలయాళం భాషల్లోకి ఏఐతో మార్చారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల అంతటా మోదీ ప్లాన్ చేసిన ర్యాలీలు, ప్రచార కార్యక్రమాల్లో ఏఐ(నమో యాప్) ద్వారా అనువాదాలను ఉపయోగిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ జాతీయ నేతలకు లాంగ్వేజ్ సమస్య రాకుండా ఏఐని ఉపయోగిస్తున్నారు.

వారు ఏ భాషలో మాట్లాడినా లోకల్ భాషలోకి వాయిస్ ను మారుస్తున్నారు. తద్వారా పార్టీ ఉద్దేశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీనికి ఖర్చు కూడా తక్కువ కావడంతో నేతలంతా లాంగ్వేజ్ కు ఏఐ టెక్నాలజీనే వాడుతున్నారు.  వివిధ రాష్ట్రాల్లోని ప్రజలకు మరింత చేరువ కావడానికి బీజేపీ ఐటీ సెల్ ఎప్పటికప్పుడు నేతల ప్రసంగాలను స్థానిక భాషల్లోకి అనువాదం చేస్తున్నది. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఓటరుకు దగ్గరవుతున్నది. దక్షిణాదితో పాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒడిశాల్లో మరిన్ని స్థానాలను గెలిచేందుకు ఏఐ వ్యూహాన్ని అనుసరిస్తున్నది.

ఏఐ వాడకంలో కాంగ్రెస్ జోరు 

కాంగ్రెస్ పార్టీ ఏఐ టెక్నాలజీ ద్వారా కార్యక్రమాలను రెడీ చేసి ప్రచారంలో ఉపయోగిస్తున్నది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ “మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి ”అనే స్లోగన్ తో గత అధికార పార్టీ నేతలు చేసిన అవినీతిని వీడియోల రూపంలో ప్రచారంలో ఉపయోగించి సక్సెస్ అయ్యారు. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్లి పార్టీ గెలుపునకు ఉపయోగపడిందని నేతలు చెబుతున్నారు.

ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ప్రచారంలోనూ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలతో పాటు తన100 రోజుల పాలనలో చేసిన అభివృద్ధిపై ఏఐ ద్వారా వీడియోలు క్రియేట్ చేస్తున్నది. వాటిద్వారా పార్టీ ఉద్దేశాన్ని నిరక్షరాస్యులకు  ఈజీగా  అర్థమయ్యేలా ప్లాన్ చేస్తున్నది. త్వరలో  నామినేషన్లు స్టార్ట్ కానున్న నేపథ్యంలో అప్పటి కల్లా ఏఐ వీడియోలను ఫైనల్ చేసేందుకు పార్టీకి పనిచేస్తున్న టెక్ నిపుణులు రెడీ అవుతున్నారు.

డీప్‌‌ఫేక్​తో పోల్స్‌‌పై ప్రభావం!

గత రెండు లోక్ సభ ఎన్నికల్లో పార్టీలు ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ పామ్స్ ఎక్కువగా ఉపయోగించాయి. తమకే ఓటేయాలంటూ..పాటలు రూపొందించి వాట్సాప్, ఫేస్​బుక్​ గ్రూపుల్లో పోస్ట్ చేశాయి. నేరుగా ఓటర్ల ఫోన్లకు వాయిస్‌‌ మెసేజ్‌‌ రూపంలో,  కాల్స్‌‌చేసి తమకే ఓటు వేయాలని అభ్యర్థులు కోరారు. అయితే, ఇప్పుడు ట్రెండు పూర్తిగా మారింది. లేని వ్యక్తిని ఉన్నట్లు.. అతడే స్వయంగా మాట్లాడుతున్నట్లు చూపించేందుకు, ఫేక్ ఫొటోలను, వీడియోలను, ఆడియోలను క్రియేట్ చేసేందుకు డీప్‌‌ఫేక్‌‌ అనే టెక్నాలజీ వచ్చేసింది.  

ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు గత రెండేళ్లుగా డీప్‌‌ఫేక్‌‌ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్నది. ఎవరో మాట్లాడిన వీడియోకు, ఆడియోకు ప్రత్యర్థి అభ్యర్థి ముఖంతో మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్నారు. దాంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి. అదిచూసి నిజమేనని నమ్ముతున్న ఓటర్లు తమ ఓటును తప్పుడు వ్యక్తికి వేస్తున్నారు. నిత్యం ప్రచారంలో బిజీగా ఉండే నేతలకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం పెద్ద తలనొప్పిగా మారింది. డీప్‌‌ఫేక్‌‌ పై ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖతో పాటు ప్రధాని మోదీ కూడా ఎన్నో సార్లు ఆందోళన వ్యక్తం చేశారు. కంటెంట్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి సలహాలు ఇవ్వాలని కోరారు. 

వాయిస్ క్లోనింగ్‌‌తో లేనిది ఉన్నట్లు

పలు పార్టీలు వాయిస్ క్లోనింగ్ ద్వారా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. డీప్‌‌ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. 2018లో మరణించిన కరుణానిధి తమిళనాడులోని అధికార డీఎంకే  ఇటీవల నిర్వహించిన సమావేశానికి అతిథిగా అటెండ్ అయినట్లు ఓ వీడియో వైరల్ అయ్యింది. రాష్ట్రంలో తన కొడుకు స్టాలిన్ నాయకత్వం బాగుందని డీప్‌‌ఫేక్ వీడియోలో కరుణానిధి ప్రశంసించారు. ఇటువంటి వీడియోలు ఓటర్లను తప్పుదారి పట్టిస్తాయని నేతలు ఆందోళన చెందుతున్నారు.  

రంగంలోకి ఎన్నికల సంఘం 

డీప్‌‌ఫేక్‌‌లపై ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. దానిద్వారా వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు గూగుల్‌‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. గూగుల్ తన వినియోగదారులకు రాబోయే రోజుల్లో యూట్యూబ్, సెర్చ్‌‌లో ఎన్నికలకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. ఓటుపై హిందీ, ఇంగ్లీషు భాషలలో ప్రజలకు సరైన సమాచారమిస్తుంది. ఎన్నికల సమయంలో ఏఐ రూపొందించిన కంటెంట్ ఆధిపత్యాన్ని ఆపడానికి  కొన్ని ఫీచర్లను క్రియేట్ చేస్తామని హామీ ఇచ్చింది. దీని ద్వారా సాధారణ వినియోగదారులు ఏఐ సృష్టించిన నకిలీ కంటెంట్‌‌ను గుర్తించగలరని పేర్కొంది.

దుర్వినియోగాన్ని అరికట్టాలి

ఏఐ రూపొందించిన కంటెంట్‌‌ను దుర్వినియోగం చేయడంపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని  నిపుణులు కోరారు. సోషల్ మీడియా ప్లాట్‌‌ఫారమ్‌‌లలో రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్‌‌లు లేవని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ హెడ్ అనిల్ వర్మ చెప్పారు. ఇలా చేస్తే తప్ప వాటిని అదుపు చేయడం సాధ్యం కాదని సూచించారు. డీప్‌‌ఫేక్ వీడియోలు వైరల్ కావడానికి కొన్ని గంటలు మాత్రమే సరిపోతాయన్నారు. దీని గురించి నిజం తెలిసేలోపై చాలా నష్టం జరగవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు.