దైవ దర్శనం చేసుకుని వెళ్తుండగా.. బస్సు బోల్తా.. 21 మంది మృతి

దైవ దర్శనం చేసుకుని వెళ్తుండగా.. బస్సు బోల్తా.. 21 మంది మృతి

అహ్మదాబాద్: దసరా నవరాత్రుల సందర్భంగా దైవ దర్శనానికి వెళ్లిన వారి ఆధ్యాత్మిక యాత్ర క్షణాల్లో పెను విషాదంగా మారిపోయింది. వర్షం వారి పాలిట మృత్యువుగా కమ్ముకొచ్చింది. ఘాట్ రోడ్డులో వెళ్తున్న బస్సు బోల్తా పడి 21 మంది భక్తులు మరణించగా.. 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.

భారీ వర్షంలో బస్సు కంట్రోల్ కాక..

గుజరాత్ లోని బనాస్కాంత జిల్లా అంబాజీ పట్టణం సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిందీ ఈ ఘోరం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దాదాపు 70 మందికి పైగా భక్తులు ఓ ప్రైవేటు బస్సులో అంబాజీ మందిరానికి వచ్చారు. ఆలయంలో దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా.. అంబారీ – దంతా మార్గంలోని త్రిశూలియా ఘాట్ రోడ్డు వద్ద బస్సు బోల్తా పడింది. వేగంగా వస్తున్న బస్సును భారీ వర్షం కారణంగా డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని జిల్లా ఎస్పీ అజిత్ రజియాన్ చెప్పారు. ఈ ఘటనలో 21 మంది మరణించారని, 50 గాయపడ్డారని తెలిపారు.

బస్సు బోల్తాపడిన విషయం తెలియగానే ఆగమేఘాలపై రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. జేసీబీల సాయంతో బస్సును చక్కగా పెట్టి… సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎప్పీ స్వయంగా ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

ప్రధాని మోడీ సంతాపం

ప్రమాదం గురించి తెలిసి ప్రధాని నరేంద్ర మోడీ మృతులకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ ఘటన గురించి తెలిసి చాలా బాధ కలిగిందన్నారు. అధికారులు సహాయ చర్యలు చేపడుతున్నారని అన్నారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా సంతాపం ప్రకటించారు.