
అబుజా (నైజీరియా): నైజీరియాలో జరిగిన ఘోర ప్రమాదంలో 21 మంది అథ్లెట్స్ మృతి చెందారు. నేషనల్ స్పోర్ట్స్ టోర్నమెంట్‌లో పాల్గొని తిరిగి వస్తుండగా శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగిందని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ (ఎఫ్‌ఆర్‌ఎస్‌సీ) తెలిపింది. బస్సు డ్రైవర్ నిద్ర మత్తు, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఏ ఇతర వాహనం క్రీడాకారులు ప్రయాణిస్తున్న బస్సును ఢీకొనలేదని, అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. రాత్రి సమయంలో సుదీర్ఘంగా డ్రైవ్ చేయడంతో డ్రైవర్ అలసిపోవడం, బస్సు అతివేగం ప్రమాదానికి కారణాలని పేర్కొన్నారు.
సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒగున్ రాష్ట్రంలో జరిగిన 22వ జాతీయ క్రీడా ఉత్సవాల నుంచి అథ్లెట్స్ ఉత్తర నైజీరియాలోని కానో సిటీకి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.