
2025 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి వెనుజులాకు చెందిన కొరినా మచాడోకు లభించింది. శుక్రవారం ( అక్టోబర్ 10) న మచాడో పేరును నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటించింది. వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం కృషి చేసినందుకు గాను మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి 2025 లభించింది. ఈ బహుమతిని డిసెంబర్ 10, 2025న నార్వేలోని ఓస్లోలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. నోబెల్ శాంతి బహుమతికి గ్రహీతలకు బంగారు పతకం, డిప్లోమా, రూ. 8.7 కోట్ల నగదు బహుమతిని అందిస్తారు. బహుమతి నగదును నోబెల్ ఫౌండేషన్సమకూరుస్తుంది.
మచాడో ఎవరు..?
మరియా కొరినా మచాడో. 2025 నోబెల్ శాంతి బహుమతి పొందిన ఈమె.. వెనిజులా దేశం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత మార్పు తీసుకురావటంలో.. సైన్యం పాలనకు వ్యతిరేకంగా ప్రజా హక్కుల కోసం పోరాటం చేస్తున్నారామె. 2024 నుంచి ఆమె అజ్ణాత జీవితంలో ఉన్నారు. ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా.. వెనిజుల ప్రజల కోసం దేశంలోనే ఉంటూ.. లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచారు.
వెనిజుల దేశ పాలకులకు వ్యతిరేకంగా ప్రజలను ఏకంగా చేయటంలో.. ఒక్క తాటిపైకి తీసుకురావటంలో మరియా మచాడో చేసిన కృషికి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినట్లు కమిటీ స్పష్టం చేసింది. సైన్యానికి వ్యతిరేకంగా గళం విప్పటంలో.. పోరాటం చేయటంలో ఆమె ఎప్పుడూ శాంతి మార్గాన్నే ఎంచుకున్నారు. ఏ దశలోనూ హింసాత్మక దోరణిని సమర్థించలేదు. ప్రజల హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేశారు మచాడో.
ఓస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇనిస్టిట్యూట్ లో శుక్రవారం ఉదయం 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30కి) 2025 నోబెల్ శాంతి బహుమతి విజేతగా కొరినా మచాడో పేరును ప్రకటించారు. ఇటీవలి కాలంలో అత్యంత ఉత్కంఠభరితంగా ఎదురుచూసే నోబెల్ శాంతి బహుమతి ఇదే. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత మూడు నెలలుగా ఈ బహుమతి తనకు తప్పకుండా వస్తుందని బహిరంగ ప్రచారం చేశారు.
వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె అవిశ్రాంత కృషికి ,నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత పరివర్తనను సాధించడానికి ఆమె చేసిన పోరాటానికి గాను మరియా కొరినా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేయాలని నార్వేజియన్ నోబెల్ కమిటీ నిర్ణయించిందని నోబెల్ బహుమతి కమిటీ X పోస్ట్‌లో పేర్కొంది.